ఈ వారం స్పెషల్

చైతన్య స్ఫూర్తి.. సంక్రాంతి దీప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతికి దర్పణాలు, విభిన్న జాతుల సంస్కార బిందువులు మన ‘పండుగలు’. మన గతాన్ని స్మరింపజేసి, వర్తమానాన్ని పరామర్శించుకుంటూ, భవిష్యత్తును నిర్మించుకునే ఉత్సాహ స్ఫూర్తిని సందేశాల్ని ఇచ్చేవి - పండుగలు. ‘సర్వశాస్త్ర ప్రయోజనం తత్త్వ దర్శనం’ అనేది భారతీయుల విశ్వాసం. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థములలో అర్థకామములను ధర్మబద్ధముగా అనుభవించడానికి, ఆచరణాత్మకంగా ప్రకటించడానికి ఏర్పడినవే - భారతీయుల పండుగలు, పర్వదినములు.
ప్రతి పండుగకు నిర్దేశింపబడిన సంప్రదాయాలు, వాటి అంతరార్థాలను గ్రహించి, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రజా శ్రేయస్సుకు ఉపకరించాలని హితవు పలికేవి పండుగలు.
పండుగలెన్ని ఉన్నా, తెలుగు జాతికి పెద్ద పండుగ - సంక్రాంతి. కాల సంబంధమైన పండుగలు, ముఖ్యంగా మూడు. ఉగాది, సంక్రాంతి, రథసప్తమి. ‘సమ్యక్ క్రాంతి - సంక్రాంతి’. సమ్యక్ అంటే పవిత్రమైన, క్రాంతి. అనగా మార్పు. సూర్యుడు ఉత్తరాభిముఖంగా పయనిస్తూ, ప్రకృతిలో శోభ, విలాసము, అందము ఆనందము చేకూరే ‘మార్పు’ను తీసుకొని వస్తాడు.
‘పంచపాదం పితరం ద్వాదశాకృతిం, దివ ఆహుః పరే అర్ధే పురీషిణం, అధామే అన్య ఉపరే విచక్షణం సప్తచక్రే షడర ఆహురర్పి తమితి’ అన్నది ఋగ్వేదం. కాలాన్ని ఏర్పరచి భాగవిభాగాలుగా వున్న సంవత్సరంగా కొలత ఇచ్చి, హేమంతము - శిశిరము ఒక ఋతువుగా చెపితే - అయిదు ఋతువులుగా, ఏడు చక్రాల రథముతో, ఏడు గుర్రాలుగా చెప్పబడే ఏడు రంగులతో లేక వారములోని ఏడు దినములతో పనె్నండు రూపాలు అనగా పనె్నండు నెలలుగా, అన్నిటికీ నియామకుడుగా, తండ్రిగా వ్యవహరిస్తున్నాడు - సూర్యుడని ఋగ్వేదం చెప్పింది. అటువంటి సూర్యుని గమనాన్ననుసరించి వచ్చే పండుగ మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం - మకర సంక్రమణం.
అశ్వని నుండి రేవతి వరకు ఇరువది ఏడు నక్షత్రములు. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు, వెరశి నూట ఎనిమిది. మేషం నుండి మీనం వరకు పనె్నండు రాశులు. 108ని, ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదములు చొప్పున విభజించారు. ‘ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర వని భ్యశ్చరా హవే కేతవే నమః’ అని రవి మొదలు కేతువు వరకు తొమ్మిది గ్రహాలు. ప్రతి గ్రహం పనె్నండు రాశులలోనూ సంచరిస్తారు. చంద్రుడు ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశించటానికి 21/4 రోజులు పడుతుంది. రవికి ఒక రాశి నుండి మరో రాశిలో ప్రవేశానికి ఒక నెల పడుతుంది. అంటే సంవత్సరంలో పనె్నండు రాశులలో సూర్యుడు చేరటాన్ని ‘సంక్రమణం’ లేక ‘సంక్రాంతి’ అంటారు. ‘సంక్రాంతి’ అంటే ‘చేరుట’ అని అర్థం.
