సాహితి

వ్యవహారిక వచన రచనకు ఆద్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1938లో విశాఖపట్నం నుంచి ఒక యువ కవి దేశ చరిత్రలు గీతం రాస్తూ, ఏ శిల్పం, ఏ సాహిత్యం, ఏ శాస్త్రం, ఏ గాంధర్వం, ఏ వెల్గులకి ప్రస్థానం, ఏ స్వప్నం, ఏ దిగ్విజయం?’’ అని చివరి చరణంలో ప్రశ్నలు వేస్తాడు. దీనికి వందేళ్ల వెనకాల 1836లో, చదువులు లేవు. బడులు లేవు, తీర్చిన పాఠ్య ప్రణాళికలు లేవు, అక్కడక్కడా అయ్యవార్లు నడిపే బడులు తప్ప. వాటికి ఏ పాస్ సర్ట్ఫికెట్లు లేవు, సంస్కృత పంచకావ్యాలు, కాస్త వ్యాకరణం తెలిస్తే, అదే విద్య. గ్రాంధికమూ, వ్యవహారికమా ప్రసక్తే లేదు, ఇంకా ఏది ఉండాలి అనే గొడవ దాకా ఎందుకు?. పంధొమ్మిదో శతాబ్దపు తెలుగు భాషకు ఇదొక ప్రత్యూష కాలం. బల బల తెల్లవారుతున్న వేళ. స్థలం తెలుగువారి జీవన కేంద్రం మదరాసు పట్టణం. కందుకూరి వీరేశలింగం ఇంకా కన్ను తెరవలేదు. ఈయన కన్నా పద్నాలుగేళ్లు చిన్నవాడు అయిన గురజాడ, ఇంకో పాతిక ఏళ్ళు గడిస్తే తప్ప 1862లో కానీ పుట్టడు. అప్పటి కుంఫిణీ మదరాసు వ్యవహారిక తెలుగు జెండా ఎగిరింది. అది చరిత్ర. ఆ సంఘపు సామాన్యులు, సాధారణులు సృష్టించి వెళ్ళినది. వారికి తము ఏదో గొప్ప పని చేస్తున్నాము అని కానీ, తామేదో చారిత్రక వ్యక్తులు అవుతాము అని కానీ ఏ కోశానా స్పృహ లేదు.
ఈ కథ ఇలా నడవడానికి కారణం మళ్ళీ ఇద్దరు భారతదేశ అభిమానులు అయిన ఈస్ట్ ఇండియా కుంఫిణీ ఉద్యోగులే. తెల్లదొరలే. ఇద్దరూ కూడా ఒకరినొకరు చూసుకోలేదు. కానీ దక్షిణ భారత దేశ సాంఘిక, సంస్కృతిక, సాహిత్య, భాషా, స్థానిక కైఫీయత్‌ల (స్థల చరిత్రల) సంకలన కర్తలుగా, ఒకరు, అలాగే మరొకరు పదహారో శతాబ్దం తరువాతి తెలుగు భాషా వాఙ్మయ పరిశీలకులు పరిష్కర్తలుగా కూడా చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు. మొదటివారు కుంఫిణీ కొలువులో పెద్ద యుద్ధాలు, సర్వేయర్‌గా తొలి దక్షిణ భారత చిత్రపటాన్ని తయారుచేసేందుకు డెబ్భైవేల మైళ్ళు సర్వే చేసిన అధికారి, చిత్రకారుడు, తూర్పు ఇండియా కంపెనీ పాలనలో తొలి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పదవి నిర్వహించిన కల్నల్ మెకంజీ. వీరి పెద్ద సేకరణలో రాయలసీమలో దొరికిన ఒక రాత ప్రతి, రచయిత ఎవరో తెలియదు. ఇది హండే అనంతపురం రాజుల యుద్ధాల గురించిన ఒక సరళ కథనం. మెకంజీ సేకరణ చేసిన పదహారు భాషలకు చెందిన వేలాది రాతప్రతుల్లో ఇది కూడా ఒకటి. ఇది 1821కి ముందరే, మెకంజీ కలకత్తా సర్వేయర్ జనరల్‌గా ఉద్యోగానికి వెళ్ళగా, చెన్నపట్నంనుంచి ఆయన ప్రైవేటు సేకరణలో భాగంగా, బెంగాల్ వెళ్లిపోయింది. పదవిలో ఉండగానే మెకంజీ, అనారోగ్యంతో కలకత్తాలో కన్ను మూశారు. అప్పుడు వారి శ్రీమతి, మెకంజీ సేకరణ (కలెక్షన్) బెంగాల్ ప్రభుత్వానికి ఇరవై వేలకు అమ్మ చూపగా, సేకరణ విలువ, నాణ్యతా, శ్రమ ఎరిగిన గవర్నర్ జనరల్ విలియం బెంటిక్, ఈ మెకంజీ కలెక్షన్‌ను ఆ రోజుల్లోనే లక్ష రూపాయలకు ప్రభుత్వం తరఫున కొనుగోలుచేసి, అందులో దక్షిణ భారత భాషలకు చెందిన వాటిని మదరాసుకు పంపించారు.
