స్మృతి లయలు
అందరూ ‘తేనె మనస్కులే!’! -99
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భెజవాడ గాంధీనగరం అంటేనే సినిమాల నగరం! పెట్టుబడి పోయేది ఇక్కడి నుంచే. సినిమాలు పంపిణీ అయ్యేదీ ఈ ఊరి నుంచే, పైగా, ‘పత్రికా, ‘ప్రభా’ వెలువడుతున్నదీ - అన్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కూడా ఇక్కడ్నుంచే. అంచేత ఎర్నేనిమేన్షన్లోని స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, దాని పక్క భవనంలో కేంద్ర ప్రభుత్వ సమాచార సంస్థ పి.ఐ.బి. (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో)లో రెండూ కూడా ఇక్కడే ఏర్పడి ఉన్నాయి.
సినిమాల తయారీ ఇక్కడ లేకపోయినా రిలీజింగ్, శతదినోత్సవ సంరంభం ఇదంతా, ఈ ఊరి జన్మహక్కు. ప్రతీ సినిమా విడుదలా ఒక పండుగే. అలంకార్ థియేటర్ మీద కొత్త మోజు. సినిమాల విడుదల ఇంచుమించు ఒకేసారి సాధారణంగా శుక్రవారం నాడు జరగటం ఆనవాయితీ అయిపోయింది. పక్కనే శని, ఆదివారాలు వస్తాయి కనుక అనొచ్చును.
మద్రాసులో అయ్యవారికి ఒక ఐడియా వచ్చింది. ప్రతీ ఆదివారం అనుబంధంలోనూ సినిమా కూడా ఓ భాగమే కానీ బెజవాడ కేంద్ర బిందువు కనుక శుక్రవారం, శుక్రవారం - ఓ పేజీ సినిమా కోసరం కేటాయిస్తే ఉభయతారకంగా ఉంటుందేమోనని అనుకోడమే తరువాయి.. పి.ఎస్.ఆర్.గారు (ఇక మీదట పినపాక సూర్యప్రకాశరావుగారిని ఇట్లాగే రిఫర్ చేస్తాను) నన్ను పిలిచాడు.
‘‘నువ్వు వారానికో సినిమా పేజీ పెట్టాలి. ఇక్కణ్నుంచి మద్రాసుకు పంపాలి’’ అన్నాడు.
‘‘నైట్ డ్యూటీలు ఎత్తేద్దామా?’’ అన్నాను.
‘‘అదేం కుదర్దు. అది అదే - ఇది యిదే అదనం,’’ అన్నాడు.
‘‘సారీ! నథింగ్ డూయింగ్.. సార్. సారీ... కుర్రాళ్లున్నారుగా. లెట్ పి.వి.ఆర్ డూ యిట్’’ అన్నాను. అక్కణ్నుంచి వెళ్లిపోయాను.
శుక్రవారం సినిమా పేజీ ఉంటే కొత్త రిలీజులకి చిన్న ప్రకటనలు వస్తాయి. ‘‘నేడే చూడండి’’ అంటూ థియేటర్ల వాళ్లు కూడా ఇస్తారు. బాగుంది. కానీ, కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లు తిరగాలి. పూర్ణా, నవయుగ కంపెనీల మధ్య ఎర్నేని మ్యాన్షన్‌లోని సమాచార కార్యాలయాలు, ఆఫీసు మధ్య దాగట్లో పడ్డ వెలక్కాయలాగ కొట్టుకోవాలి. కథ రాయడం నవలకి ప్లాను వేసుకోవడం ఇవన్నీ అటకెక్కిపోతాయి. మర్నాడు ఇంటర్వెల్లో పి.ఎన్.ఆర్.గారు నా దగ్గరకి వచ్చి ‘‘బయటికి పోతున్నావా?’’ అనడిగాడు.
‘‘బందిఖానాలోకి వచ్చాకా, బయటకి ఎలా పోతాడు ఖైదీ’’ అన్నాను.
అతని సీటు దగ్గరకెళ్లి కూర్చున్నాం. ఆయన పొంగరాలు తెచ్చుకున్నాడు. టిఫిన్ డబ్బా మూతలో నాకు ఒకటి పెట్టి చెట్నీ వేసి అందించాడు.
