క్రీడాభూమి

పురుషుల స్ప్రింట్‌లో బోల్ట్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 15: ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ మరోసారి సత్తా చాటాడు. రియో ఒలింపిక్స్ పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో టైటిల్ సాధించాడు. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న అతను రియోలోనే విజయభేరి మోగించి ‘స్ప్రింట్ హ్యాట్రిక్’ను పూర్తి చేశాడు. ఆరో లేన్‌లో పరిగెత్తిన బోల్ట్ లక్ష్యాన్ని 9.81 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అతని చిరకాల ప్రత్యర్థి, అమెరికా స్ప్రింటర్ జస్టిన్ గాట్లిన్ ఎనిమిది సెకన్లు ఆలస్యంగా ఫినిషింగ్ లైన్‌పై కాలుపెట్టి, రజత పతకాన్ని స్వీకరించాడు. కెనడాకు చెందిన ఆండ్రె డి గ్రేసే 9.91 సెకన్ల సమయంతో కాంస్య పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. బోల్ట్ సహచరుడు, అతని ప్రాక్టీస్ పార్ట్‌నర్ యొహాన్ బ్లేక్ 9.94 సెకన్లతో నాలుగో స్థానానికి పరిమితయ్యాడు. లండన్ ఒలింపిక్స్‌లో బోల్ట్ నంబర్ వన్‌గా నిలవగా, బ్లేక్, గాట్లిన్ వరుసగా రెండు, మూడు స్థానాలను ఆక్రమించారు. ఈసారి గాట్లిన్ మెరుగైన ప్రదర్శనతో రజత పతకాన్ని దక్కించుకోగా, బ్లేక్ పతకాన్ని సాధించడంలో విఫలమయ్యాడు. కాగా, బీజింగ్, లండన్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌తోపాటు 200 మీటర్ల పరుగు, 4న100 మీటర్ల రిలే విభాగాల్లోనూ స్వర్ణాలను గెల్చుకున్న బోల్ట్ ముచ్చటగా మూడోసారి ‘ట్రిపుల్’ను సాధించడంపై దృష్టి పెట్టాడు. స్ప్రింట్‌లో తాను అనుకున్నంత వేగంగా పరిగెత్తలేకపోయానని, అయితే, పతకాన్ని దక్కించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని బోల్ట్ అన్నాడు. ‘లైట్నింగ్ బోల్ట్’గా ప్రసిద్ధి చెందిన ఫోజుతో రేస్ అనంతరం అతను అభిమానులకు కనువిందు చేశాడు. అనంతరం స్టాండ్స్ వద్దకు వెళ్లి పలువురితో కరచాలనం చేశాడు. కొంత మందికి ఆటోగ్రాఫులిచ్చాడు. స్టేడియం మొత్తం బోల్ట్ నామ జపంతో హోరెత్తిపోయింది. అనంతరం అతను మాట్లాడుతూ క్రీడా రంగంలో పీలే, మహమ్మద్ అలీ, మైఖేల్ జోర్డాన్ వంటి స్టార్ల సరసన స్థానం సంపాదించాలన్నదే తన కోరిక అని అన్నాడు.

చరిత్ర సృష్టిస్తా..
* రియో ఒలింపిక్స్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌ను సాధించిన తాను 200 మీటర్ల పరుగు, 4న100 మీటర్ల రిలే విభాగాల్లోనూ టైటిళ్లను గెల్చుకొని సరికొత్త చరిత్ర సృష్టిస్తానని బోల్ట్ అన్నాడు. తన పేరు ఒలింపిక్స్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని చాలా మంది అంటున్నారని, ఇక్కడ మరో రెండు స్వర్ణాలను గెలవడం ద్వారా దానిని నిజం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడు.

మొదటి అథ్లెట్
మూడు ఒలింపిక్స్‌లో స్ప్రింట్ టైటిల్‌ను గెల్చుకున్న మొదటి అథ్లెట్‌గా బోల్ట్ రికార్డు సృష్టించాడు. ఆధునిక ఒలింపిక్స్ ఆరంభమైన తర్వాత 120 సంవత్సరాల కాలంలో ఇటు పురుషుల విభాగంలోగానీ, అటు మహిళల విభాగంలోగానీ ఎవరూ ఈ ఫీట్‌ను ప్రదర్శించలేదు. 2008 నుంచి ఇప్పటి వరకూ అతను ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కలిపి మొత్తం 18 స్వర్ణ పతకాలను గెల్చుకోవడం విశేషం.

అసాధారణ ప్రతిభ
* మిగతా క్రీడలతో పోలిస్తే, పరుగు పందాల్లో పాల్గొనే అథ్లెట్ల కెరీర్ చాలా తక్కువ. అందులోనూ 100 మీటర్ల స్ప్రింట్‌లో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం ఉండదు. ప్రపంచ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి మెగా ఈవెంట్స్‌లో టైటిల్‌ను గెల్చుకోవడం అనేది జీవితకాల శ్రమకు దక్కే అరుదైన ఫలితం. స్ప్రింటర్ ఎవరైనా వరుసగా మూడు ఒలింపిక్స్‌లో పతకాలు గెల్చుకోవడాన్ని ఎవరూ ఊహించడానికి కూడా సాహసించరు. కానీ, అలాంటి అరుదైన అద్భుతాన్ని ఉసేన్ బోల్ట్ కళ్ల ముందు ఆవిష్కరించాడు. ‘లెజెండరీ అథ్లెట్’ అనే పేరును సార్థకం చేసుకున్నాడు. అతని అసాధారణ ప్రతిభకు ఈ విజయాలే తార్కాణం. అథ్లెటిక్స్‌లో ఎవరూ, ఎప్పుడూ సాధించలేని అరుదైన రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న బోల్ట్ యువ క్రీడాకారులకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తాడు. ఒలింపిక్స్‌కు వచ్చే ముందు జరిగిన జమైకా క్వాలిఫయర్స్ లో పోటీపడుతూ కండరాలు బెణకడంతో రేస్‌ను పూర్తి చేయలేకపోయన బోల్ట్, ఇంత త్వరగా కోలుకుంటాడని, అద్వితీయ ప్రతిభ కనబరుస్తాడని ఎవరూ ఊహించలేదు. రియోలో మరో రెండు విభాగాల్లోనూ పోటీపడనున్న అతను ‘ట్రిపుల్ ట్రిపుల్’ను సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

చిత్రాలు... పురుషుల 100 మీటర్ల పరుగు పూర్తయిన తర్వాత అతను తనదైన ‘లైట్నింగ్ బోల్ట్’ ఫోజులిస్తూ అభిమానులను ఆనందింప చేస్తున్న ‘జమైకా చిరుత’

పురుషుల 100 మీటర్ల స్ప్రింట్‌లో లక్ష్యం దిశగా దూసుకెళుతున్న ఉసేన్ బోల్ట్