సూర్యుడు, కర్కాటక ధనూ మకర రాశులలో ప్రవేశించే సమయాలకు అనగా సంక్రాంతులకు, ఒక ప్రత్యేకత ఉన్నది. అందునా, మకర రాశిలో ప్రవేశించేటపుడు ఒక విశిష్టత ఉంది. అదే మకర సంక్రాంతి.
మకర రాశి నుండి మిధున రాశి వరకు, సూర్యుడు సంచరించే కాలం - ఉత్తరాయణం, వెలుగు మార్గం. మకర సంక్రమణం హేమంత ఋతువులో జరుగుతుంది.
శోభాయమానం - హేమంత ఋతువు
తట్టలో కూర్చోబెట్టిన వధువులా, గుమ్మడిపూవులో కులికే మంచు బిందువులతో, రాబోయే శిశిర భయంతో ప్రకృతి కాంత ‘జమిలి దుప్పటి కప్పుకొన్నదా’ అన్నట్లు తెలుగు నేల నాల్గు దెసల మంచు కురుస్తూ ఉండగా హేమంత ఋతువు వచ్చిందంటారు, కవి సమ్రాట్ విశ్వనాథ. వేకువ ఝామున ముగ్గుపెట్టే కనె్న, మంచుకొండ ఆడపడుచులాగా, పశువులను తోలుకొనిపోయే రైతు హిమగిరి పాలికాపులాగా, పంట కుప్పపై వేసే కొప్పు - మంచు కొండ కనక శిఖరంలాగా, తడిపాటి మట్టి గోడను, చిఱుకొమ్ములతో గోరాడు గిత్త - నందీశ్వరుడు లాగా, కనపడుట వలన నిత్యము మంచు పడుతూ ఉండటం వలన, హిమాచలము సపరివారముగా ఉత్తరము నుండి దక్షిణాపథానికి వచ్చినట్లుగా హేమంత ఋతువు ఆంధ్రదేశంలో ప్రవేశించిందని హేమంత ఋతు శోభను విశిష్టంగా వర్ణించారు విశ్వనాథ సత్యనారాయణగారు.
‘అగ్నేనయ సుపధారాయే అస్మాన్’ అని అరుణ మంత్రం, ఈశావాశ్యోపనిషత్ భగవద్గీత అష్టమాధ్యాయం, ఛాందోగ్యోపనిషత్‌లు ఉత్తరాయణం, మకర సంక్రమణం గురించి వివరించాయి. ‘ఓ అగ్నిదేవుడా మంచి మార్గాన్ని మాకు చూపించు’ అని ప్రార్థిస్తున్నారు. జీవులు తాము చేసిన కర్మఫలాన్ని అనుభవించటానికి ప్రయాణించే రెండు రకములయిన మార్గాలను చెప్తూ, మొదటిది ‘దేవయానం’. అనగా అర్చిర్మార్గం. అంటే కాంతి లేక వెలుగు మార్గం, అంటే సక్రమ మార్గం. అదే ఉత్తరాయణం. రెండవది -పితృయానం - కృష్ణపక్షం - చీకటి మార్గం. అక్రమ మార్గం - దక్షిణాయనం.
వెలుగు మార్గంలో పయనించిన వారు, సూర్య సాయుజ్యం పొందుతారు. సూర్య చంద్ర సంబంధిత విషయాన్ని తెలిసికొని, దర్శించిన ఉపాసకులు పరబ్రహ్మ తత్త్వంలో తాదాత్మ్యం చెందుతారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు వేచి ఉండి తనువు స్వచ్ఛందంగా చాలించి పరబ్రహ్మ తత్త్వంలో లీనమయినాడు. ఇది హేమంత నవ్యకాంతితో వచ్చే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల వైశిష్ట్యం.
