కర్నూల్

సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అభివృద్ధిని అడ్డుకుంటే సహించం:ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, నవంబర్ 27:గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఆకే.రవికృష్ణ తెలిపారు. జిల్లా అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తినైనా వదిలి పెట్టకూడదని పోలీ సు యంత్రాంగానికి సూచించారు. నగరంలోని జిల్లా పోలీసు మైదానంలో శుక్రవారం పోలీసు పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, క్రైం పార్టీ కానిస్టేబుళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విధుల్లో ప్రతిభ కనబరచిన వారికి నగదు రివార్డులు అందజేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా స్పీడ్ బైక్‌లపై తనిఖీలు నిర్వహిస్తూ అపరిచిత వ్యక్తులు కనపడితే ఆపి వారి వాహనాల రికార్డులను, వ్యక్తుల పూర్తి సమాచారం తెలుసుకోవాలన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు వస్తున్నారా అని ఆరా తీయడంతో పాటు, ఇతర జిల్లాల నుంచి చైన్‌స్నాచింగ్ దొంగల పేర్ల జాబితాను తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలిపారు. నేరం జరిగిన వెంటనే అతడి ఎత్తు, రంగు, వాహనం రంగు ఆ నేరస్థుడి రూపురేఖలు గుర్తుంచుకునే విధంగా బాధితులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తం గా ప్రత్యేక మఫ్టీ బృందాలను ఏర్పాటు చేసి గట్టి నిఘా పెంచామన్నారు. తప్పును ఎదురించే వారు ఎవరైనా పోలీసే అన్నారు. బాధితులు మీ ఇంటి వారైతే మీరు ఏ విధంగా స్పందిస్తారో అలాగే స్పందించి జిల్లా ప్రజ లు, యువకులు పోలీసులకు సహకరించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఇకపోతే పోలీసు సిబ్బంది ప్రతిరోజూ తప్పనిసరిగా గంటసేపు వ్యాయానికి సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. యోగాసనాలు, నడక అలవాటు చేసుకోవాలన్నారు. అనారోగ్యం పాలై కుటుంబాలకు దూరం కావద్దన్నారు. భవిష్యత్తులో ఏఆర్, స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్ల బ్యారక్స్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రజల సమస్యలే కాదు పోలీసు సిబ్బంది సమస్యలు కూడా తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ కోరారు. ఎపిఎస్పీ క్యాంపులో ఉన్న కల్యాణ మండపాన్ని రూ. 5 వేలకే జిల్లా పోలీసులు వినియోగించుకునే అవకాశంపై డిజిపికి విన్నవించగా అంగీకారం తెలిపారన్నారు. మరోవైపు ముఖ్యంగా జిల్లాకు పరిశ్రమలు రాకుండా, వచ్చిన పరిశ్రమలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. ప్రజలను ఉద్వేగాలకు లోను చేసి రెచ్చగొడుతున్నారని, ఇటువంటి వారు మీ పరిధిలో వుంటే కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లా పారిశ్రామికంగా, అభివృద్ధి పరంగా ముందడుగు వేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్ ఏఎస్పీ రాధాకృష్ణ, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, సిఐలు రామకృష్ణ, మధుసూదన్, ములకన్న, జి.మధుసూదన్, ఆర్‌ఐ రంగముని, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది నుంచి 80 వేల ఎకరాలకు
అదనంగా సాగునీరు
బనగానపల్లె, నవంబర్ 27:జిల్లాలో వచ్చే ఏడాది నుంచి అదనంగా 80 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సిఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్లు జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ తెలిపారు. చైర్మన్ రాజశేఖర్ దంపతులు శుక్రవారం మండల పరిధిలోని నందవరం శ్రీ చౌడేశ్వరీమాత ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటివరకూ హంద్రీనీవా కాలువ ద్వారా అనంతపురం జిల్లాకే సాగునీరు అం దించేవారని, తాజాగా కర్నూలు జిల్లాలోని ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని క్రిష్ణగిరి, డోన్, పత్తికొండ మండలాల్లోని భూములకు సాగునీరు అందుతుందన్నారు. జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి వున్నారని రాజధానితో సమానంగా కర్నూలు అభివృద్ధి జరుగుతుందన్నారు. ఎస్సార్బీసీ కాలువలకు నీరు విడుదలపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు జడ్‌పి చైర్మన్‌ను కోరగా సిఎం, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు
జడ్పీ చైర్మన్ రాజశేఖర్ ఆయన సతీమణి జ్యోతి శ్రీ చౌడేశ్వరీమాతకు ప్రత్యేక పూజలు జరిపించారు. అందు లో భాగంగా శ్రీ చక్రార్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు చైర్మన్ దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.
