సాహితి

ఆర్థిక సంకెళ్ళకు అతీతం సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం మెడమీద రాజకీయం కత్తి వేలాడుతున్నప్పుడు, సామ్రాజ్యవాద భావనాచ్ఛాయలు అలుముకుంటున్నప్పుడు, పాలకుల చెప్పు చేతల్లో సాహిత్య రంగం మెలుగుతున్నప్పుడు, స్వేచ్ఛాయుత సాహిత్య కంఠం నిశ్శబ్దంలో కూరుకుపోయి వౌనంగా నేల చూపులు చూస్తుంటూంది. పంటి బిగువుతో ఉబికొస్తున్న కన్నీటిని అణచుకుంటూ, కృత్రిమ హావభావాలు వ్యక్తీకరిస్తుంటూంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. ఏది ఏమైనా ఈనాడు రాజకీయాలు కవిత్వానికి బరువైపోతున్నాయి. భాష యెడల నిష్పాక్షిత చూపాల్సిన అధికారం పాక్షిక దృష్టిని ప్రేరేపిస్తుంది. స్నేహం ప్రదర్శించాల్సిన పెద్దరికం వైరం ప్రదర్శిస్తుంది. ప్రాపంచిక దృక్పథం పట్టని, ప్రజాస్వామ్య విలువలు పట్టని, స్వార్థపూరిత ఉక్కపోతలోకి సాహిత్యాన్ని ఈడ్చి, ఆర్థిక అగరొత్తులతో పరిమళభరితం చేయాలనే సంకల్పం జరుగుతుంది. భావ దారిద్య్రంలో మగ్గే పాలక వర్గాలకు నవ కల్పనలు నూతన ఆలోచనలు పట్టవుగాక పట్టవు. వాగాడంబరంతోకూడిన ఉపన్యాసాలు యిస్తూ పోతుంటారేగానీ, నీతి నియమాలతో కూడిన చేతలకు మాత్రం దూరంగానే వుంటారీ కపట రాజకీయ నాయకులు. నోట్లు ఎరవేసి ఓట్లు గుంజి కుర్చీ ఎక్కినట్లు ఈనాడు సాహిత్య సాంస్కృతిక రంగాల్ని ఫండ్స్ ఎరవేసి లోబరచుకోవడానికి యత్నాలు జరుగుతున్నాయి. సాహిత్య రంగంలో అభ్యుదయవాదులు ఆర్థిక ఎర ముందు తోకాడిస్తూ పాలక పక్షం కాళ్ళదగ్గర సాగిలపడిపోతున్నాయి. జనం వైపు కళ్లెత్తి చూడకుండా ధనం వైపు పాలకులు కట్టబెట్టే పదవులవైపు పరుగులు తీస్తున్న అభ్యుదయవాదాలు.
అప్పుడప్పుడు ఏలికలు సాహిత్యరంగంమీద ఎంతో ఉదారత్వం చూపిస్తుంటారు. ప్రభుత్వ నిధులిచ్చి ప్రోత్సహిస్తుంటారు. అది పాలకుల్లో మార్పు వచ్చి కలిగిన ప్రేమ అనుకోవడమంటే పప్పులో కాలేసినట్లే! వారి రాజకీయ స్వప్రయోజనం ఎంతో రహస్యంగా అమలు చేయబోతున్నారనేది సత్యం. పాలక వర్గం, తమ అధికారాన్ని ఆర్జనే ప్రధానంగా, అయినవారిని పదవుల్లో నిలబెట్టడమే ధ్యేయంగా చేసుకుంటూ, సాహితీవేత్తల నోళ్లునొక్కడానికి వారి దృష్టిని మళ్లించానికి నోరెత్తే సాహితీవేత్తలకు కంటితుడపు పదవులు కట్టబెడుతూంటారు. ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చి సాహిత్య పండుగలు చేసుకోమంటూంటారు. సాహిత్యవేత్తలు ఈ ప్రభుత్వం ఫండ్స్‌తో నిర్వహించే సాహిత్య సంబరాల్లో ప్రభుత్వం దిగజారుడుతనాన్నిగాని, వారుచేసే స్కామ్స్‌ని ఎత్తిచూపడంగాని, వారు నిర్వహించే దురాక్రమణలు, దౌర్జన్యాలను, అన్యాయాలను, అక్రమాలను వ్రేలెత్తి చూపడంగాని చేయకూడదనే ఒకే ఒక్క షరతు లోపాయికారిగా జరుగుతుంటుంది. దీన్ని అంగీకరించిన అధికారాన్ని మోస్తున్న సాహితీవేత్తలు సాహిత్య సంబరాల్ని అంబరం అంటే విధంగా చేస్తామంటూ శ్రీరంగనీతులు వల్లె వేస్తుంటారు. సాహిత్యంలో సమైక్యవాదాన్ని ముందుకు తెస్తుంటారు. సామాజిక చైతన్యాన్ని కలిగించే సైద్ధాంతికపరమైన, శాస్ర్తియపరమైన, హేతుబద్ధమైన వాదాల్ని త్రోసిపుచ్చుతూ, మానవీయతా వాదాన్ని స్మరిస్తూ దాని ముసుగులో బతికిపోతున్న సాహితీవేత్తలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నారు. అధికారానికి ఊడిగిం చేస్తున్నారు. ఆర్థికపరమైన అవకాశాల కోసం అర్రులు చాస్తున్నారు.
