క్రీడాభూమి

‘పాపి’స్థాన్‌పై ముప్పేట దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/లుధియానా/లాహోర్, అక్టోబర్ 1: జమ్మూ-కాశ్మీరులోని ఉరీలో ఉగ్రవాద దాడులను ప్రోత్సహించి 19 మంది భారత జవాన్ల ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్‌పై భారత క్రీడా సంఘాలు ముప్పేట దాడిని ప్రారంభించాయి. ఈ దాడి నేపథ్యంలో దాయాది దేశంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న దౌత్య చర్యలకు సంఘీభావాన్ని తెలియజేస్తూ ఈ నెల 18వ తేదీ నుంచి పాకిస్తాన్‌లో జరుగనున్న అంతర్జాతీయ బాడ్మింటన్ సిరీస్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్టు భారత బాడ్మింటన్ సంఘం (బిఎఐ) డాక్టర్ అఖిలేష్ దాస్ గుప్తా శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించాడు. ఉరీలో ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించడంతో ఇకముందు అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లలో భారత్, పాక్ జట్లను ఒకే గ్రూపులో చేర్చవద్దని బిసిసిఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి)కు విజ్ఞప్తి చేశాడు.
ఇదిలావుంటే, వచ్చే నెల 3వ తేదీ నుంచి పంజాబ్‌లో జరుగనున్న ప్రపంచ కప్ కబడ్డీ టోర్నమెంట్‌కు పాకిస్తాన్‌ను ఆహ్వానించరాదని నిర్వాహకులు నిర్ణయించారు. గతంలో పాక్ జట్టు ఆరుసార్లు ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచినప్పటికీ ప్రస్తుతం భారత్‌లో ఆ జట్టు భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ టోర్నీ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు, పంజాబ్ క్యాబినెట్ మంత్రి సికందర్ సింగ్ మలూకా తెలిపాడు. ‘ఉరీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడి, ఆ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు జరిపిన మెరుపు దాడులతో ఉత్పన్నమైన పరిస్థితులు ప్రపంచ కప్ కబడ్డీ టోర్నమెంట్‌కు పాకిస్తాన్ జట్టును ఆహ్వానించేందుకు ఏమాత్రం అనువుగా లేవు’ అని సికందర్ సింగ్ మలూకా స్పష్టం చేశాడు.
బిసిసిఐ చీఫ్ ప్రకటనపై నోరు మెదపని పిసిబి
కాగా, అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లలో భారత్, పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూపులో చేర్చవద్దని కోరుతూ ఐసిసికి లేఖ రాస్తానని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు, బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ చెప్పినట్లు వస్తున్న వార్తల గురించి అధికారికంగా స్పందించేందుకు పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) నిరాకరించింది. ఈ విషయమై ఐసిసికి బిసిసిఐ ఇప్పటివరకూ అధికారికంగా ఎటువంటి లేఖ రాయనందున ఇటువంటి వార్తల గురించి స్పందించడం నిరుపయోగమని పిసిబికి చెందిన సీనియర్ అధికారి ఒకరు పిటిఐ వార్తా సంస్థతో అన్నాడు. ‘కొద్ది రోజుల నుంచి బిసిసిఐ నాయకులు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అయితే దీని గురించి ప్రస్తుతం వ్యాఖ్యలు చేయడం అనవసరమని మేము భావిస్తున్నాం’ అని ఆ అధికారి చెప్పాడు. ఐసిసి ఈవెంట్లలో ఇకముందు భారత్, పాక్ జట్లను ఒకే గ్రూపులో చేర్చవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌కు లేఖ రాస్తానని అనురాగ్ ఠాకూర్ శుక్రవారం వెల్లడించాడు. భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాల ప్రసక్తే ఉండదని ఆయన స్పష్టం చేశాడు. అయితే అనురాగ్ ఠాకూర్ రాజకీయ నాయకుడు అయినందున ఆయన వ్యాఖ్యలను తాము సీరియస్‌గా తీసుకోలేదని పిసిబి వర్గాలు పేర్కొన్నాయి.