సాహితి

తాత్విక ఆలోచనాపరుడు పాపినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి కవిత్వాన్ని అనుభవించి పలవరించవచ్చు. కానీ వివరించడం అంత సులభమైన పనేమీ కాదు. శివశంకర్ ఉత్తమ కవిత్వం రాస్తున్న విశిష్ట కవి. మూడున్నర దశాబ్దాలకు పైగా రాస్తున్నప్పటికీ తాజాదనంగానీ, చిన్నదనంగానీ కోల్పోకుండా నిత్యనూతన కవిత్వం రాస్తున్న కవి. అయితే అతనలా నిత్యనూతన కవిత్వం ఇప్పటికీ ఎలా రాయగలుగుతున్నాడు? ఏమిటతని ప్రత్యేకత? ఇతర కవుల్తో పోల్చినపుడు ఏ విధంగా అతడు భిన్నమైన కవి? అని ఆలోచించాలి.
జీవితాన్ని గురించి, మానవ సంబంధాల తీరుని గురించి స్పష్టమైన అవగాహన, బలమైన సరళమైన తాత్విక దృష్టీ, కవితా వస్తువుతో గాఢమైన ఆత్మసంబంధము, సూటిగా స్పష్టంగా మనసుతో సంవదించే మృదువైన భాష-శివశంకర్‌లోని విశిష్ట లక్షణాలుగా మనం చూడవచ్చు.
శివశంకర్ కవిత్వంలో రైతు సమస్యలు, రాజ్యస్వభావం, పతన విలువలు, స్ర్తి పురుష సంబంధాలు, వస్తు సంస్కృతి, స్వీయ అనుభవాలు, ఆత్మానే్వషణ, పరారుూకరణ వంటి ఎంతో వైవిధ్యంతో కూడిన కవితా వస్తువులు దర్శనమిస్తాయి. ఎన్నో కొత్త వస్తువుల్ని సరికొత్తగా చెప్పడము కనిపిస్తుంది.
శివశంకర్ మదర్ థెరిసా, వివేకానందుడు, సెర్జిబుబ్కా, స్టీఫెన్ హాకింగ్ వంటి విశిష్ట వ్యక్తుల్ని గురించి హరిప్రసాద్ చౌరాసియా, బిస్మిల్లాఖాన్, ముఖేష్ వంటి సంగీతకారుల్ని గురించి తాను పరిచయం కలిగిన సాధారణ వ్యక్తులలోని అసాధారణ గుణౌన్నత్యాన్ని గురించి ఎన్నో కవితలు రాసారు.
ఒక వ్యక్తి తన జీవిత సర్వస్వాన్ని అనాధలకు, రోగగ్రస్తులకు, అభాగ్యులకు సేవ చేయడం కోసమే వినియోగించడం అసాధారణమైన విషయం. మదర్‌లోని ఈ దయాగుణానికీ, ప్రేమ గుణానికీ చలించిపోయాడు కవి. ఉత్తమ మానవ లక్షణం ఎవరిలో కనిపించినా గుర్తించి, గౌరవించడం మంచి కవి లక్షణం. ఒకానొక పాపరహిత లోకం నుంచి మానవాళి కోసం దిగివచ్చిన కాంతి దేవతగా మదర్ థెరిసాను సంభావించాడు శివశంకర్. జాలిరెక్కలతో ప్రపంచం మూలమూలకీ సాగిపోయే వ్యక్తిగా వర్ణించాడు.
శూన్యాకాశాల్లో తెగిన గాలిపటాలైన వాళ్లకీ
రోగాలు శపించీ, శరీరాలు శుష్కించీ
దిక్కులు చివర చూపులు నిలిపి
మృత్యువు చీకటిలోకంలోకి మెల్లిమెల్లిగా జారేవాళ్లకీ
జీవితాశ కల్పిస్తావు..
పువు మెత్తని చేత్తో ప్రాణలేపనం పూస్తావు
దీనదేహాల్ని అందరూ అసహ్యించుకునే చోట
అంతరంగాలు రాళ్లై ఘనీభవించిన చోట
ఆర్థ్ర పరిమళాలు చల్లి
ఇవ్వటంలోని ఆనందాన్ని బోధపరుస్తావు.
పెట్టుబడిదారీ సమాజంలోని వ్యాపార సంస్కృతి మనిషిని వస్తువుకు బానిసను చేసింది. తోటి వ్యక్తులకు తను దూరమయ్యేలా చేసింది. ప్రేమ, దయ, త్యాగం వంటి మానవ గుణాల్ని అతడు కోల్పోయేలా చేసింది. మనిషిని కేవలం లాభాపేక్ష గల స్వార్ధ జీవిగా మార్చివేసింది. దయ, కరుణ వంటి మానవీయ గుణాల్ని కాపాడుకోవడంలోనే కాదు, నిరంతరం కుంగదీసే పరిస్థితులనుంచి మనల్ని మనం నిలబెట్టుకోవడం, సాహస గుణాన్ని నిరంతరం గుణాకారం చేసుకోవడం ఒక అవసరం.