‘‘కరణంగారి ఆతిథ్యానికి కారణం ఏదో ఉంటుందో నా స్వగతం అన్నమాట’’ కొంతసేపు చర్చ సాగింది. కాఫీ సిప్ చేస్తుండగా ‘‘సరే! నీ ఇష్టం, కాకపోతే, ఇదేదో నా నిర్ణయం అనుకోకు. నఖరాలు మాను. అయ్యవారు నీకే ఈ బాధ్యత అప్పగించమన్నారు’’ అంటూ సీట్లో నుంచి లేచాడు.
అతను తిరిగి వచ్చేసరికి, నేనూ లేచాను... నా మొహం చూస్తూ.. ‘‘నమ్మకం లేదా?’’ అంటూ తన సొరుగు లాగి అందులోంచి నాలుగు మడతలున్న ఉత్తరం, ‘యిలా’ ఇప్పి చూపించాడు. మారు మాట చెప్పలేదు నేను... యస్సార్’’ అన్నాను.
అట్లా ఫిబ్రవరి రెండోవారం నుంచీ సినిమా పేజీ బెజవాడ నుంచి బెజవాడలో ‘వీరాజీ మార్కు’ పేజీ మొదలైంది. పి.వి.ఆర్.కి చెప్పాను. ‘‘చెయ్యండి.. మీకు కొత్తేమీ కాదుగా..’’ అంటూ తన పూర్తి సహకారాన్ని అందిస్తానన్నట్లు ప్రసన్నంగా చూశాడు. ‘‘ఓ ఆర్టికల్ రాయరాదా?’’ అన్నాను.
సినిమా థియేటర్ల దుస్థితి మీద ఒక ఆర్టికల్ రాశాడు పి.వి.ఆర్. (పొట్లూరి వెంకట్రావ్) సరే! ఉన్నారుగా, నా ఫేవరేట్స్ భానుమతి, శివాజీ గణేశన్ ఆ ఇద్దరికీ ‘పద్మశ్రీ’ అవార్డులొచ్చాయి. అంచేత ఇద్దర్నీ కలిపి వ్యాసం రాశాను నేను.
శుక్రవారం నాడు ప్రకటనలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. బుధవారం నాడు సాయంకాలం నేను రావాలి. ‘పేజీ’ పెట్టాలి. దాన్ని మద్రాసుకి పంపిస్తే గురువారం సాయంకాలం సంచికలో ఇక్కడా, అక్కడా పెడతారు. కరణంగారు చాలా గడుసువాడు. బుధవారం నాడు నాకున్న ‘‘వీక్లీ ఆఫ్’’ని మార్చలేదు. అలాగే ఉంచాడు. కాకపోతే మా ఇద్దరికీ ఒకటే భయం. ‘‘అయ్యవారికి ఏమి చెబుతాడో’’ అని ఎవరికి వాళ్లం రెండో వాణ్ని సుముఖంగా ఉంచుకునేవాళ్లం...
ఆవిధంగా, వీక్లీ ఆఫ్ నాడు కూడా ‘పేజీ’ కోసం సాయంకాలం కైంకర్యం. దీనికి మ్యూచువల్ ‘‘కాంపెనే్సటరీ ఆఫ్’’ ఇస్తానన్నాడు కానీ ఒక్కసారి కూడా ఇవ్వలేదు. నా డైరీలో, నలభై ‘సి.ఆఫ్.’లు... అలాగే బాకీ ఉండిపోయాయి.
జేమ్స్‌బాండ్ ఇంగ్లీషు సినిమా ‘ఈవ్నింగ్ యిన్ బ్యాంకాక్’’ అనే ఫ్రెంచి నుంచి ఇంగ్లీషులోకి డబ్బింగ్ చేసిన సినిమాతో కలిపి మూడు సినిమాలు వెంకట్రావుదో సినిమా మొత్తం నిండుగా వేశాం. అంతే, ఇరుక్కుపోయాను....