1827లో మదరాసు వచ్చి, తెలుగు నేర్చుకుని, కుంఫిణి కొలువులో ఉన్న మరొక బ్రిటిష్ యువకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ చేతికి ఈ తెలుగు సేకరణ అంతా వచ్చింది. ఆయన తన తెలుగుకు మెరుగులు దిద్దుకోవడం, మొదటి పనిగా వేమన పద్యాల సేకరణ ఒక ముద్రణా చేసి, ఆంధ్ర గీర్వాణచ్ఛంధమ్ రాసి, అలాగే, తెలుగు ప్రాచీన కావ్యాలకు పలు రాతప్రతులు ఉంటే, పండితుల కూటమి సాయంతో వాటిని పరిష్కరించి సాపు ప్రతిని ఖరారు అయిన రూపంలో తయారుచేయటం వంటి పనుల్లో ఉన్నాడు, తన అధికార బాధ్యతలతో బాటుగా. అయినా బ్రౌన్ ఈ రాత ప్రతిని చదివి, ప్రాముఖ్యత అర్ధంచేసుకుని, స్థానిక చరిత్రలుగా విశేష ప్రాధాన్యత ఉన్నదని ఈ వంద పేజీల లోపు లఘు రచనను తానే ది వార్స్ ఆఫ్ రాజాస్, బీయింగ్ ద హిస్టరీ ఆఫ్ అనంతపురం రిట్టెన్ ఇన్ తెలుగు ఇన్ ఆర్ ఎబౌట్ ద యెయర్స్ 1750- 1810. ట్రానే్స్లటెడ్ ఇంటు ఇంగ్లీష్ బై చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఆఫ్ ది మద్రాస్ సివిల్ సెర్వీస్, తెలుగు ట్రానే్స్లటర్, సీనియర్మెంబర్ ఆఫ్ ద కాలేజ్ బోర్డ్ అన్న వివరణతో 1853లో ది వార్స్ ఆఫ్ రాజాస్, బీయింగ్ ద హిస్టరీ ఆఫ్ హండే అనంతపురం పేరిట ఆయన చేసిన ఆంగ్లానువాదం వెలువడ్డది. ఈ ప్రక్రియ యావత్తూ, 1800కి ముందరే, తెలుగు వ్యవహారిక వచనంలో ఒక రాతప్రతి ఉన్న విషయం ఖరారు చేస్తుంది. తెలుగు ప్రతి అచ్చు అయిందో లేదో దాఖలాలు లేవు.
