సాహితి

తంజావూరు తెలుగు కవయిత్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీ.శ.1550 ప్రాంతాలలో శ్రీకృష్ణదేవరాయలు సామంతులైన నాయక రాజుల ఆధ్వర్యంలో దక్షిణాదిన తంజావూరు ఆంధ్ర రాజ్యంగా స్థాపించబడిన విజయనగర పతనానంతరం అక్కడి కవులు కళాకారులు దక్షిణాంధ్ర నాయక రాజుల ప్రాపకం సంపాదించుకున్నారు. 1550 సంవత్సరం నుండి సుమారుగా 1673 సంవత్సరం వరకు ఆంధ్ర నాయక రాజులు తంజావూరు కేంద్రంగా పరిపాలన సాగించారు. వీరి కాలంలో తెలుగు ప్రబంధ, యక్షగాన సాహిత్యం ఉజ్వలంగా ప్రకాశించింది. ఆ తర్వాత 1855 సంవత్సరం వరకు మహారాష్ట్ర నాయకులు తంజావూరుని పరిపాలించారు. వారు కూడా తెలుగు సాహిత్యాన్ని పోషించారు. ఈ కాలంలో శహాజీ (1684-1712) చేసిన తెలుగు సాహిత్య సేవ ఎన్నదగినది. తంజావూరు రాజుల కాలంలో తెలుగు కావ్యాలకి, యక్షగాన, ప్రబంధం మొదలైన ప్రక్రియలకి, కవయిత్రులకీ సముచిత స్థానం లభించింది.
రామభద్రాంబ: 17వ శతాబ్దంలో దక్షిణ దేశంలో తెలుగు రాజ్యాన్ని అత్యంత ప్రతిభా పాటవాలతో పాలించిన మూడవ నాయకరాజు రఘునాథుని ఆస్థాన కవయిత్రుల్లో రామభద్రాంబ కూడా ఉంది. ఈమె రాజుకి ఉపాపత్ని అని పరిశోధకుల అభిప్రాయం. ‘రఘునాథాభ్యుదయము’ పేరుతో రఘునాధుని నాయకుడుగా మలిచి ఆయన జీవిత వృత్తాంతాన్ని కావ్యంగా మలిచింది. ఈ కావ్యంలో 900 శ్లోకాలున్నాయి. రఘునాథుని విజయాలను, సాహిత్య ప్రియత్వం, కళాపోషణ పండిత గోష్ఠుల వంటి విశేషాలను ఉత్సాహంతో వర్ణించింది.
మధురవాణి: మధురవాణి ‘‘రామాయణ సార కావ్య తిలకము’’ అనే కావ్యాన్ని రాసింది. రఘునాథుడు రచించిన ఆంధ్ర రామాయణాన్ని ఆయన అనుమతితో సంస్కృతంలోకి అనువదించింది. ఒక సందర్భంలో రఘునాథుడు ఈ కవయిత్రిని మధురవాణి అని సంబోధించి బిరుదుగా ప్రదానం చేయటంవల్లనే ఈ పేరు స్థిరపడి ఉండవచ్చని, అసలు పేరు వేరొకటి కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.
పసుపులేటి రంగాజమ్మ: పసుపులేటి రంగాజమ్మ మన్నారు దాస విలాసం అనే పేరుతో ఒక యక్షగానాన్ని, పదబంధాన్ని రచించింది. ఈ రెండింటిలోను ఇతివృత్తం ఒక్కటే. విజయరాఘవుని రాజసభ, విద్వత్ గోష్ఠులు, ఆనాటి జన జీవన విధానం, విజయరాఘవుని పరిణయం ఇందులోని సారాంశం. రంగాజమ్మ ఉషాపరిణయం అనే మరొక ప్రబంధాన్ని కూడా రాసింది. భారత, భాగవత, రామాయణాలను కూడా రాసింది. విజయ రాఘవుడి ఆస్థాన కవయిత్రిగానూ, ఆయన పట్టమహిషిగానూ ప్రఖ్యాతి పొందింది.
