క్రీడాభూమి

ఒలింపిక్ పతకాలే కాదు హృదయాలనూ గెలుస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: రియో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాలతోపాటు అక్కడి ప్రజల హృదయాలనూ గెలుస్తారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ స్టేడియం నుంచి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వరకూ జరిగిన ‘రన్ ఫర్ రియో’ను ఆదివారం ఉదయం జెండా ఊపి ప్రారంభించిన మోదీ ఈ కార్యక్రమానికి హాజరైన వందలాది మంది విద్యార్థులు, యువతీయువకులను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఒలింపిక్స్‌కు భారత్ వందకుపైగా అథ్లెట్లను పంపుతున్నదని చెప్పారు. వీరంతా పోటీల్లో రాణిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. అంతేగాక, తమ వ్యక్తిత్వం, నడవడికతో ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత బృందం ఎక్కడికి వెళ్లినా, వారిలో మన దేశ వారసత్వ సంపదను ప్రపంచానికి చాటిచెప్తుందని ప్రధాని అన్నారు. ‘మీ వెంట 125 కోట్ల భారతీయులు ఉన్నారననే విషయాన్ని మీకు గుర్తుచేస్తున్నారు. దేశంలో 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగిరినప్పుడు, రియోలోనూ మన జెండా రెపరెపలాడుతుందని నమ్ముతున్నాను’ అన్నారు. 2020 ఒలింపిక్స్‌పై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి శ్రమించాలని, వచ్చే ఒలిపింక్స్‌కు కనీసం 200 మందితో కూడిన బృందాన్ని పంపే సామర్థ్యాన్ని సంతరించుకోవాలని కోరారు. ‘2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఈ క్షణం నుంచే సన్నాహాలు ఆరంభించాలి’ అన్నారు. దేశంలో ప్రతిభావంతులు చాలా మంది ఉన్నారని, వచ్చే నాలుగేళ్లలో వారికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్స్‌లో భారత్ పెద్దగా రాణించలేకపోతున్నదని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి, సమస్యలను అధిగమించేందుకు శ్రమించాలని అన్నారు. ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 119 మంది భారత క్రీడాకారులు ఆ అర్హతను పొందేందుకు ఎంతగానో శ్రమించారని మోదీ అన్నారు. రియోలో త్రివర్ణ పతాకం ఎగిరేందుకు వారంతా కడ వరకూ పోరాడతారని ధీమా వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌లో భారత్ పాల్గొనడం ఆరంభించి వంద సంవత్సరాలు దాటినప్పటికీ, మొట్టమొదటిసారిగా వందకుపైగా సభ్యులతో కూడిన బృందాన్ని పంపిందని మోదీ గుర్తుచేశారు. చాలా తక్కువ కాలంలో ఎన్నో మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందని, అయితే, 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి, వ్యూహాత్మకంగా సిద్ధమయ్యే అవకాశం యువతకు లభిస్తుందని మోదీ అన్నారు.
ముందుగానే పంపాం
గతంలో భారత బృందం ఒలింపిక్స్ ఆరంభానికి ఒకటిరెండు రోజుల ముందు అక్కడికి చేరుకునేదని ప్రధాని మోదీ చెప్పారు. చాలా తక్కువ సమయంలో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న నగరంలోని వాతావరణ పరిస్థితులకు అలవాటుపడాల్సి వచ్చేదని అన్నారు. అలాంటి స్థితిలో పతకాలు సాధించడం అనుకున్నంత సులభం కాదని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్రం ఈసారి బృందాన్ని ఒలింపిక్స్ ఆరంభానికి 15 రోజుల ముందే రియోకు పంపిందని అన్నారు. వారి కోసం ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించిందని గుర్తుచేశారు. అంతేగాక, ఒలింపిక్స్ జరిగే సమయంలో వారికి భారతీయ వంటకాలు అందుబాటులో ఉండేలా చూశామని మోదీ అన్నారు.
ఖర్చులకు వెనుకాడలేదు
భారత క్రీడాకారులు ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు కేంద్రం ఖర్చులకు వెనుకాడకుండా అన్ని విధాలా అండగా నిలిచిందని మోదీ తెలిపారు. ఇంతకు ముందు బృందంలోని అధికారులకు రోజుకు 100 డాలర్లు ఖర్చుల కింద లభిస్తే, అథ్లెట్లకు 50 డాలర్లు మాత్రమే ఇచ్చేవారని చెప్పారు. తమ ప్రభుత్వం అథ్లెట్లకు కూడా రోజుకు వంద డాలర్ల చొప్పున చెల్లిస్తున్నదని పేర్కొన్నారు. అంతేగాక, అథ్లెట్లకు వారు కోరిన చోట, వారు ఎంచుకున్న కోచ్‌లతో శిక్షణ ఇప్పించామని తెలిపారు. ఒక్కో క్రీడాకారుడిపై 30 లక్షల నుంచి కోటిన్నర రూపాయల వరకు వెచ్చించినట్టు మోదీ చెప్పారు. 15 నుంచి 20 కోట్ల రూపాయలుగా ఉన్న బడ్జెట్‌ను తమ ప్రభుత్వం 125 కోట్లకు పెంచిందని మోదీ హర్షధ్వానాల మధ్య చెప్పారు. రియోకు వెళ్లిన భారత బృందంలోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు అందించిన ఆయన, విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటాలని వారికి పిలుపునిచ్చారు. క్రీడలు ప్రతి ఒక్కరికీ అవసరమని అన్నారు. భారత్ త్వరలోనే బ్రిక్స్ ఫుట్‌బాల్‌ను, అండర్-17 సాకర్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహిస్తుందని మోదీ అన్నారు. త్వరలోనే ఎనిమిది కొత్త క్రీడా అకాడెమీలను ప్రారంభిస్తామని చెప్పారు. ‘రన్ ఫర్ రియో’ ఆరంభానికి ముందు ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలు చల్లి నివాళులర్పించిన మోదీ ఒక ప్రత్యేక బ్రోచర్‌ను కూడా విడుదల చేశారు.

chitram...