క్రీడాభూమి

ధిక్కారం సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడానికి నిరాకరించడం ద్వారా కోర్టుతోనే ఢీకొనే సాహసం చేసిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కు చుక్కెదురైంది. భారత క్రికెట్‌లో పారదర్శకత కోసం లోధా కమిటీ చేసిన సిఫార్సులను తు.చ తప్పకుండా అమలు చేసి తీరాలని బిసిసిఐకి ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. కోర్టు ధిక్కారాన్ని సహించేది లేదని తెలిపింది. ‘లోధా సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేయడం మంచిది కాదు. మా సమయాన్ని వృథా చేయకండి. శుక్రవారంలోగా సిఫార్సుల అమలుపై నిర్ణయాన్ని తీసుకొని, తీర్మాన పత్రాన్ని సమర్పించాలి. లేకపోతే, ఈ దిశగా ఆదేశాలు జారీ చేస్తాం’ అని ధర్మాసనం ఆగ్రహ స్వరంతో బిసిసిఐని హెచ్చరించింది. హడావుడిగా కోట్లాది రూపాయలు సభ్య సంఘాలకు చెల్లించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. శనివారం నుంచి 17వ తేదీ వరకు దసరా సెలవలు ఉన్నందున, శుక్రవారంలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించడం గమనార్హం.
దిక్కుతోచని పరిస్థితి
లోధా చేసిన సిఫార్సులను అమలు విషయంలో బిసిసిఐ పెద్దలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండు పర్యాయాలు, మొత్తం మీద మూడసార్ల కంటే ఎక్కువ కాలం పాలక మండలి సభ్యులుగా ఉండరాదని లోధా కమిటీ చేసిన సిఫార్సుల్లో ఒకటి. రెండు సార్లు గవర్నింగ్ బాడీలో ఉన్న వారు ఒక విడత విశ్రాంతి తీసుకొని, ఆ తర్వాత మళ్లీ మరోసారి పోటీ చేయవచ్చు. ఈ విధానాన్ని అమలు చేస్తే, బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే వంటి బిసిసిఐ ఉన్నతాధికారులు తమతమ పదవులకు రాజీనామా చేయక తప్పదు. అంతేగాక, లోధా సిఫార్సులను అమలు చేస్తే, భారత క్రికెట్‌పై తమ ఆధిపత్యానికి గండిపడుతుందనే విషయం బోర్డు పెద్దలకు అర్థమైంది. ఈ వాస్తవాలను జీర్ణించుకోలేపోతున్న బిసిసిఐ అమీతుమీ తేల్చుకోవడానికి, ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా సుప్రీం కోర్టుతోనే తలపడే సాహసం చేసింది. ఎన్నిసార్లు డెడ్‌లైన్లు పెట్టినా పట్టించుకోకుండా సిఫార్సుల అమలును వాయిదా వేస్తూ వచ్చింది. కానీ గురువారం సుప్రీం కోర్టు స్పందించిన తీరు బోర్డు అధికారుల వెన్నులో చలి పుట్టిస్తున్నది.
స్వయంకృతం
సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురికావడానికి బిసిసిఐ స్వయంకృతమే ప్రధాన కారణం. ఈఏడాది జూలై 18 నుంచి లోధా కమిటీ సిఫార్సుల అమలుపై ఒక నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తూ వచ్చింది. గత నెల 30వ తేదీలోగా సిఫార్సులను అమలు చేసిన తీరాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ పట్టించుకోలేదు. అంతేగాక, కోర్టు నియమించిన లోధా కమిటీపై తన చేష్టల ద్వారా యుద్ధాన్ని ప్రకటించింది. ఏకపక్షంగా బోర్డు తీరుకున్న పలు నిర్ణయాలు లోధా కమిటీని ఆగ్రహానికి గురి చేశాయి. వివిధ సభ్య సంఘాలకు భారీ మొత్తంలో నిధులు ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయాన్ని లోధా కమిటీ తప్పుపట్టింది. అందుకే, సాధారణ పాలనకు అవసరమైన మొత్తాలను తప్ప, మిగతా అన్ని రకాల చెల్లింపులను నిలిపివేయాలని బిసిసిఐ ఖాతాలు ఉన్న బ్యాంకులకు లేఖ రాసింది. దీనిపై బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ డబ్బు లేకపోతే మ్యాచ్‌లు నిర్వహించడం కష్టమని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌ను కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ బెదిరింపులకు దిగాడు. గత నెల 21న ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)ను నిర్వహించడం నుంచి సభ్య సంఘాలకు భారీ మొత్తాల్లో నిధులను మళ్లించాలన్న నిర్ణయం వరకూ అడుగడుగునా లోధా కమిటీ సూచనలకు బోర్డు గండికొట్టింది. ఈ ధిక్కార స్వరాన్ని జీర్ణించుకోలేకపోయిన లోధా కమిటీ సుప్రీం కోర్టులో స్టేటస్ రిపోర్ట్‌ను దాఖలు చేయడంతో కంగుతిన్నది. కమిటీ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించని బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వజ్రాయుధాన్ని బయటకు తీశాడు. డబ్బు లేకపోతే క్రికెట్ సిరీస్‌లను నిర్వహించడం సాధ్యం కాదన్నాడు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు జరగకపోతే, క్రికెట్‌ను ఒక మతంలా ఆరాధించే భారత వీరాభిమానులు తీవ్రంగా స్పందిస్తారని, లోధా కమిటీ నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో నిరసన వెల్లువెత్తుతుందని ఠాకూర్ వ్యూహాత్మకంగా ప్రకటన చేసి ఉంటాడన్న వాదన వినిపిస్తున్నది. అయితే, బిసిసిఐ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేయలేదని, కేవలం సభ్య సంఘాలకు క్రికెట్ అభివృద్ధి పేరిట ఇవ్వాలనుకున్న భారీ మొత్తాలను మాత్రమే నిలిపివేయాల్సిందిగా బ్యాంకులకు సూచించామని లోధా కమిటీ వివరణ ఇవ్వడంతో ఠాకూర్ హెచ్చరికలకు విలువలేకుండా పోయింది. రెండు భారీ చెల్లింపులను మాత్రమే నిలిపివేయాలని బ్యాంకులను కోరామని, మిగతా ఆర్థిక లావాదేవీలు సజావుగా జరుగుతాయని లోధా కమిటీ వివరించింది. చేతిలో డబ్బు లేకపోతే సిరీస్‌లను ఏ విధంగా నిర్వహించాలన్న ఠాకూర్ వాదనలో పస లేదని తేల్చిచెప్పింది. బిసిసిఐకి ఇది ఎదురుదెబ్బగానే చెప్పాలి.
