క్రీడాభూమి

అశ్విన్ ‘ఆరె’శాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్పూర్, సెప్టెంబర్ 26: గ్రీన్ పార్క్ స్టేడియంలో తన 500వ టెస్టు మ్యాచ్‌ని ఆడిన భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్‌ను మొదటి టెస్టులో 197 పరుగుల భారీ తేడాతో చిత్తుచేయడం ద్వారా చారిత్రిక మ్యాచ్‌ని చిరస్మరణీయంగా మలచుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చిన స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి బెంబేలెత్తిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 87.3 ఓవర్లలో 236 పరుగులకే కుప్పకూలింది. చారిత్రక టెస్టులో, విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తున్న టీమిండియా కలకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది. స్వదేశంలో టీమిండియా ఒక్క ఓటమి కూడా ఎదుర్కోకుండా 12 టెస్టులను పూర్తిచేయగా, 10వ విజయాన్ని నమోదు చేసింది.
ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 318 పరుగులు చేసింది. మొదటి రెండు రోజులు ఆధిక్యాన్ని ప్రదర్శించిన న్యూజిలాండ్ ఆతర్వాత డీలా పడింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 262 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరును నమోదు చేసింది. ఐదు ఇవకెట్లకు 377 పరుగుల స్కోరువద్ద కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి, న్యూజిలాండ్ ముందు 434 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచాడు. అసాధ్యంగా కనిపిస్తున్న ఈ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం కంటే, వికెట్లు కూలకుండా జాగ్రత్త పడుతూ మ్యాచ్‌ని డ్రా చేసుకోవడమే ఉత్తమమన్న ధోరణి కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో కనిపించింది. కానీ, అతి జాగ్రత్తకు పోయిన బ్యాట్స్‌మెన్ వికెట్లు సమర్పించుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 93 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజైన సోమవారం ఆటను కొనసాగించింది. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన మిచెల్ సాంట్నర్ జట్టును ఆదుకోవడానికి సర్వశక్తులు ఒడ్డాడు. ల్యూక్ రోన్చీతో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించడమేగాక, సాధ్యమైనంత వరకూ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అయితే, జట్టు స్కోరు 158 పరుగుల వద్ద రోన్చీ వికెట్ కూలింది. అతను 120 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 80 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అశ్విన్ చక్కటి క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. వికెట్ కీపర్ బ్రాడ్లీ వాల్టింగ్ 18 పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. వీపు కండరాల నొప్పితో బాధపడుతున్న మార్క్ క్రెగ్ బలవతంగా బ్యాటింగ్‌కు దిగాడు. కానీ అతను రెండు బంతులు ఎదుర్కొని, ఒక పరుగు చేసి, మహమ్మద్ షమీ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్‌లో నిలబడి, న్యూజిలాండ్‌కు డ్రాపై ఆశలు రేపిన సాంట్నర్ పోరాటం 223 పరుగుల వద్ద ముగిసింది. అతను 179 బంతుల్లో 71 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అతని స్కోరులో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. చివరిలో ఇష్ సోధీ (17)తో కలిసి ట్రెంట్ బౌల్ట్ కొంత సేపు భారత బౌలర్లకు పరీక్ష పెట్టాడు. అయితే, 38 బంతుల్లో 17 పరుగులు చేసిన సోధీని అశ్విన్ బౌల్డ్ చేయడంతో కివీస్ తొమ్మిదో వికెట్‌ను 236 పరుగుల వద్ద చేజార్చుకుంది. స్కోరుకు మరో పరుగు కూడా జత కలవకుండానే నీల్ వాగ్నర్ (0)ను అశ్విన్ ఎల్‌బిగా అవుట్ చేశాడు. ఫలితంగా అదే స్కోరువద్ద న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి బౌల్ట్ (30 బంతుల్లో 2 పరుగులు) నాటౌట్‌గా ఉన్నాడు.
మొదటి ఇన్నింగ్స్‌లో 42, రెండో ఇన్నింగ్స్‌లో 50 చొప్పున పరుగులు చేసి, రెండు పర్యాయాలు కూడా నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అతను మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులకు ఐదు, రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులకు ఒకటి చొప్పున వికెట్లు కూడా పడగొట్టాడు.