జీవన గమనంలో వచ్చే అనేక ఆటుపోట్లతో సతమతమయి మోడువారిన జీవితాలను చిగురింపజేసే అమృత క్రాంతి సంక్రాంతి. ఎంతో ఉత్సాహాన్నిచ్చి, శేష జీవితాన్ని గడపటానికి చైతన్య శక్తినిస్తుంది - మకర సంక్రాంతి. నవ్యతకు నాంది పలికి విజ్ఞాన వినోదాన్ని పంచిపెట్టి శ్రమకు తగిన ఫలసాయాన్నందించి, సర్వకళామయిగా వెలుగొందుతూ, సమ సమాజ స్థాపన చేసి, మానవతను పెంపొందింపజేసి, అనునిత్యం జీవన మాధుర్యాన్ని గ్రోలుతూ జీవించాలని హెచ్చరించే క్రాంతి - మకర సంక్రాంతి.
మకర సంక్రాంతి: శని ప్రభావము
మకర రాశికి శని అధిపతి. శని - వాయుతత్త్వం, వాతతత్త్వం. కనుక వాతహరములైన వంటలూ తిలా (నువ్వులు) ప్రాధాన్యమూ కనిపిస్తాయి. వాతహరములైన నువ్వులతోనూ, బెల్లముతో కూడిన పిండి వంటలు సంక్రాంతి పండుగనాడు చేస్తారు. గుమ్మడి దానమిస్తారు (మంచి గుమ్మడి) సజ్జ రొట్టెలు తింటారు. వృషభము, ఆవుదూడ - చిన్న వెండి విగ్రహాల్ని దానమిస్తారు. హేమంత ఋతువులో వచ్చే అనారోగ్యాలు, నువ్వులు బెల్లం, సజ్జలతో చేసిన పదార్థాలతో చేసిన వంటలతోను, సూర్యారాధనతోనూ, ప్రాణాయామంతోనూ నయమవుతాయి. తొలిమాపు వేళ చిరంజీవులు, పెద్దలకు మ్రొక్కి వారి ఆశీస్సులు తీసుకుంటారు. కనుకనే దీనిని మ్రొక్కుల పండుగ అంటారు. ఇది మకర సంక్రాంతి విశిష్టత.
సంక్రాంతి మహిమ
జాబాలి మహర్షికి సునాగుడు అనే ముని, సంక్రాంతి మహిమను చెప్పాడు. సంక్రాంతినాడు శివునికి ఘృతాభిషేకం చేసి నువ్వు పువ్వులతో, మారేడు దళాలతో పూజచేసి, షోడసోపచారము లర్పించాలి. రాత్రంతా పరమేశ్వర ధ్యానంలో భజనానందంతో జాగరణ చెయ్యాలి. ప్రాతఃకాలంలో స్నానం చేయాలి. మకర సంక్రాంతి నాడు యశోదా కృష్ణ ప్రతిమలకు పూజచేసి, పెరుగు పోసిన పాత్ర, కవ్వం మొదలయిన వాటితో ఆ ప్రతిమలను సత్పాత్తునికి దానం చేస్తే, ధనధాన్యాది సంపదలు, పరమేశ్వరానుగ్రహం కలుగుతాయని చెప్పాడు.
కృపాచార్యుని సోదరి కృపి ద్రోణాచార్యుని భార్య తన దారిద్య్ర బాధ చెప్పి దుర్వాసుని కోరితే ఆయన ఈ వ్రతం చెప్పాడు. ఆ ప్రకారం ఆమె చేసినందుకు ఆమెకు అశ్వత్థామ కలిగి, దారిద్య్ర బాధ తొలగిందని సునాగముని చెప్పాడు. ఇది సంక్రాంతి మహిమ.