భారీ మొత్తాలు ఎందుకు?
సభ్య సంఘాలకు 400 కోట్ల రూపాయల భారీ మొత్తాలను చెల్లించడానికి ఎందుకు అంత హడావుడి పడుతున్నారని బిసిసిఐని సుప్రీం కోర్టు నిలదీసింది. క్రికెట్ అభివృద్ధికి చేసిన కేటాయింపులను రాత్రికి రాత్రే చెల్లించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. డబ్బు వెదజల్లి, సభ్య సంఘాల నుంచి లోధా కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా వాటిని కూడగట్టుకోవడానికి చేస్తున్న బోర్డు ప్రయత్నం చేస్తున్నదని వ్యాఖ్యానించింది. సభ్య సంఘాలను మంచి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే హడావుడిగా భారీ మొత్తాలను ఇవ్వడానికి బోర్డు ఉపక్రమించిందని స్పష్టం చేసింది.
తప్పించుకుంటుందా?
* లోధా సిఫార్సులకు ఆమోద ముద్ర వేయడానికి శుక్రవారం వరకే గడువు ఉంది. ఈ పరిస్థితుల్లో మరికొంత కాలం వాయిదా వేయడం బోర్డుకు సాధ్యం కాదనే చెప్పాలి. సిఫార్సుల్లోని పలు అంశాలపై బిసిసిఐ లేవనెత్తిన అభ్యంతరాలను సుప్రీం కోర్టు పట్టించుకోలేదు. ‘దారికి రాకపోతే.. దారికి తెస్తాం’ అని సుప్రీం కోర్టు హెచ్చరిక జారీ చేసిందనంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. గురువారం కూడా జస్టిస్ టిఎస్ ఠాకూర్ అదే స్థాయిలో మరోసారి హెచ్చరించారు. బోర్డు స్పందించకపోతే, తమ నిర్ణయాలను ఆదేశాల రూపంలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు. కాసుల పంట పండించే భారత క్రికెట్‌పై పట్టును ఎలాంటి పరిస్థితుల్లోనూ కోల్పోకూడదన్న తాపత్రయమే తప్ప, పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది బోర్డు ఆలోచించడం లేదన్నది ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన సుప్రీం కోర్టు ఈసారి కేవలం 24 గంటల డెడ్‌లైన్‌ను విధించడంతో లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయడం మినహా బోర్డుకు మరో దారి లేదన్నది నిజం.
కోర్టు చేతిలో
ఆయుధాలు!
* లోధా కమిటీ సిఫార్సుల అమలుకు కేవలం 24 గంటల గడువుపెట్టిన సుప్రీం కోర్టు అప్పటికీ బిసిసిఐ దారికి రాకపోతే ఏం చేస్తుందనేది ఉత్కంఠ రేపుతున్నది. తమిళనాడు వ్యాపారేతర సంస్థల చట్టం కింద నమోదైనందున సుప్రీం కోర్టు పరిధిలోకి బిసిసిఐ రాదని కొందరి వాదన. అయితే, బిసిసిఐ ప్రస్తుత కమిటీని రద్దు చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంది. ఆ స్థానంలో ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి, లోధా కమిటీ సిఫార్సుల అమలును దానికి అప్పగించవచ్చు. లేదా డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించడం ద్వారా సిఫార్సుల అమలుకు మార్గాన్ని సుగమం చేయవచ్చు. ఈ రెండు ఆయుధాల్లో ఏదో ఒకదానిని సుప్రీం కోర్టు వినియోగించే అవకాశాలున్నాయని నిపుణుల అభిప్రాయం.

బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కే పదవులు ప్రమాదంలో పడ్డాయ. లోధా కమిటీ చేసిన సిఫార్సులను ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా అమలు చేస్తే, వీరిద్దరే ముందుగా రాజీనామా చేయాల్సి వస్తుంది. సిఫార్సుల అమలును తప్పించుకోవడానికి బిసిసిఐ చేసిన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. వాటిని అమలు చేస్తున్నట్టు తీర్మానాన్ని 24 గంటల్లోగా ఆమోదించాలని బిసిసిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనితో చాలాకాలంగా దాగుడుమూతలు ఆడుతూ వస్తున్న బిసిసిఐ దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో బోర్డు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిని రేపుతున్నది. ఏ క్షణంలోనైనా బోర్డు ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది.