సాహితి

అక్షరోదయాన్ని రగిలించిన ‘‘కొత్త పొద్దుపొడుపు కోసం...’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త పొద్దుపొడుపుకోసం
పొయిట్రీ
పొత్తూరి సుబ్బారావు
వెల: రూ.90/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు

కవికి సామాజిక దృష్టి చాలా అవసరం. లోచూపుతో తడిమే ప్రతి అంశాన్నీ కవితాత్మక పరిశీలనాశక్తితో అధ్యయనం చేసి అక్షరానుభూతులుగా వ్యక్తీకరించడం నిత్యకృత్యంలో ఒక భాగం. ఇలాం టి తపనలోంచే పలు సామాజిక అంశాలను కవితా వస్తువులుగా స్వీకరించి ఇతివృత్తాలుగా మలచడం అలవాటుగా మారుతుంది. ఈ కోవకి చెందిన కవే ‘పొత్తూరి సుబ్బారావు’గారు. ‘సాహితీ కిరణం’ మాసపత్రిక సంపాదకులుగా లబ్దప్రతిష్ఠులు. ఇత ను రాసిన కవితా సంపుటి ‘‘కొత్త పొద్దు పొడుపుకోసం’’. ఈ కవిత్వమంతా పలు సామాజిక సంఘర్షణలకు ప్రతి రూపం. విభిన్న, పార్శ్వాలను స్పృశిస్తూ ఆలోచనాత్మకంగా సాగిన అక్షర యుద్ధం. సరళమైన భాషతో, సున్నితమైన భావాలతో జన సామాన్యానికి చేరువగా నిలుస్తారు. కాబట్టే ఆబాలగోపాలానికీ ఈ సంపుటి చిరపరిచితంగా మారిం ది. 50 కవితలతో పొందుపరచబడిన ఈ పుస్తకంలో సి.నా.రె., గోపీల ముందుమాటలు ఆప్తమిత్ర వాక్యాలను పరిచయం చేస్తాయి. ఇది 5వ కవితాసంపుటి. చదివించుకుపోయే లక్షణం ఈ అక్షరాల నిండా కనిపిస్తుంది.
‘‘పచ్చదనాన్ని కోల్పోయిన మనిషి
వసంతమొచ్చిందన్న ఆతురతతో
కోకిల కూతలను
సెల్‌ఫోన్ రింగుటోన్‌లో విని
అల్ప సంతోషి అవుతాడు’’అంటారు కవి పొత్తూరి సుబ్బారావు. ‘‘ఋతువులతోపాటు ముం దుకు సాగిపోతూ’’ అనే కవితలో. కాలగమనంలో వచ్చే మార్పు లు ఆధునిక సాంకేతిక యుగం లో సృష్టిస్తున్న, వింత పోకడలకు అద్దంపట్టిస్తుంది ఈ రచన. సహజత్వం స్థానంలో కృత్రిమ వాతావరణానికి అలవాటుపడిన సందర్భాన్ని, విషాద దృశ్యం గా కళ్ళకికట్టించే ప్రయత్నం చేస్తారు కవి.
‘‘చెదిరిన సుందర స్వప్నం’’ కవితలో కవి పొత్తూరి సుబ్బారావుగారి గుండెచప్పుడు అక్షరాల్లో ఇలా వినిపిస్తుంది.
‘‘బహు సంతోషంగా గనులను స్వీకరించిన
బహుళజాతి సంస్థల ఘనులు
భూమాతను కుళ్ళపొడిస్తే
ప్రాజెక్టులంటూ మరికొందరు బడాబాబులు
కొండలనమాంతంగా బద్దలుకొట్టగా
విరుచుకుపడ్డ అరాచికం