ఈ రోజు సమాజానికి స్లోపాయిజన్ ఇచ్చి చంపుతుంది మేధావి వర్గాలే! వారి భావదారిద్య్రం కంతిరి ఆలోచనలతో జనాన్ని తప్పుదోవ పట్టించే రాతలు రాస్తుంటారు. సిద్ధాంతాల ముసుగులో బతుకుతున్న సాహితీవేత్తలు వాటిని ఉన్నవాని పాదాల దగ్గర వదిలేసి కాకమ్మ కబుర్లతో అక్రమ సంపాదనలకు హారతులెత్తుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేనప్పుడు కవులు కనే కలలు మనుషుల్లో ఫలిస్తాయనుకోవడం వెర్రిబాగులతనమే అవుతుంది.
మనిషి జీవన పరిధి విస్తరిస్తుంది. బతకడానికి పలు విధాలైన వృత్తులను చేపట్టవలసి వస్తుంది. ఈ వృత్తులన్నీ కార్పొరేట్ వ్యాపారస్తుల చేతుల్లో ఇరుక్కుపోయాయి. వారి యంత్రాల ద్వారానే యంత్రాంగం నడస్తుంది. సామాన్యునికి అందని స్థితిలోకి వృత్తులు తమ రూపు మార్చుకుని ఎదిగిపోతున్నాయి. ప్రభుత్వ అండదండల్ని కొనేస్తూ, శ్రామిక వర్గాల్ని దోపిడీ చేస్తూ సంపన్నులు మహా సంపన్నులైపోతున్నారు. పేదవాడు మరీ పేదవాడైపోతున్నాడు. ఏ కాలపు సాహిత్యమైనా ఆ కాలపు స్థితిగతుల్ని దోపిడితత్త్వాన్ని, దుర్మార్గాల్ని ఎత్తిచూపాల్సి వుంది. మరి ఈనాడు మన సాహితీవేత్తలు రొమ్ము విరిచి, జబ్బచరసి పౌరుషాగ్నిని రగిలిస్తూ పాలకుల దుర్మార్గాల్ని దుయ్యబడుతూ రాతలు రాస్తున్నారా? ప్రభుత్వపు కొంగు పట్టుకు తిరిగే సాహితీవేత్తలకు ఇదెట్టా సాధ్యవౌతుంది? అందుకే నిజాయితీగల పభుత్వం పిలుపునకే సాహితీవేత్తలు స్పందించాల్సి వుంది. వారు ఎరవేసే పదవులకుగాని, వారి భావజాలాన్ని ప్రోది చేసుకొని సాగించే సభలకుగాని చంకలు తట్టుకుంటూ ఎగబడడం సాహితీవేత్తల దిగజారుడుతనాన్ని పట్టిస్తుంది.
ఎవరూ తమను తాము మోసం చేసుకోకూడదు. తమకు తాము అసత్యాలు చెప్పుకోకూడదు. తప్పును సమర్థించుకోవడానికి ప్రయత్నిచకూడదు. ఈ విషయాలు ఎప్పుడూ మనిషిని పతన దిశగా పయనింపజేస్తాయి అనే సత్యాన్ని గుర్తెరగాలి. జీవిత లక్ష్యలకు మార్గదర్శకులుగా నిలవాల్సిన సాహితీవేత్తలు క్షుద్రతలకు తలలూపుతూ, జీవిత స్వాభావిక నియమాలను పరికించి వాటి మార్పుకు ఘర్షణపడే తీరుతెన్నులు ఎరుగకుండా పాలక పక్షాల తీపి కబుర్లకు కరిగిపోవడం చారిత్రక తప్పిదమే అవుతుంది. పాలకుల ఉదారత్వం సాహిత్యానికి ఉరితాడు కాకూడదు. వారు చూపే సానుభూతి సంకెళ్లు కాకూడదు.
సాహిత్య సభల్లో భరతనాట్యాలు, బొమ్మలాటలు, చెక్క భజనలు క్షుద్రదేవతల కొలుపులు ఉండడమంటే ప్రజా సమస్యల్ని దారి మళ్లించడమే అవుతుంది. సాహిత్య సభల్లో పాలక వర్గాల్ని పడి పడి మొక్కుతూ సన్మానించుకోవడమంటే సాహిత్యపు నైతిక విలువలను దిగజార్చుకోవడమే! సాహిత్య సభల్లో సామాజిక విధ్వంసక శక్తులమీద యుద్ధం చేసే చర్చలు జరగాలి. పాలకుల పాలనా విధానాల మీద అవగాహన కల్పించే వేదికలు కావాలి. జనాన్ని చైతన్యపరచే ఉపన్యాసాలు కావాలి. నిజాయితీ నిబద్ధతగల కవులు సృష్టించే సాహిత్యంమీద చర్చలు జరగాలి. ఆచరణబద్ధమన ఆలోచనలు కలిగించే వైజ్ఞానిక సాహిత్య నిపుణులను వెలికితీసే కార్యాచరణకు నాందీవాక్యం సభలు పలకాల్సి వుంది.
సాహిత్యం జనంలో వెళ్ళే విధానాల్ని ఎన్నింటినో ప్రభుత్వం చేపట్టే విధంగా సూచనలు చేయాల్సి వుంది. ప్రజల సొమ్ము దారుణంగా దుబారాగా ఖర్చు చేయడం పాలనా దక్షత అనిపించుకోదు. వ్యవస్థీకృతమైన వౌలిక అంశాల్ని చర్చించాల్సి వుంది. ప్రజల వాస్తవ జీవన సమస్యలకు పరిష్కారం చూపెట్టే ఆలోచనలు రేకెత్తించగలగాలి. దళారీ రాజకీయ ఎత్తుగడలు సామాజిక రంగాల్లో గందరగోళ పరిస్థితిని సృష్టిస్తాయనే సత్యాన్ని మరచిపోకూడదు. సాహిత్యం పేరుతో జరిగే సభలు నిష్కళంకమైన సాహిత్య విలువల్ని వెలికి తేవాల్సి వుంది.

- కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, 9948774242