కృష్ణాజమ్మ: విజయ రాఘవుడి ఆస్థానంలో కృష్ణాంబ అనే కవయిత్రి ఉంది కానీ ఆమె రాసిన కావ్యాల గురించి ఏ ఆధారమూ లభించటంలేదు. ‘కృష్ణాజీ సమకాలీనురాలైన రంగాజమ్మ సరస గుణ నిష్ణాత కృష్ణాజమాంబ అనే మాటతో కృష్ణాజమ్మకే అంబ అనే పదాన్ని చేర్చారని తేలిపోతుందని రచయిత్రి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గ్రంథస్తం చేశారు. కృష్ణాజమ్మ విజయ రాఘవుడి ఆస్థానంలో విదుషీమణులందరితో కలిసి వసంత కేళికలు వినిపించేదని పసుపులేటి రంగాజమ్మ పేర్కొంది. ఆశుకవిత్వం, ధారణ, ఛందోశాస్త్రం, సమస్య పూరణంలో కూడా ఆమె దిట్ట అని తెలుస్తుంది. ఛందస్సాస్తమ్రుని పదమూడు కోట్ల నలభై రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందల ఇరవయ్యారు వృత్తాలలో ఏ వృత్తంలో పద్యం చెప్పమన్నా కూడా వెంటనే చెప్పగలిగేటంత ప్రావీణ్యురాలు. సంస్కృత, తెలుగు భాషల్లో కవిత్వం చెప్పగలిగిన కృష్ణాజమ్మ రచనలు లభించకపోవటం పెద్ద ఓటు.
చంద్రరేఖ: విజయరాఘవుని ఆస్థానంలోని మరొక మణిపూస చంద్రరేఖ. 1584-1616 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన వీర వెంకట రాయల ఆస్థాన నర్తకిగా వున్న చంద్రరేఖ ఆయన మరణానంతరం తంజావూరు ఆస్థానాన్ని ఆశ్రయించి విజయ రాఘవునికి ఉపపత్ని అయింది. నర్తకిగా, విదుషీమణిగా తన జీవితాన్ని కొనసాగించింది. విజయ రాఘవుని కాలంలో రచించబడ్డ ‘రాజగోపాల విలాస కావ్యం’లోని అన్ని ఆశ్వాసాలకు చివర చంద్రరేఖ విజయ రాఘవుడి భార్యగా అభివర్ణించబడింది.
ముద్దుపళని: దక్షిణాంధ్ర యుగపు తంజావూరు తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని వాద వివాదాలకు గురైన కావ్యం ‘రాధికా సాంత్వనము’. ముద్దుపళని తంజావూరు పరిపాలించిన మహారాష్ట్ర రాజులైన ప్రతాప సింహుని ఉప పత్ని, ఆస్థాన కవయిత్రి కూడా. దేవదాసి కుటుంబంలో పుట్టిన ముద్దుపళని తల్లి పోలిబోటి, నాన్నమ్మ తంజానాయకి కూడా కవయిత్రులే అని తన రాధికా సాంత్వన కావ్య అవతారికలో చెప్పుకుంది. తాను నాట్యకత్తెననీ, శరీర కాంతిలో రత్నం వంటిదానిననీ, లలిత సకల కళా ఫ్రౌడితో వెలసినట్లు, పండితులకు సన్మానాలు చేసినట్లుగానూ చెప్పుకుంది.
నాలుగు ఆశ్వాసాలు 585 గద్య పద్యాలలో రచించబడ్డ ‘రాధిక స్వాంతనము’ ప్రబంధం ఆనాటి దక్షిణ దేశపు శృంగార కావ్యాల కోవకు చెందినది. స్ర్తి అంతరంగాన్ని స్ర్తిల భావనలను ఆవిష్కరించిన ఈ కావ్యం కాలంతోపాటు ముందుకు సాగుతోంది.
అలభ్యమైనవి.. అచ్చుకి నోచుకోనివి, అసంపూర్ణంగా వుండి పరిష్కారానికి నోచుకోని ప్రాచీన రచయిత్రుల తాళపత్ర గ్రంథాలపై పరిశోధన జరగాల్సిన అవసరం ఎంతో వుంది.

- పుట్ల హేమలత, 8500496117