వరదలకు స్వాగతం పలికింది’’అని చెబుతున్నపుడు గతంలో చార్‌ధామ్ యాత్రలో ఉప్పొంగిన వరదల కథనం దృశ్యరూపం కడుతుంది. ఈ నేపథ్యం వెనుక తొంగి చూసిన కారణాలు అనేకం. అవివేకంతో ప్రకృతి వినాశనానికి, పర్యావరణ కలుషితానికి పాల్పడ్డ దుశ్చర్యలు చాలా వున్నాయి. వీటి మూలాల లోతుల్ని బహుళజాతి సంస్థల చేతలతో ముడిపెడుతూ చెప్పిన వర్తమాన సామాజిక నేపథ్య సంఘర్షణ జీవన దృశ్య కథన కవిత ఇది. మనిషి చేసుకున్న స్వయంకృతాపరాధ పరాకాష్ఠ చర్యలకు నిలువెత్తు ప్రతిబింబ ముఖచిత్రమిది.
‘‘ఓ గాయపడ్డ హృదయంకోసం’’ కవితలో కవి అంతర్వేదన ఈ రకంగా బొమ్మకడుతుంది.
‘‘మనిషి స్థిరంగా నిలబడివున్నా సరే
హృదయం మటుకు కదులుతూనే ఉంటుంది
భౌతికంగా అగుపించని హృదయ స్పందనలు
మనిషి మస్తిష్కంలోకి ఆలోచనలను జారవిడుస్తాయి’’ అని అంటున్నపుడు సాక్షాత్కరించే భావం లోలోపటి పొరలను మృదువుగా తడుముతూ ఆర్ద్రంగా పొదివి పట్టుకుంటుంది. అంతర్లీనంగా గూడుకట్టిన మనోవేదన పైకి కనిపించని హృదయపుటంచులను తడుముతూనే ఉంటుంది. ఈ రాపిడిలోంచి రాలిపడిన అనుభవ కెరటాలు గాయాల సుడులను తిప్పుతూ కల్లోల తరంగాలను మీటుతాయి. ఈ స్పృహ మనిషిని ఓచోట స్థిరంగా నిలవనీయదు. ముందువెనుకల ఊగిసలాటలో గతం- వర్తమానాల చరిత్ర కదలికల్ని బేరీజు వేస్తుంటుంది. అలా వెంపర్లాడుతున్న తడుములాటలోంచే ఈ అక్షరాలు ఊపిరి పోసుకున్నాయి. ఇవి కవి హృదయార్తిని అక్షరబద్దం చేస్తాయి.
ఇలా ఈ సంపుటిలో మనసుని ఓలలాడించే సందర్భ దృశ్యాలు అనేకం ఉన్నాయి. కవితాత్మక తపన అంతర్లీనంగా వెంటాడే భావ పరిమళాలతో ‘కొత్త పొద్దుపొడుపుకోసం’ అనే్వషించి నిరీక్షించేలా చేస్తాయి. వీటిలో కొన్ని కవితాక్షర వాక్యాలు మనసుని మెలిపెడతాయి. ‘‘వౌనంపై వెదజల్లిన మాటల మల్లెలు/ పెదవులపై చిరునగవులకు స్వాగతం పలుకుతాయి,’’ ‘‘్భదేవిని హరిత లేపనంతో/ సింగారించింది మా పల్లె’’, ‘‘తెలుగుజాతి వేరుకుంపటులు పెట్టుకున్నా/ తెలుగు అక్షరం ఒక్కటై వెలుగుతూనే ఉంటుంది,’’ ‘‘తల్లడిల్లిన పుడమిపైన/ శాంతి కాముక విత్తనాలు మొలకెత్తుతాయి’’, ‘‘నిశ్శబ్ద సముద్రం/ పున్నమిరాకతో/ ఆటుపోటులకు గురైనట్లే’’, ‘‘చెదిరిన బాల్యపు స్మృతులపై/ నవ యవ్వనపు తేజస్సును కప్పుకొని’’వంటి కవితాత్మక వాక్యాలు అక్షరాలను రసాత్మకం చేస్తాయి. గోరంతలో కొండంత అర్థాలను విడమర్చి చెబుతాయి. ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకోవడంలో ఉన్న సంతోషం పాఠకుల్ని, తన్మయుల్ని చేస్తుంది. ఇలా లోతైన భావాలతో అర్థవంతంగా కవిత్వాన్ని పండించిన కవి పొత్తూరి సుబ్బారావుగారిని ఎంతైనా మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే!

- మానాపురం రాజా చంద్రశేఖర్ 9440593910