పశుగ్రాసం కొరత రానివ్వం:జెడిఎ
ఉయ్యాలవాడ, నవంబర్ 27: జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో రైతులకు పశుగ్రాసం కొరత రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి సుదర్శనకుమార్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పశు వైద్యశాల ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడిఎ మాట్లాడుతూ రైతులకు పశుగ్రాసం సాగుకై గడ్డి విత్తనాలను సబ్సీడిపై అందజేస్తామని పేర్కొన్నారు. అలాగే పశువులకు సంబంధించి దాణాను కూడా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఆయా గ్రామాల వాతావరణ పరిస్థితులను బట్టి ఏ ప్రాంతంలో ఎలాంటి గడ్డి రకాలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయో అలాంటి విత్తనాలనే సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఎడిఎ కొండారెడ్డి, ఉయ్యాలవాడ, హరివరం, ఇంజేడు పశు వైధ్యాధికారులు నాగాంజనేయులు, రఘుబాలకృష్ణ, జానకి, ఆల్లూరు, ఉయ్యాలవాడ, పడిగెపాడు, ఇంజేడు, కాకరవాడ, తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను
బిజెపి మోసం చేసింది
* జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ ఆఫీసు ఎదుట నిరసన
కర్నూలు ఓల్డ్‌సిటీ, నవంబర్ 27:7వ వేతన కమిషన్‌లో అన్ని విధాలుగా కోతలు విధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను బిజెపి సర్కార్ ఘోరంగా మోసం చేసిందని కర్నూలు హెడ్ పోస్టుమాస్టర్ వై.దావిద్ ఆరోపించారు. ఎన్‌ఎఫ్‌బిఇ, ఎఫ్‌ఎన్‌బిఓ, ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్టుమెన్, ఎంటిఎస్, గ్రూప్-డి యూనియన్, ఎస్‌బిసిఓ యూనియన్ ఆర్‌ఎంఎస్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దావిద్ మాట్లాడుతూ జెఎసి 2014 జనవరి నుంచి వేతనాలను అమలు చేయమని డిమాండ్ చేయగా వేతన కమిషన్ 2016 జనవరి నుంచి అమలు పరచమని సిఫార్సు చేసిందని, డా.అక్రాయిడ్ ఫార్ములా ప్రకారం రూ. 26 వేలు పెంచమని డిమాండ్ చేయగా రూ. 18 వేలకు సిఫార్సు చేసిందని, 3.7 ఫిట్‌మెంట్ కోరగా 2.57 మాత్రమే సిఫార్సు చేసిందని, పద్నోతి ఇచ్చినపుడు 2 ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా ఒక ఇంక్రిమెంటు సిఫార్సు చేసిందని, 5 పదోన్నతులు కోరితే 3 పదోన్నతులు మాత్రమే సిఫార్సు చేందన్నారు. అలాగే క్యాషియర్ అలవెన్సు, క్యాష్ హ్యాండిలింగ్, ట్రెజరీ, హ్యాండిక్యాప్, రిస్క్, సేవింగ్స్ ర్యాంకు, సైకిల్, ఫ్యామిలీ ప్లానింగ్ తదితర 52 అలవెన్సులను రద్దు చేసిందన్నారు. పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మెన్, గ్రూప్-డి వేతనాలు సవరించాలని డిమాండ్ చేయగా కేవలం ఐపి, ఎఎస్‌సి, ఎస్‌పిల వేతనం మాత్రం సవరణ చేసిందని ధ్వజమెత్తారు. 7వ వేతన కమిషన్ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశంలో పోస్టల్ శాఖలో 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, ఇందులో 3 లక్షల మంది గ్రామీణ తపాలా ఏజెన్సీ ఉద్యోగులు ఉన్నారని, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని జెఎసి డిమాండ్ చేసిందన్నారు. జాతీయ జెఎసి డిసెంబర్ 8వ తేదీ ఢిల్లీలో సమావేశమై తదుపరి నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు కె.ఈశ్వరయ్య, వై.శ్రీనివాసరెడ్డి, వై.పుల్లారెడ్డి, బసవ లింగయ్య, సాయిబాబు, హస్సన్, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
సిఎం చంద్రబాబు
అబద్దాలకు అంతే లేదు..
* రైతులకు అన్యాయం చేస్తే సహించం:కేంద్ర మాజీ మంత్రి కోట్ల
కర్నూలు సిటీ, నవంబర్ 27:టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు సాధ్యం కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అబద్దాలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో శుక్రవారం డిసిసి అధ్యక్షుడు బివై.రామ య్య అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సమయంలో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని, వాటి కోసం దాదాపు 27 వాగ్దానాలు చేశారన్నారు. అయితే వాటిలో ఏ ఒక్కటీ అమలు చేయకపోగా వంద రోజుల్లో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, అవసరమైతే కాల్వగట్లపై నిద్రించి పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తామని గొప్పలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాల్వ గట్లపై నిద్రించినంత మాత్రాన ప్రాజెక్టులు పూర్తి కావని, వాటి నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని సూచించారు. నిధులు కేటాయించకుండా వంద రోజుల్లో ఏ విధంగా సాగు నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అంగన్‌వాడీ పోస్టుకు రూ. 2 లక్షలు, విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్ల పోస్టులకు రూ. 3 లక్షలు, టీచర్ పోస్టుకు ఒక రేటు ఇలా ఒక్కో దానికి ఒక రేటు నిర్ణయించి అందిన కాడికి దోచుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాగే తెలుగు తమ్ముళ్లు ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రైతులందరికీ సమన్యాయం చేయాలని కోరారు. అయితే కర్నూలు పార్లమెంట్ పరిధిలోని సి.బెళగల్ మండలం చింతమానుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నీరు వదలాలని కొందరు తెలుగుతమ్ముళ్లు అడిగిన వెంటనే సిఎం చంద్రబాబు రెండు రోజుల పాటు నీరు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చాడన్నారు. అదే లిఫ్ట్ ఇరిగేషన్ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలను వదిలిపెట్టి కేవలం టిడిపి నాయకులు సూచించిన గ్రామాల మీదుగా నీటిని తరలించాలని ప్రయత్నం చేయటం దారుణమన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు, పిసిసి కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, డోన్, నందికొట్కూరు నియోజకవర్గాల ఇన్‌చార్జులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, చెరుకు అశోక రత్నం, జడ్‌పి మాజీ చైర్మన్ ఆకేపోగు వెంకటస్వామి, బిసి సెల్ రాష్ట్ర నేత శివ కుమార్ పాల్గొన్నారు.