ఐదేళ్లు మా విజయవాడ నగరంలో లేకపోయినా పాత పరిచయాలు, నవయుగ నర్సయ్యగారు, పూర్ణ కామరాజుగారు, వాణీ సుబ్బారావ్ వగైరాలూ ఎన్.ఐ.సి. భండారు పర్వతాలరావుగారు, పి.ఐ.బి. రెడ్డిగారు అంతా మనవాళ్లే. ప్రభ డైలీలో మా తమ్ముడు సుబ్బారావుశాస్ర్తీ, రెంటాలగారు మమ్మల్ని చిన్నప్పట్నుంచీ ఎరిగిన ఆంధ్రజ్యోతి తుర్లపాటివారు అంతా, ఓ కుటుంబంలోకి వచ్చిపడ్డట్లే ఉంది గానీ ఎటాముటీగా ఏమీ లేదు. కాబట్టి నా ‘స్పెషాలిటీ’ని మరి (వీక్లీ ఇన్చార్జ్గా చేసి వచ్చాను కదా) అలా కాపాడుకుంటూ నా కార్నర్ రూమ్‌లో రాసుకుంటూ బిజీగా ఉన్నవా ‘‘రావచ్చా?’’ అంటూ ఓ స్ర్తి కంఠం - ఆమె ప్రసిద్ధ రచయిత్రి లత. లోపలికి ఇలా తొంగిచూస్తూ ‘‘నీకీ’ ముట్టుగది ఇచ్చారన్న మాట? నిన్న వచ్చానూ హాల్లో నువ్వు లేవని చూసి వెళ్లిపోయాను’’, అంది. లత అప్పటికే ఫేమస్. ‘ఊహాగానం’ రాస్తుంది కూడా. చనువు తీసుకోగలదు. చనువుగా ‘రిపార్టీ’ ఇస్తే తీసుకోనూగలదు...
నేను అన్నాను. ఆ మూడు రోజులు రెస్ట్ కూడా ఇప్పించు తల్లీ! మా రాధాకృష్ణగారికి చెప్పి. మీ మేనబావేగా?’’ రాధాకృష్ణ తనకి మేనబావ అవుతాడని అంటూండేది ఆమె.
తేనెమనసులొక ‘మలుపు’’:
1965 మార్చి నెలాఖరున ఓ సినిమా మైలురాయి స్థాపితం అయింది. మహదేవన్ సంగీతంతో, ఆదుర్తి సుబ్బారావుగారితో ప్రయోగాత్మక గేవాకలర్ వర్ణచిత్రం ‘తేనెమనసులు’ రిలీజయింది. అన్నీ కొత్త మొహాలే. కృష్ణ, రామ్మోహన్, సుకన్య, సంధ్యారాణి లాంటి కొత్త ‘బ్యాచి’’తో తీసిన ఈ చిత్రానికి డకోటా విమానంలో తెచ్చి కరపత్రాలు, బెలూన్లు పై నుంచి వదిలారు. జనం విరగబడి చూశారు. ఆశ్చర్యంగా, ఈ సినిమా శతదినోత్సవం కూడా జరుపుకుంది.
ఆవిధంగా సూపర్ హీరో అయిన ఘట్టమనేని కృష్ణ కెరీర్ శతదినోత్సవ వర్ణచిత్రంతో మొదలైంది. మర్నాడు ఏప్రిల్ ఫస్ట్. పొద్దునే్న ‘‘నరసయ్యగారు’’ రామంటున్నారండీ.. అర్జెంట్’’ అంటూ సైకిల్ రిక్షా మీద కబురు. నిద్రలేవడం అంటే తొమ్మిది తర్వాతే. నాకు ఆ రోజుల్లో కానీ ఉన్న పళాన, చొక్కాని పంట్లాంలోకి తోసేసుకుని (‘టకప్’ అలవాటు సర్వకాలాలలోనూ) హవాయి చెప్పులే తొడుక్కుని (బూట్లు వేసుకునే టైము లేదు) బీసెంట్ రోడ్డు మీది మోడరన్ కేఫ్‌కి వెళ్లాను. అప్పటికే, ‘తేనె మనసులు బృందం’ అంతా, దాని చిన్ని టెర్రస్ మీదికి చేరుకుంది. చిన్న బ్రేక్‌ఫాస్ట్ పార్టీ... అదుర్తిగారు ‘తెరమీద - తెరవెనుక’ శీర్షికకి ఓ ‘‘హీరో’’యే కనుక ననె్నరుగును. తానే, కృష్ణ, సంధ్యారాణీ వగైరాలకి పరిచయం చేస్తూ కూర్చోబెట్టారు నన్ను. పక్కనే సంధ్యారాణీ, సుకన్య ఎదురుగుండా కృష్ణ, రామ్మోహన్ కూర్చున్నారు.
