క్రీడాభూమి

దారికొస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) దారిలోకి వస్తుందా? లేక ముందుగానే హెచ్చరించిన విధంగానే సుప్రీం కోర్టు కఠిన నిర్ణయాలను తీసుకొని దారికి తీసుకురావాల్సి ఉంటుందా? ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని వేధిస్తున్న ప్రశ్నలివి. లోధా కమిటీ నివేదికలోని మొదటి విడత సిఫార్సుల అమలుకు సుప్రీం కోర్టు విధించిన గడువు గురువారంతో పూర్తవుతుంది. సిఫార్సులోని కొన్ని అంశాలు ఆచరణకు సాధ్యం కాదని ఇది వరకే పలుమార్లు వాదించిన బిసిసిఐ ఈసారి ఎలాంటి వాదనతో ముందుకొస్తుందనేది ఆసక్తిని రేపుతున్నది. లోధా సిఫార్సులను పట్టించుకోకుండా గత నెల ప్రత్యేక వార్షిక సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించి, పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడమే తాజా ఘర్షణకు కారణమైంది. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన నేరానికి రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు బౌలర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీలాలను ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేయడంతో మొదలైన వివాదం పలు కేసులు సుప్రీం కోర్టుకు చేరడంతో తీవ్ర రూపం దాల్చింది. ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని కమిటీ రెండు దఫాలుగా విచారణ జరిపి, సమర్పించిన నివేదికల ఆధారంగా శిక్షలను ఖరారు చేయడానికి లోధా కమిటీని సుప్రీం కోర్టు నియమించింది. బిసిసిఐ పాలనా వ్యవహారాలను పారదర్శకంగా నిర్వహించేందుకు లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించింది. అన్ని సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని బిసిసిఐని ఆదేశించింది. దీనితో దిక్కుతోచని బోర్డు అధికారులు ఏదో ఒక రకంగా గండం నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. ఈనెల ఆరో తేదీలోగా మార్పుల ప్రక్రియ ఆరంభం కావాలని లోధా కమిటీ ఆదేశించడంతో ఏం చేయాలో అర్ధంగాని బోర్డు గత నెల ఎస్‌జిఎంను నిర్వహించింది. అయితే, లోధా సిఫార్సులను అమలు చేసేందుకు అవసరమైన తీర్మానాలను ఆమోదించకుండా, పూర్తి విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంది. కమిటీ సూచనలకు భిన్నంగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంది. జాతీయ సెలక్షన్ కమిటీలో ముగ్గురు సభ్యులు బోర్డు నుంచి, మరో ఇద్దరు సభ్యులు మాజీ క్రికెటర్ల రూపంలో ఉండాలని లోధా కమిటీ సూచించగా, దానిని తుంగలో తొక్కిన బిసిసిఐ ఐదుగురు సభ్యులతో కమిటీని ఎంపిక చేసింది. ఎంజిఎంను నిర్వహించడం, అందులో వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం లోధా కమిటీ ఆగ్రహానికి కారణమయ్యాయి. ధిక్కార స్వరం వినిపిస్తున్న బోర్డు దూకుడుకు కళ్లెం వేయాలన్న ఆలోచనతో ఈ మొత్తం వ్యవహారాన్నీ ‘స్టేటస్ రిపోర్ట్’ రూపంలో ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ముందు ఉంచింది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ సిఫార్సులనే బేఖాతరు చేయడం కోర్టు ధిక్కారం కిందకి వస్తుందన్న భయం కూడా లేకుండా వ్యవహరిస్తున్న బోర్డు పాలక మండలిని రద్దు చేయాలని సూచించింది. స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన సుప్రీం కోర్టు ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. బిసిసిఐ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా దారిలోకి రావాలని హితవు పలికింది. మొండి వైఖరిని కొనసాగిస్తే, దారిలోకి తెచ్చుకుంటామని ఇబ్రహీం ఖలీఫుల్లా కూడా సభ్యుడిగా ఉన్న సుప్రీం కోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఇది వరకు అనేక సందర్భాల్లో బోర్డు వాదనను కొట్టిపారేసిన సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లోధా సిఫార్సులను అమలు చేసి తీరాల్సిందేనని తేల్చిచెప్పింది. ఇప్పుడు బిసిసిఐ కొత్తగా చెప్పాల్సిందిగానీ, కోర్టు కొత్తగా వినాల్సిందిగానీ ఏమీ లేదు. అయితే, సిఫార్సుల అమలుపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి కారణాలను గురువారం కోర్టుకు వివరించాల్సి ఉంటుంది. సమస్యలను ఏ కొత్త కోణంలో కోర్టు ముందు ఉంచుతుందనేది ఉత్కంఠ రేపుతున్నది. సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేసి తీరాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే బోర్డు తలవంచక తప్పదు.