మకర సంక్రమణం: గజేంద్ర మోక్షం: జ్యోతిష శాస్త్ర అన్వయం
మకర మొకటి రవి జొచ్చెను, మకరము మఱియొకటి ధనుసు మాటున దాగెన్, మకరాలయమున దిరిగెడు మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్ - భాగవతము
మకర రాశిలో రవి ప్రవేశాన్ని గురించి అనగా ‘మకర సంక్రాంతి’ని గూర్చి వివరిస్తూ పరమ భాగవతోత్తముడైన పోతన, భాగవతంలో వ్రాసిన పద్యమిది.
‘ఉషాత్రయం, శ్రవణం, ధనిష్ఠార్థం మకరం’ అనగా, ఉత్తరాషాఢ మూడు పాదములు, శ్రవణం నాలుగు పాదములు, ధనిష్ఠ - ఒకటి రెండు పాదములు. వెరశి తొమ్మిది పాదములు - మకరరాశి.
మకర మొకటి ధనువు మాటున దాగినదనగా - ఉత్తరాషాఢ నక్షత్రంలో మొదటి పాదం, ధనుర్రాశికి చెందింది. మూలా నక్షత్రం - పృథ్వీ తత్త్వంతో కూడినది. కూర్మరాజు (తాబేలు) పృథ్వి (్భమి)కి సంకేతం. కావున ధనుర్రాశిలోని నక్షత్రాన్ని మకర రాశిలోని నక్షత్రాల్ని వివరిస్తూ రవి మకర రాశిలో ప్రవేశించినపుడు వచ్చే మకర సంక్రాంతిని గురించి మహాకవి పోతన భాగవతంలోని ‘గజేంద్ర మోక్ష’ ఘట్టంలో చక్కగా వివరించాడు.
సూర్యుడు, మిథునరాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశించేటపుడు వచ్చేది - కర్కాటక సంక్రమణం - దక్షిణాయనం. అష్టదిక్పాలకులలో, ఇంద్రుడు తూర్పుదిక్కుకు అధిపతి. అతని వాహనం - ఐరావతం. అంటే గజరాజు - ఏనుగు. పడమర దిక్కునకు అధిపతి - వరుణుడు. ఇతని వాహనం - మకరం - మొసలి. యోగశాస్త్రం ప్రకారం, ఏనుగు మన శరీరంలో, షట్చక్రములలో ‘మూలాధారం’లా ఉంటుంది. మూలాధారం పృథ్వీ తత్త్వం. తూర్పు దిక్కుకు అధిపతియైన ఇంద్రుడు, సహస్రార చక్రానికి అధిదేవత. యోగసాధకుడు మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని యోగ సాధనతో, మూలాధారంలో ఉన్న కుండలినీ శక్తిని యోగసాధనతో ఒక్కొక్క ఆధ్యాత్మిక చక్రమును అధిగమిస్తూ పై చక్రాలను తీసికొని వెడుతూ సహస్రారానికి చేరుస్తాడు. మూలాధార తత్త్వాన్ని మననం చేసుకుంటూ, పృథ్వీ తత్త్వాన్ని జయించి, స్వాధిష్ఠాన చక్రంలో ప్రవేశింపజేస్తాడు.
స్వాధిష్ఠానం - జలతత్వం. మూలాధార చక్రంలోని ఐరావతమూ (గజేంద్రుడు) జలతత్వంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ స్వాధిష్ఠానవాసుడై, మకర రాశిలోని ‘శ్రవణా’ నక్షత్ర అధిదేవత అయిన శ్రీమన్నారాయణుడు, కాలచక్రమనే సుదర్శన చక్రాన్ని పంపి, మకరాన్ని ఖండిస్తాడు. అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలుగులో ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందన్న వ్యాస హృదయాన్ని పరమ భాగవతోత్తముడైన పోతన, భాగవతంలోని అష్టమ స్కంధంలో యోగశాస్త్ర అన్వయంగా విశదపరచాడు. ఇది మకర సంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం, భాగవతం - అష్టమస్కంధం, గజేంద్ర మోక్ష ఘట్టానికి - ఆధ్యాత్మిక, జ్యోతిష, యోగ శాస్త్రాన్వయం, ఎంతో మహోదాత్తమైన విషయం.
మకర సంక్రాంతి:
పితృతర్పణాలు
మానవులకు కాలమానమైన ఒక మాసం, పితృదేవతలకు ఒకరోజు. అంటే శుక్ల పక్షం పగలు, కృష్ణపక్షం రాత్రి. అలాగే మానవ సంవత్సరం దేవతలకు - ఒకరోజు. అనగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి వచ్చిన ఉత్తరాయణం, ఆరునెలలూ దేవతలకు పగలు, దక్షిణాయనం - రాత్రి. దేవతలకు పగటికాలం ప్రారంభమైన ఉత్తరాయణంలో మంచి కార్యాలు, యజ్ఞయాగాదులు, క్రతువులు చేసి, దేవతల అనుగ్రహాన్ని పొంది, పుణ్యప్రాప్తితో పురుషార్థాల్ని పొందమని సూచిస్తుంది - మకర సంక్రాంతి. ఆ విధంగానే పితృదేవతలకు మకర సంక్రమణం రోజున తర్పణాలు అర్పిస్తే, వారికి ఉత్తమ లోక ప్రాప్తి లభిస్తుందని చెప్తారు.
మకర సంక్రాంతి స్వామి అయ్యప్ప జయంతి
హరిహరాంశగా అవతరించి స్వామియే శరణమయ్యప్పా స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శబరిమలకు వచ్చే భక్తుల శరణు ఘోషతో శబరిమల మారుమ్రోగుతుంది. దాన్ని ఆలకించి కటాక్షించే స్వామి అయ్యప్ప జయంతి - మకర సంక్రాంతి రోజే. పందల రాజుకిచ్చిన వాగ్దానం మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి స్వామి జ్యోతి స్వరూపుడై దర్శనమిచ్చి భక్తులకు జ్ఞానోదయాన్ని కల్గిస్తాడు. ‘పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలిసి కోరే’ అన్నాడు వాగధీశ్వరీ రాగంలో త్యాగరాజస్వామి, ‘అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థ్సితః’ అన్నది శృతి. ఇది మకర సంక్రాంతి విశేషం.
భోగి పండుగ
సంక్రాంతి పండుగను ముచ్చటగా మూడు రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ అంటారు. సంక్రాంతి ముందు రోజు వచ్చేది భోగి పండుగ.
తెల్లవారక మునుపే లేచి ఇంటి ముందు భాగంలో భోగిమంటలు వేస్తారు. అనగా ఇంటిలోని పాత వస్తువులు, పనికిరాని వస్తువులు ఆ మంటల్లో వేస్తారు. మంటల చుట్టూ పిల్లలూ, పెద్దలూ కూర్చుని చలి కాచుకుంటారు. మనలోని దుష్ట భావనల్ని, దుర్గుణాల్ని జ్ఞానమనే మంటలో వేసి దహించటమే దీని అంతరార్థం.
చిన్నపిల్లల్ని చక్కగా అలంకరించి, ముస్తాబు చేసి వరుసగా కూర్చోబెట్టి వారి తల మీద రేగిపండ్లు, బంతిపూలు, శనగలు, వయోవృద్ధులు ముతె్తైదువులు పోస్తారు. పెద్దలు చిన్నారులను ఆశీర్వదించటం, దృష్టి దోష నివారణ దీనిలోని ఆంతర్యం అని చెప్తూ, రేగిపండ్లలో సౌర తేజస్సు ఉంటుంది. సూర్యుడు ప్రాణ శక్తి ప్రదాత. కనుక, సూర్యతేజస్సు బ్రహ్మరంధ్రం గుండా పిల్లలకు అందివ్వబడుతుందన్నది, దీని వెనుక దాగిన వైజ్ఞానిక ఆధ్యాత్మిక రహస్యంగా చెప్తారు.
గోదా కల్యాణం
రవి, ధనుర్రాశిలో ప్రవేశించిన రోజు నుంచి ధనుర్మాస వ్రతం ఆచరించి, శ్రీరంగనాథుని వివాహమాడింది గోదాదేవి. శ్రీవిల్లి పుత్తూరులో ముకుందార్యుడనే శ్రీవైష్ణువుడు, ఆయన భార్య పద్మావతి విష్ణు భక్తులు. పూల మాలలు, తులసి మాలలు కట్టి పరమాత్మకు సమర్పించుచూ, సత్కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. సంతానం లేని విష్ణుచిత్తునికి (ముకుందార్యుడు) తులసి వనంలో పాదులు చేస్తుండగా లభించిన పసిపాపకు ‘కోదై’ అని నామకరణం చేశాడు. ఆమే గోదాదేవి. శ్రీరంగనాథునికి అనగా కృష్ణునికి సమర్పించే పూలదండలను, తను ముందుగా ధరించిన తరువాత స్వామికి సమర్పించిన గోదాదేవిని ‘ఆ ముక్తమాల్యద’ అన్నారు. విష్ణుచిత్తుడే పెరియాళ్వారు. రోజుకొక పాశురముతో శ్రీకృష్ణుని (శ్రీరంగనాథుని) ధనుర్మాసంలో 30 రోజులు అర్చించగా, రంగనాథుడామెకు స్వప్నంలో కనిపించి, ఆమె హృదయ పరిపక్వతకు సంతసించి, తపోనియమాలను వీడి సర్వభోగాలను అనుగ్రహించాడు.
ఆ దేవదేవుని ఆజ్ఞానుసారం శ్రీరంగ క్షేత్రంలో భోగిపండుగ రోజున వైభవంగా కల్యాణం జరిగింది. గోదాదేవి (ఆండాళ్ తల్లి) యోగనిద్రాముద్రితుడైన శ్రీరంగనాథునిలో ఐక్యమయింది. ఇది భోగి పండుగ విశేషం.
భోగి పండుగ: బలి చక్రవర్తి
అసురేశ్వరుడైన బలిచక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామన రూపంలో పాతాళానికి పంపిన పర్వదినమే భోగిపండుగ. భోగిమంటలు మానవునిలోని, కల్మషాలను పటాపంచలు చేస్తాయని, సంకటాలు దగ్ధం అవుతాయని చెప్తారు. బలి చక్రవర్తి వామనుడు మూడు అడుగుల స్థలం ఇవ్వమని కోరాడు. ఆ మూడు అడుగుల స్థలం ఇచ్చి, తనలోని స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలను; జాగృత్, స్వప్న, సుషుప్త్యావస్థలను; సత్వ, రజ, తమో గుణములను, ఈషణత్రయాన్ని హరింపజేసుకున్నాడు. వామనుని పాదస్పర్శతో బలిచక్రవర్తి, అజ్ఞానమనే చీకటిని పోగొట్టుకొని జ్ఞాన వెలుగును దర్శించి ఉత్తరాయణమంతా స్వర్గ ద్వారములు, వైకుంఠ ద్వారములు తెరచి ఉండేటట్లుగా, ఆ సమయంలో మరణించిన వారికి ఉత్తమ గతి ప్రాప్తించేటట్లుగా శ్రీమన్నారాయణుని నుండి మానవాళి కోసం వరం అడిగి, పొందాడు. మనస్సులో మాధవుణ్ణి మనసారా నింపుకుని మానవసేవలో మాధవ సేవా పుణ్యాన్ని పొందమని చెప్తుంది మకర సంక్రాంతి - భోగి పండుగ.
