సాహితి

రచయతలకు గీటురాయ ‘నవ దృక్పథం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మట్టి తడి బంధాల్లో’ (కవితా సంపుటి) మొలకెత్తిన కొండ్రెడ్డి సాహిత్యం చిగిరింతలు (నానీలు)తో చింతనలు (నానీలు) తోనూ-తొమ్మిది కవితా సంపుటాలతో, సంస్పర్శ, ఆలోకనం వ్యాసాలతో నవనవోనే్మషమై అనంతానే్వషణ దిశగా పయనిస్తోంది. నవ దృక్పథం సాహిత్య వ్యాసాలలో ‘అనంతానే్వషణ దిశగా’...మొదటి శీర్షిక.
‘నవ దృక్పథం’లో 42 వ్యాసాలు లేదా శీర్షికలు రచయిత సంవేదనతో రాసినవి. తెలుగు నేలమీద అనేక సామాజిక, సాహిత్య ఉద్యమాలు, సాహితీ వాదాలు నడుస్తూ ప్రజలను కలవరపరుస్తున్న వేళ రచయిత ఉద్వేగంతో అనేకానేక అంశాలను స్వీకరించి అవగాహనతో బాధ్యతతో ఈ వ్యాసాలు రాశారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా ప్రకటించారు. రచయితను ఉత్సాసపరుస్తూ సమాజంపట్ల, సాహిత్యం పట్ల అతనికుండాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. ‘అనంతానే్వషణ దిశగా...’ వ్యాసంలో రచయిత ‘‘అనంతానే్వషణ దిశగా సాహిత్యం పయనించాలి. సాహిత్యం సాహితీ వేత్తలకు పాఠకులకు ఒక వ్యసనం కావాలి. సమకాలీన సమస్యలను చర్చించేదిగా సాహిత్యం అన్ని రంగాల్లోను పురివిప్పాలి. వ్యక్తి స్వార్ధానికి సాహిత్యం అమ్ముడు పోకూడదు. మూఢ విశ్వాసాలకు తావివ్వకూడదు. అనాలోచిత ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలువకూడదు...ఆత్మవిమర్శ రచయితకు గీటురాయి కావాలి. ఎందుకు రాస్తున్నాను? ఎలా రాస్తున్నాను? జీవితాలకు సాహిత్యానికి పొంతన ఉందా? లేదా అనేది ఆలోచించాలి...’’ అంటూ రచయిత లక్ష్యాలను, బాధ్యతలను నిర్దేశిస్తారు. రచన సమాజపరంగా వెలువడాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతారు.
‘‘స్వేచ్ఛను కాంక్షించేదే సాహిత్యం, కవిత్వం సాహిత్య క్రీడ కాదు-సామాజిక బాధ్యత వ్యాసాలు ఎంతో విలువైనవి. ‘కవిప్రవక్త’, ‘కవులే సమాజ శాసనకర్తలు’ అన్న కార్లైలు, పి.బి.షెల్లీల మాటలకు వ్యాఖ్యాన ప్రాయమైన అక్షర లక్షలిందులో కనిపిస్తాయి. రాజకీయ సమస్యలు దేశానికి గొడ్డలిపెట్టయిన దుస్థితిని చెబుతూ, ప్రజాస్వామిక విలువలు పరిరక్షించాల్సిన బాధ్యత సాహిత్యవేత్తలదేనంటారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక సమస్యలను జనానికి ఎత్తి చూపి ఆలోచింపచేసే చైతన్యం అతడే కలిగించాలంటారు. పాలనా వ్యవస్థకి సమర్ధవంతమైన సూచనలు అందించే గురుతర బాధ్యత కవిదేనంటారు. కులాల వారీగా, మతాల వారీగా కవిత్వాన్ని అల్లుకుంటూ కుల చైతన్యం, మత చైతన్యం, ప్రాంతీయ చైతన్యం, వర్గ చైతన్యం అనే ముసుగులో వేరుకుంపట్లు పెట్టుకుంటూ కవులు ముఠాలుగా ఏర్పడుతున్నారని రచయిత బాధపడ్డారు.
‘ఇకనైనా తెలుగుకు వెలుగులబ్బేనా?’ వ్యాసం 2012 డిసెంబర్ 27, 28, 29లలో తిరుపతిలో తలపెట్టిన నాల్గవ ప్రపంచ మహాసభలకు రెండు నెలల ముందు వెలువరించినది. ‘‘తరగతి గదిలో మాతృభాషను విడనాడడం మాతృప్రేమకు దూరమైనట్లేననే సత్యం ప్రభుత్వానికి తెలియదా’’ అని రచయిత సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘సాహిత్యం అచ్చేసుకోవడమూ తప్పేనా?’’ వ్యాసంలో సాహిత్య ప్రచురణను కించపరుస్తూ కొందరు అడ్డదిడ్డంగా రాసే రాతలను నిర్మొహమాటంగా ప్రశ్నించారు.
‘‘ఆధునికానంతర వాదాన్ని అర్ధం చేసుకోవాల్సిన సందర్భమిది’’ ‘‘పునఃమూల్యాంకన అవసరాన్ని గుర్తిస్తున్నామా’’ ‘‘అర్థం కానిదే ఆధునికానంతర సాహిత్య లక్షణమా?’’ ‘‘ఆధునికానంతర వాదం విమర్శనా శాస్తమ్రేనా..?’’ మొదలగు వ్యాసాలలో ఆధునికానంతర వాదం యొక్క వ్యాప్తి, లక్షణాలను గురించి చర్చించారు. ఆధునికతను విప్లవీకరించే తీరులో విభిన్నతలని ముందుకు తెస్తూనే శకలీకరణాన్ని ప్రోత్సహిస్తూ ఆధునికానంతర వాదం 1960 నుండి ముందుకు వచ్చిందంటారు. సాంప్రదాయ ఆలోచనా రీతుల్ని సంశయాత్మకంగా చూస్తూ విశే్లషిస్తూ, సంప్రదాయ అర్ధాల్ని తిరగరాస్తూ కొత్త పద బంధాలని సృష్టిస్తూ సాహిత్య విమర్శలో సరికొత్త విధానాలని అనే్వషిస్తూ ముందుకు సాగుతున్నది అంటూ ఆధునికానంతర సాహిత్య లక్షణాలను వివరిస్తూ అర్ధరహితమైన కవిత్వం ఆధునికానంతర కవిత్వం కాదని గట్టిగా చెబుతారు.
కొండ్రెడ్డి వేంకటేశ్వరరెడ్డి రచించిన వ్యాసాలు తెలుగు సమాజానికి, సాహిత్యానికి ఎంతో మంచిని చేకూర్చేవి. నలుగురు కూచుని, ఈ వ్యాసాలని చర్చించడానికి మంచి దారిలో పయనించడానికి ప్రేరణగా ఈ ‘నవదృక్పథం’ నిలుస్తుందని భావిస్తున్నాను. ‘మంచియన్నది పెంచుమన్నా’ అన్న గురజాడ మాటకు ఉదాహరణగా ఈ వ్యాసాలు నిలుస్తాయి.
*

- డా. తుర్లపాటి రాజేశ్వరి, 08093520819