ఈలోగా మదరాసు, అప్పటికే, విశేష రేవు వాణిజ్యంగల దక్షిణ భారత ప్రధాన నగరం. ఇక్కడ బహుళ జీవన సంస్కృతులు అక్కడి ప్రజలకు సాధారణంగా అందుబాటులో ఉంటాయి. నాలుగు భాషలు వస్తాయి. చురుకైన కుర్రవాల్లు భాషల పాటవంతో అల్లుకుపోతారు. ఇలా మొదలు అయింది ఏనుగుల వీరాస్వామి (1780-1836) కథ. ఈయన పనె్నండేళ్ళకే మదరాస్ వేర్ హౌస్‌లో గుమాస్తా ఉద్యోగానికి వెళ్ళగా, మేం ఉద్యోగం ఇస్తామంటే, మేం ఇస్తామని కంపెనీలు పోటీపడే అంత చక్కగా వ్యవహారిక ఆంగ్లం నేర్చాడు. ఆ ప్రతిభతో, పనె్నండేళ్ళకే ఏ పాఠశాల చదువులు లేకుండా మదరాస్ పోర్ట్‌లో 1794 నుంచీ, 1819 వరకూ ఇరవై అయిదేళ్ళపాటు బుక్ కీపర్, హెడ్ అక్కౌంటెంట్‌గా పదవులు నిర్వహించి, 1819లో తన ముప్ఫైతొమ్మిదో ఏట, పదవీ విరమణ చేసి, స్వయం ప్రతిభతో, మదరాస్ సుప్రీంకోర్ట్‌లో ఇంటర్ప్రెటర్‌గా చేరారు. కక్షిదారులు పలు భాషల్లో చేసే వాదోపవాదాలు న్యాయాధిపతులకు ఆంగ్ల తర్జుమా చేసి తెలపడం పనిగా పదహారేళ్లు పనిచేశారు. ఇలా ఆధునిక నివేదికలు తయారుచేయడంలో కార్యాలయ ప్రజ్ఞ, అనుభవంగల వీరాస్వామయ్య రెండుసార్లు కాశీ యాత్ర చేశారు. మొదటిసారి యాత్ర 1820-21 మధ్య చేశారు. ఆ వివరాలేవీ రాయలేదు. రెండోసారి మద్రాస్ సుప్రీంకోర్ట్ హెడ్ ఇంటర్ప్రెటర్ హోదాలో, 1830-31 మధ్య కాశీయాత్ర చేశారు. ఈ యాత్ర కడు వైభవంగా తూర్పు ఇండియా కంపెనీ సహకారం, సాధన సంపత్తితో మదరాసు నుంచీ, కాశీవరకూ పల్లకీలో వెళ్ళి వచ్చారు ఏనుగుల వీరాస్వామయ్య.
అన్న వేల మైళ్ళు పల్లకీ ప్రయాణాలు అంటే, అదొక బహుశ్రమతో కూడిన యాత్ర, ఈ బృందంలో ఆయన, కుటుంబ సభ్యులు, సహచరులు, సేవకులు, అందరూ కలిపి ఒక నాలుగు పదుల మంది ఉండేవారు అంటే అది ఎంత కష్టతరమైన పనో, ఏ రకమైన రోడ్‌లూ, దారి సౌకర్యాలు లేని కాలంలో, ఇది ఎలా సాధ్యమైందో గమనిస్తే, బహుశా, దక్షిణ భారతంలోనే అతి కొద్దిమంది మాత్రమే చేసిన కాశీ యాత్రగా, మిగిలిపోతుంది. ఈ వీరాస్వామయ్య కాశీ యాత్ర, ఒక ప్రయాణ రచనగా కూడా తన విస్తార పరిశీలనలతో, ఒక ఆధునిక దృష్టి కోణం గల అధికార చూపుతో ఈయన నమదు చేసిన తీరు, అంతకుముందరి రచనల్లో కనిపించని కొత్త పరిణామం. అలా చూస్తే ఈయన రచన కాశీయాత్రా చరిత్ర, దక్షిణ భారతదేశంలోనే తొలి యాత్రా వచనం. అది తెలుగు వారికి వ్యవహారిక రచన ఉషోదయ కాలం కూడా.
ఏవో కొన్ని పదుల పేజీలు కాక, ఈ రాత ప్రతి రచనలో పేజీకి ఇరవై ఒక్క పంక్తులతో, నాలుగువందల పందొమ్మిది పేజీలు సాగింది. ఒక ప్రతి వీరాస్వామయ్య బ్రౌన్ దొరకు పంపించారు. మొత్తం ఎనిమిది వేల ఏడువందల ఎనభై తొమ్మిది పంక్తులతో, వ్యవహారిక వచన రచనగా తెలుగులో, వీరాస్వామయ్య కలం నుంచి వెలువడిన ఆద్య గ్రంథం. గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం, తెలుగులో వర్తమాన తరంగిణీ ముద్రాక్షరశాలలో 1836 ఏప్రిల్ నెలలో, కోమలేశ్వరపురం, శ్రీనివాస పిళ్లగారి ఉత్తర్వుల మేరకు అచ్చు అయ్యింది. రాతప్రతి గవర్న్మెంట్ ఓరియంటల్ మానుస్క్రిప్ట్ నెంబర్ 1407లో భద్రపరచబడింది. బ్రౌన్ దొర స్వహస్తాలతో రాసిన వ్యాఖ్యల ద్వారా. ఈ వ్యవహారిక వచన రచన, 1838లో అచ్చు అయింది అంటే, గురజాడ 1892లో రాసిన కన్యాశుల్కం వ్యవహారిక సాహిత్య వచనం అనుకుంటే, అంతకన్నా యాభై నాలుగేళ్ళు ముందరే వెలుగు చూసింది. ఇది గురజాడ ఎరుకలో ఉన్న పుస్తకం. అలాగే వార్స్ ఆఫ్ రాజాస్‌ఆఫ్ హండే అనంతపురం కూడా.