సంక్రాంతి ముగ్గులూ: గొబ్బిళ్లు
ధనుర్మాసం నెలరోజులూ వాకిళ్లల్లో కలాపి చల్లి, బియ్యపు పిండితో వివిధ రకాలైన రంగవల్లులు వేస్తారు. ముగ్గులున్న లోగిళ్లలోకి లక్ష్మీదేవి వస్తుందని, ముగ్గులున్న ఇళ్లు ఎల్లవేళలా సంపదలతో కళకళలాడుతూ ఉంటుందని ఒక నమ్మకం, ఆర్యోక్తి. రంగవల్లిక తరతరాలుగా సాగుతున్న సంప్రదాయం. వాటి మధ్యలో గొబ్బిళ్లు అనగా గోమయంతో చేసి పసుపు కుంకుమలతో అలంకరింపబడేవి, పెడతారు. రామాయణ కాలంలో కూడా రంగవల్లులున్నాయి.
వేదవాక్ స్వరూపులు గోపికలు. వేదవేద్యుడు శ్రీకృష్ణ పరమాత్మ. గోపికలు - వికృతి రూపం - గొబ్బిళ్లు. గోపి - గొబ్బి అయింది. భోగినాడు కృష్ణుని ప్రతీకగా పెద్ద గొబ్బెమ్మను, చుట్టూ ఎనిమిది చిన్న గొబ్బెమ్మలను పెట్టి పూజలు చేస్తారు. ‘కొలను గోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి గొబ్బిళ్లో’ అన్న యదుకుల కాంభోజి రాగంలోని అన్నమయ్య పదాన్ని పాడతారు. గొబ్బిపాటలు పాడుతూ ప్రదక్షిణలు చేస్తారు.
బొమ్మల కొలువు
సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు. ‘దేవుడు తనకొక తావుండాలని మనిషికి మనసు ఇచ్చాడు, ఆ మనసే కరువైనప్పుడు, పాపం, దేవుడు బొమ్మైపోయాడు...’ అంటూ అద్భుతమైన ఆధ్యాత్మికతను ఇమిడ్చి బొమ్మల మీద ఒక గీతాన్ని అందించాడు, మనసు కవి ఆచార్య ఆత్రేయ. ఇది సంక్రాంతి నాటి బొమ్మల కొలువుకి సంపూర్ణ దీప్తినిస్తుంది.
పతంగుల పండుగ
పదపదవె వయారి గాలి పటమా...అంటూ పిల్లలూ పెద్దలూ అందరూ గాలిపటాల్ని ఎగురవేస్తారు. నింగికి రంగులు పులిమేటట్లుగా ఉంటాయి పతంగులు.
కనుమ పండుగ
ఇది పూర్తిగా కర్షకుల పండుగ. తమ జీవితాలకు ఎన్నో విధాలుగా సహకరించే పశువులను, గోజాతిని పూజించే పండుగ. కొమ్ములకి రంగులు, మెడలో గంటలు అలంకారం చేసి కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటారు. ‘డూడూ బసవన్న...’ అంటూ గంగిరెద్దు, సన్నాయి మేళంతో ఆడిస్తారు. ఎద్దు ధర్మానికి ప్రతీక. గంగిరెద్దు మేళంతోటీ, శ్రీమహావిష్ణువు వేషధారియై ఆడిస్తూ గజాసురుని సంహరించిన వృత్తాంతం. కృషియున్న నెపుడు దుర్భిక్షమే యుండదు, గోజాతి కృషికిని కుదురు కాన, కనుము పండుగనాడు కర్షక జనులెల్ల గోవుల పసుపులన్ కుంకుమలను పూజించి, వానికి పుష్కలమ్ముగా పుష్టి కలుగు నాహారము లొలియజేసి’ అన్న పైడిపాటి సుబ్బరామశాస్ర్తీగారి ‘సంక్రాంతి’ సంక్రాంతికి పూర్తి స్ఫూర్తినిస్తుంది.
సమన్వయ, సమరస భావంతో జీవన యాత్ర సల్పి, సర్వమానవ సౌభ్రాత్రతతో విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షించే నవ్య తేజస్సును పొందాలని ఉద్బోధిస్తోంది ‘మకర సంక్రాంతి’.
*

-పసుమర్తి కామేశ్వరశర్మ