స్కోరుబోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 97 ఓవర్లలో 318 ఆలౌట్ (లోకేష్ రాహుల్ 32, మురళీ విజయ్ 65, చటేశ్వర్ పుజారా 62, రోహిత్ శర్మ 35, రవిచంద్రన్ అశ్విన్ 40, రవీంద్ర జడేజా 42 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 3/67, నీల్ వాగ్నర్ 2/42, మిచెల్ సాంట్నర్ 3/94).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 95.5 ఓవర్లలో 262 ఆలౌట్ (టామ్ లాథమ్ 58, కేన్ విలియమ్‌సన్ 75, రవీంద్ర జడేజా 5/73. అశ్విన్ 4/93.
భారత్ రెండో ఇన్నింగ్స్: 107.2 ఓవర్లలో 5 వికెట్లకు 377 డిక్లేర్డ్ (లోకేష్ రాహుల్ 38, మురళీ విజయ్ 76, చటేశ్వర్ పుజారా 78, ఆజింక్య రహానే 40, రోహిత్ శర్మ 68 నాటౌట్, రవీంద్ర జడేజా 50 నాటౌట్).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 434/ ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 93): టామ్ లాథమ్ ఎల్‌బి అశ్విన్ 2, మార్టిన్ గుప్టిల్ సి మురళీ విజయ్ బి అశ్విన్ 0, కేన్ విలియమ్‌సన్ ఎల్‌బి అశ్విన్ 25, రాస్ టేలర్ రనౌట్ 17, ల్యూక్ రోన్చీ సి అశ్విన్ బి జడేజా 80, మిచెల్ సాంట్నర్ సి రోహిత్ శర్మ బి అశ్విన్ 71, బ్రాడ్లీ వాల్టింగ్ ఎల్‌బి మహమ్మద్ షమీ 18, మార్క్ క్రెగ్ బి మహమ్మద్ షమీ 1, ఇష్ సోధీ బి అశ్విన్ 17, ట్రెంట్ బౌల్ట్ నాటౌట్ 2, నీల్ వాగ్నర్ ఎల్‌బి అశ్విన్ 9, ఎక్‌స్ట్రాలు 3, మొత్తం 87.3 ఓవర్లలో 236 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-2, 2-3, 3-43, 4-56, 5-158, 6-194, 7-196, 8-223, 9-236, 10-236.
బౌలింగ్: మహమ్మద్ షమీ 8-2-18-2, రవిచంద్రన్ అశ్విన్ 35.3-5-132-6, రవీంద్ర జడేజా 34-17-58-1, ఉమేష్ యాదవ్ 8-1-23-0, మురళీ విజయ్ 2-0-3-0.

* ఒక టెస్టులో పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం అశ్విన్‌కు ఇది ఐదోసారి. భారత్ తరఫున అనిల్ కుంబ్లే 132 టెస్టుల్లో 10 పర్యాయాలు ఈ ఫీట్ సాధించాడు. అశ్విన్ కేవలం 37 టెస్టుల్లోనే ఐదు సార్లు పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కూల్చడం విశేషం. 103 టెస్టులు ఆడిన హర్భజన్ సింగ్ కూడా ఐదు పర్యాయాలు ఈ ఘనతను సాధించాడు. కాగా, అశ్విన్ కంటే తక్కువ మ్యాచ్‌ల్లో ఐదు పర్యాయాలు పది లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్లలో జార్జి లోమన్ (16 టెస్టులు), సిడ్నీ బర్న్స్ (24 టెస్టులు) ఉన్నారు. మన దేశం తరఫున అశ్విన్ చాలా తక్కువ టెస్టుల్లోనే ఈ మైలురాయిని చేరాడు. ఐదుసార్లు ‘టెన్ వికెట్స్ హౌల్’ను నమోదు చేయడానికి హర్భజన్ సింగ్‌కు 68, అనిల్ కుంబ్లేకు 81 టెస్టులు అవసరమయ్యాయి. కాగా. అశ్విన్ స్వదేశంలో ఎక్కువ వికెట్లు సాధిస్తూ, ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
* పరుగుల ప్రాతిపదికగా న్యూజిలాండ్‌పై టీమిండియా సాధించిన భారీ విజయాల్లో ఇది మూడోది. 1967-68 సిరీస్‌లో భాగంగా అక్లాండ్ టెస్టును టీమిండియా 272 పరుగుల తేడాతో గెల్చుకుంది. 1976-77 సీజన్‌లో చెన్నై టెస్టును 216 పరుగుల ఆధిక్యంతో సొంతం చేసుకుంది. తాజాగా 197 పరుగుల తేడాతో తన ఖాతాలో వేసుకుంది.
* కోల్‌కతాలోని ఈడెన్ గారెన్డ్స్ మైదానంలో 2012 డిసెంబర్‌లో జరిగిన టెస్టులో భారత్ ఇంగ్లాండ్‌ను ఓడించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మొత్తం 12 టెస్టులు ఆడింది. ఒక్క మ్యాచ్‌ని కూడా కోల్పోకుండా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పది విజయాలను సాధించింది. రెండు మ్యాచ్‌లను డ్రా చేసుకుంది. పరాజయం లేని ఎక్కువ వరుస టెస్టులు ఆడడం భారత్‌కు ఇది మూడోసారి. 1977-1980 మధ్యకాలంలో 20 టెస్టులు, 1960-1964 మధ్యలో 16 చొప్పున స్వదేశంలో ఓటమి లేకుండా టెస్టులు ఆడింది.
* భారత్ మాదిరిగానే ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు కూడా తమతమ 500వ టెస్టు మ్యాచ్‌లను గెల్చుకున్నాయి. ఇంగ్లాండ్ మాత్రం ఆ చారిత్రక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది.

చిత్రం.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన రవిచంద్రన్ అశ్విన్