ఈ రచన విశిష్టత ఎరిగిన వారు గురజాడ. ఆయన కాంపోజిషన్ కమిటీ సభ్యులుగా, ఫెలో ఆఫ్ మద్రాస్ యూనివర్సిటీగా ఉండగా, 1914 ప్రాంతాల్లో, గ్రాంధిక, వ్యవహారిక భాషా వివాదం సాగుతూ ఉండగా, విద్యార్థులకు, ఈ రెండిటిలో ఏదో ఒక పుస్తకం పాఠ్య పుస్తకంగా పెట్టమని ఒక లేఖలో సూచించారు. అలాగే మై వోన్ థాక్స్ పేరిట ఇంకా తెలుగులోకి రాని గురజాడ ఆంగ్ల రచనలో ది వార్స్ ఆఫ్ రాజాస్, బీయింగ్ ద హిస్టరీ ఆఫ్ హండే అనంతపురం గురించి, అలాగే తన అసమ్మతి పత్రంలో పాయింట్ నంబర్ 197లో హందె రాజాస్ ఆఫ్ అనంతపురం, రచన పై బ్రౌన్ కృషి, అందులో గల వ్యవహారిక మూలాలను ఇంకా వీరాస్వామయ్య యాత్రా రచనలోగల వ్యవహారిక స్వభావం గురించి బలంగా చెప్పారు. ఇక గిడుగువారు, ఈ పుస్తకం మూడో ప్రచురణ 1941లో దిగవల్లి వెంకటశివరావు గారు చేసిన దానిలో, ఇది వ్యవహారిక వచన రచనకు మాదిరి (మోడల్, లేదా నమూనా) అని, వీరాస్వామయ్య గుణ గణాలను పేర్కొన్నారు.
ఇలా దిగ్దంతుల త్రయం అయిన బ్రౌన్ దొరచే కేటలాగ్ చేయబడి, 1836కల్లా ప్రచురితం అయి, తరువాత తరాల వారు అయిన గురజాడ, గిడుగు వంటివారి మన్ననలు పొందిన తొలి తెలుగు వ్యవహారిక వచన రచన కాశీ యాత్రా చరిత్ర. గిడుగు వారికి గ్రాంధిక భాష వాదులతో జరిగిన వాగ్యుద్ధాల్లో, చివరికి 1933 డిసెంబర్ 23న, కాకినాడలో చివరికి విజయపట్టం దక్కినా, అంతకు వందేళ్ళకు ముందరే, వ్యవహారిక వచనానికి ఆద్యుడు ఏనుగుల వీరాస్వామయ్య. మదరాసుకు చెందిన బహుళ సంస్కృతుల, పలు భాషల ప్రజల సంపర్కం, కార్యాలయాల నివేదికల నమోదు తీరు ఇవన్నీ ఎరిగిన వీరాస్వామయ్య, తానేదో చరిత్రలో నిలబడే పనిచేస్తున్నాను అని అనుకోకుండా చేసినా, తన పుస్తకం అచ్చులో చూసుకోకుండానే చనిపోయినా, తెలుగు వ్యవహారికాన్ని రెండు శతాబ్దాలకు ముందరే, ఆధునికత మేలుకుంటున్న తొలి ఘడియల్లోనే, ఏనుగునెక్కించి, సగౌరవంగా ఊరేగించిన వారు ఏనుగుల వీరస్వామయ్య. అందువలన తెలుగు వ్యవహారిక వచన రచనకు ఆద్య పీఠం ఈ అయ్యవారిదే. అగ్ర పూజలు కూడా ఆయనకే.
*
- రామతీర్థ, 9849200385

- రామతీర్థ, 9849200385