అలాగే చికాగోలో వివేకానందుడు ప్రసంగించిన వేదికమీద నిల్చుని పొందిన అనుభూతిలో రాసిన కవిత ‘వివేక వాక్యం’ వలస స్థాపనతో, భౌతిక విలువలతో భారతీయ సంస్కృతినీ, దానిలోని ఆధ్యాత్మిక విలువలను ఆంగ్లరాజ్యం పరిహసిస్తున్న సమయాన మనదేశ సంస్కృతినీ, మన విలువల ఔన్నత్యాన్నీ గొప్పగా విశే్లషించి మన ఆత్మాభిమానాన్ని చాటిన మేటి వ్యక్తి వివేకానందుడు. యువతను ఉత్తేజపరుస్తూ అతడు చేసిన బోధనలు శక్తివంతమైనవి.
తాను రాసే ఏ కవితా వస్తువునైనా వర్తమాన సందర్భంలో ముడిపెట్టడం, భవిష్యదాశయంతో సమన్వయించడం శివశంకర్ కవిత్వ నైజం. అయితే ఆశయ రూపంలో ఆదర్శం, జ్ఞానరూపంతో సిద్ధాంతం తననీ, కవితనీ మింగేయకుండా సున్నితంగా సమన్వయపరుచుకోవడం శివశంకర్ చైతన్యంలోని ప్రధానమైన అంశం. అందుకే అతని కవిత్వం సిద్ధాంత రాద్ధాంతాలతో కాకుండా నేరుగా మానవ చైతన్యంతోనే సంవదిస్తుంది. హృదయం మేథగానీ మేధ హృదయాన్ని గానీ అధిగమించని ఒక సమతులనత అతని చైతన్యంలోనే ఉంది గనుకనే ఆతని కవిత్వం నిత్యనూతనంగా ఉండగలుగుతుంది.
సంగీతానుభూతిని మాటల్లోకి కవిత్వంలోకి వ్యక్తం చేయడం సులభసాధ్యమైన పనేమీకాదు. కానీ ప్రతిభావంతుడైన కవికి, భాషమీద భావంమీద ఊహా శాలీనత మీదా పట్టు సాధించే కవికి అది సాధ్యమే. కవిత్వానుభూతిలో మనిషి వికసించడం ఎలా వుంటుందో అనుభవైక వేద్యమే తప్ప వివరించి వర్ణిస్తే అర్ధమయ్యేది కాదు.
బిస్మిల్లాఖాన్ గురించి శివశంకర్ రాసిన ‘సన్నాయితో అతను కవిత ఒక సంగీత విద్వాంసుడుగా అతడు భారతీయ సంస్కృతిలో ఎలా ఐక్యమైపోయాడో వర్ణిస్తుంది.
భగవద్గీత చదవలేదు.. ఖురాను కంఠస్థం చేయలేదు
కాకపోతే అతను.. ఒకానొక మహా శివరాత్రి
కాశీ విశే్వశ్వరాలయం పైన నెలవంక తగిలించాడు.
మనిషిని గురించి రాసినా, ప్రకృతిని గురించి రాసినా, పసితనం గురించి రాసినా శివశంకర్ అనుభవ సామరస్యానే్న జీవితంలోను కవిత్వంలోను కోరుకుంటాడు. సమస్త వైరుధ్యాల మధ్య, సంక్లిష్టతల మధ్య జీవితాన్ని సరళంగా, నిసర్గంగా అనుభవించడమెలాగో అతని కవిత్వం మనకు నేర్పుతుంది. అతని ఆలోచనా పరిధిని వస్తుగతంగా అంచనా వేయలేని వారు అతను స్వీకరించే కవితావస్తువుల్ని చూడగానే కొంతమంది ప్రగతివాద ఆలోచనా పరులతోనే ఈ పేచీ. ఎందుకంటే మదర్ థెరిసాని, శ్రమ జీవినీ, వివేకానందుణ్ణి, బుబ్కానీ ఒకే గాటన కట్టేయడమెలాగో వారికెంతకూ అర్ధంకాదు. ఎందుకంటే అటు ఇటు మెసలడానికి ఏమాత్రం అవకాశమివ్వని వారి ఆలోచనా విధానానికి ఈ కవితా వస్తువులు వైరుధ్యాలతో కూడినవి. కానీ సారాంశంలో శివశంకర్ ఏమిటి అని అతడ్ని అంచనా వేయప్రయత్నిస్తే-ప్రాథమికంగా అభ్యుదయానికి దూరం కాని బహుళ తాత్విక ఆలోచనాపరుడిగా అతడు కన్పిస్తాడు.

- బి. ధర్మారెడ్డి