సాహితి

భాషలో మార్పు అనివార్యం (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు భాషకు ‘బ్రహ్మరథం’ అనే శీర్షికతో ‘సాహితి’ (11-4-2016)లో వచ్చిన వ్యాసంలో ఎం.వి.ఆర్.శాస్ర్తీగారు తెలుగు భాషకు పట్టిన దుర్గతికి తన ఆవేదనను వ్యక్తం చేశారు. నేటి నవతరానికి వ్యాకరణ నియమాలు, భాషా ప్రమాణాలు, శైలీ శాస్త్రాలు పాత చింతకాయ పచ్చడిలా బూజుపట్టి పోయాయని బాధపడ్డారు. ఇంతవరకు బాగానే వుంది. భాషకు వ్యాకరణం, ఒక పద్ధతి, శైలి వగైరాలు ఉండాల్సిందే. అయితే భాష జడపదార్థం కాదు. కాలంతో పాటు, మన అవసరాలను బట్టి భాషలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు ఒక్కోసారి వ్యాకరణ సంప్రదాయానికీ, భాషా ప్రామాణికతకూ భంగం కలిగించేవి కావొచ్చు. కానీ మార్పులు అనివార్యం అవుతాయి. సహజంగా వస్తాయి. ఆ మార్పులకు కారణాలు సాంప్రదాయిక వ్యాకరణంతో వెతక్కుండా, భాషా శాస్తప్రరంగా పరిశీలిస్తే వాటిలోని ఔచిత్యం అర్థం అవుతుంది.
‘ఒత్తిడి’ అనే పదం తప్పనీ, ‘ఒత్తడి’ అనేది సరైన పదమనీ శాస్ర్తీగారన్నారు. నిఘంటువులో ‘ఒత్తడి’ అనేదే ఉంటుంది. ఇవాళ పండిత పామరులందరూ ‘ఒత్తిడి’ అనే అంటున్నారు. అది బాగా స్థిరపడిపోయిన రూపం. అది తప్పని ఇవాళ గుండెలు బాదుకుని లాభం లేదు. ఒత్తడి అనేది ఒత్తిడిగా ఎందుకు మారింది? ఇందులో భాషా శాస్త్ర నియమం ఏమైనా ఉందా? ‘డి’లోని ‘ఇ’ అనే అచ్చు ప్రభావంతో ‘త్త’లోని అకారం కూడా ఇకారంగా మారిపోయింది. ఒత్తడి అనేకంటే ఒత్తిడి అనడంలో ఉచ్ఛారణ సౌలభ్యం ఉంది. ‘అధిగమించు’ అంటే చదువు అనే అర్థం ఉంది. నిజమే. ఈ అర్థం నిఘంటువుల్లో ఉన్నదే గాని, ప్రజల్లో (పండితుల్లో కూడా) లేదు. ‘అధిగమించు’, ‘చదువు’ అనే పదాలకు ఏమైనా సంబంధం ఉందా? అనిపిస్తుంది. ఆట - కొన్ని దాటి ముందుకు వెళ్లడం అనే అర్థంలో వాడుతున్నాం. ‘గమించు’ అంటే వెళ్ళడం అనే అర్థం ఉండటం వల్ల ఈ అర్థంలో స్థిరపడి ఉండొచ్చు. ఇలా ఏవో కొన్ని అర్థవంతమైన కారణాలు లేకుండా పదాలలో మార్పులు రావు. శాస్ర్తీగారు చూపిన ‘బహ్మరథం’ అనే పదం ఆసక్తికరమైంది. దాని అసలు అర్థానికీ, వ్యవహారంలో ఉన్న అర్థానికీ అసలు సంబంధమే లేదు. పైగా విరుద్ధమైన అర్థంలో స్థిరపడింది. చనిపోయిన సన్యాసుల్ని తీసుకుపోయే వాహనం అని దాని అసలు అర్థం. అదీ చనిపోయిన అందర్నీ తీసుకుపోయే వాహనం కాదు, సన్యాసుల్ని మాత్రమే తీసుకుపోయే వాహనం. అంట అది మామూలు పాడె కాదన్నమాట. ఆ పాడెకు గౌరవం, ప్రతిష్ఠ ఉన్నాయి. ఇవాళ బ్రహ్మరథం పట్టడానికి ఈ గౌరవ ప్రతిష్ఠలే కారణమేమో!
భాషాశాస్త్రంలో అర్థ విపరిణామాలు అని ఒక మాట ఉంది. కాలక్రమంలో కొన్ని పదాలకు అర్థాలు మారిపోతుంటాయి. అలా మారడానికి కొన్ని కారణాలుంటాయి. అవన్నీ వ్యాకరణ సమ్మతం కానక్కరలేదు. జీవన విధానానికి, సంస్కృతికి, వాటిలో వచ్చే మార్పులకీ అది సూచకాలు. భాషకు వ్యాకరణం అనేది ఒక అంశమే గాని, సర్వస్వం కాదు. మానవ జీవన విధానం కూడా భాషను నిర్ధారిస్తుంది. దాన్ని కూడా గమనంలోకి తీసుకోవాలి. అప్పుడు ఈ వైరుధ్యం పోతుంది. కంపు అంటే ఒకప్పుడు వాసన అనే అర్థం. ఇవాళ దుర్వాసన అని అర్థం.
ఇక ధీటుగా, వౌళికం, అవలంభించు, భాద్యత, విధ్వాంసుడు, ప్రతిష్ట, విధ్య మొదలయినవి తప్పే. ఒత్తక్షరాల్ని వర్ణమాల నుండి ఎవరూ తొలగించలేదు. అరసున్న, బండిరాలను తొలగించారు. అరసున్నకు ఉచ్ఛారణే లేదు. ఎక్కడ సాధురేఫ (ర) వాడాలో, ఎక్కడ శకటరేఫ (ఱ) వాడాలో నియమాలేమీ లేవు. అందుకే అవి వర్ణమాల నుండి తొలగిపోయాయి. తెలుగు భాషలోని అక్షరాలను సగానికి సగం మింగేసి, అదే అభ్యుదయం అని అనుకుంటున్నామని, అభ్యుదయాన్ని హేళన చెయ్యడం సరైంది కాదు. అక్షరాలను సగం ఎవరు మింగారు? 56 అక్షరాల్లో నాలుగైదు అక్షరాల్ని అనవసరం అని తొలగించుకున్నాం. అనవసరమైన వాటిని తొలగించుకోవడం నిజంగా అభ్యుదయమే అవుతుంది. ఎడిటర్‌ను ఏడిటర్ అని రాస్తే దాన్ని అందరూ ఫ్యాషన్‌గా భావిస్తున్నరని అనడం అతిశయోక్తి మాత్రమే. ఇవాళ ఇంగ్లీషు మాటల్ని ఉపయోగించడాన్ని నిరసించే శాస్ర్తీగారు, ఒకప్పుడు తెలుగులో సగానికి పైగా చేరిన సంస్కృత పదాల విషయం ఏమంటారు? శాస్ర్తీగారన్నట్లు తెలుగు భాషను మన అవసరాలకు తగ్గట్టుగా మరింత పరిపుష్టం చేసుకోవడం అవసరమే. దీనికి ప్రధానంగా పూనుకోవలసింది పత్రికా రంగమే.

- వి.చెంచయ్య, 9440638035