వీక్లీ ఖ్యాతి ఇంకా నా మీద ఓ ‘‘గ్లామర్ వలయంలాగా’’ ప్రకాశిస్తోంది. సామెత చెప్పినట్లు నేను సంధ్యారాణినీ, కృష్ణనీ సంభాషణలో పెడుతూ ఉంటే సంధ్యారాణీ ‘డాడీ’ (అని ఆ అమ్మాయ్ చెప్పింది) అన్నాడాయన నన్ను వాడుక భాషలో చెప్పాలీ అంటూ ‘వాయించేశాడు’..నిద్రమత్తు వదిలేసింది.
అందరం ఆదుర్తిగారినీ, నిర్మాతల్నీ అభినందించాం. కృష్ణనీ, రామ్మోహన్నీ (ఆంధ్రా దేవానంద్ అంటారు సార్ నన్ను అని చెప్పాడు రామ్మోహన్ పాపం!) సంధ్యారాణీ, సుకన్యలను అభినందించాం. అప్పుడు ఊళ్లో పెద్ద పోష్ హోటలు అంటే బీసెంట్ రోడ్‌లోని మోడరన్ కేఫ్. ఎయిర్ కండిషనింగ్ కూడా కొత్త. ఆ హోటల్ రెస్టారెంట్లో ఎ.సి.హాలులోకి పోయి, కాఫీ తాగాలీ అంటే గంటకి పావలా అదనంగా, ముందే కౌంటర్లో టికెట్ తీసుకోవాలి. అక్కడ క్యూలు చాంతాడుల్లాగా కనబడతాయి.
కాకపోతే ‘తేనె మనసులు’ బాక్సాఫీస్ హిట్ కావడంతో కొత్తగా ఫీల్డులోకి వచ్చే వారికి అవకాశాలు పెరిగాయి. ప్రయోగాలు చేసే ధైర్యం నిర్మాతలకి కూడా ఎక్కువైంది... అదో మలుపు.
బిడియంగా గ్రూపు ఫోటోలో నిలబడ్డ వాడు కృష్ణ అంచెలంచెలుగా పుంఖానుపుంఖాలుగా సినిమాల్లో నటిస్తూ నిర్మిస్తూ ‘అల్లూరి సీతారామరాజు’ అనే చారిత్రాత్మకమైన పెద్ద తెర చిత్రంతో వంద సినిమాలలో గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాడు. సూపర్ హీరో అయినాడు. ఈలోగా, రచయితగా నేను కూడా 2006లో నా గోల్డెన్ జూబ్లీ చేసుకున్నాను. 2011తో నాకు జర్నలిస్ట్‌గా కూడా నేను గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్నాను. అల్లూరి సీతారామరాజు/జాతీయస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ కూడా మన్ననా సత్కారం పొందింది. అదే, అతని నూరవ చిత్రం!
ఆ సత్కారసభని మనోరమ హోటల్లో జరిగిన గెట్ టుగెదర్‌లో నేను పాల్గొన్నాను. విజయనిర్మలా, కృష్ణా కూడా మహదానందంగా మా పత్రికల వారితో ఆ సాయంకాలం గడిపారు. (1974) అప్పుడో తమాషా జరిగింది. అది, ఆనక చెబుతాను. కృష్ణ నిర్మాతగా కూడా అనితరసాధ్యమైన చిత్రాలు తీయడం గురించి నాటి, తొలి, తేనె మనసులు చిత్రానికి ఎలా అభినందించానో అదే మాదిరిగా, అప్పుడు కూడా అలాగే సంతోషంగా అభినందించాను. ‘‘నాటి బాలుడు’’ నేటి ‘‘విప్లవ వీరుడు’’ అన్న నా మాటల్ని విజయనిర్మలగారులాగా హర్షించింది. 1965లో ఎవ్వరూ ఊహించలేదు గానీ, అందరూ అతని సాహసాన్నీ, సక్సెస్‌నీ హర్షించారు ఆ రోజు. అదో పండుగ వాళ్లందరికీ. అంటే అభిమానులకి కూడా.
(ఇంకా బోలెడుంది)