క్రీడాభూమి

అశ్విన్ స్పిన్ మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెస్టు క్రికెట్ కెరీర్‌లో తక్కువ మ్యాచ్‌ల్లోనే 20 పర్యాయాలు ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడో స్థానాన్ని ఆక్రమించాడు. తన 39వ టెస్టు ఆడుతున్న అతను న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. ఒక ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు వికెట్లు సాధించడం అశ్విన్‌కు ఇది 20వ సారి. సిడ్నీ బర్నెస్ (ఇంగ్లాండ్) 25, క్లారీ గ్రిమ్మెట్ (ఆస్ట్రేలియా) 37 టెస్టుల్లో 20 లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైవ్ వికెట్స్ హౌల్ నమోదు చేశారు. వీరి తర్వాతి స్థానం అశ్విన్‌కు దక్కింది.
న్యూజిలాండ్‌పై అశ్విన్ ఈ విధంగా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడం ఇది ఐదోసారి. బిషన్ సింగ్ బేడీ, సుభాష్ గుప్తే, ఎర్రాపల్లి ప్రసన్న, జహీర్ ఖాన్ కివీస్‌పై తలా నాలుగు పర్యాయాలు ఈ ఫీట్‌ను ప్రదర్శించారు.

ఇండోర్, అక్టోబర్ 10: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి, మూడో టెస్టుపై విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా పట్టు బిగించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 299 పరుగులకే ఆలౌట్ చేసి, 258 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలం కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను చిత్తుచేసింది. అతను 81 పరుగులిచ్చి ఆరు వికెట్లు కూల్చాడు. అంతేగాక, కివీస్ టాప్ స్కోరర్ మార్టిన్ గుప్టిల్ రనౌట్‌లో కీలక పాత్ర పోషించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 5 వికెట్లకు 557 పరుగుల భారీ స్కోరువద్ద డిక్లేర్ చేయగా, ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 28 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఆటను కొనసాగించి 118 పరుగుల స్కోరువద్ద మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. 104 బంతులు ఎదుర్కొని 53 పరుగులు సాధించిన టామ్ లాథమ్‌ను అశ్విన్ రిటర్న్ క్యాచ్ అందుకొని పెవిలియన్‌కు పంపాడు. మొదటి వికెట్ పడిన తర్వాత జాగ్రత్తగా ఆడాల్సిన బాధ్యతను స్వీకరించాల్సిన కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 25 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసిన అతనిని అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చాలాకాలంగా ఫామ్ కోసం అల్లాడుతున్న మాజీ కెప్టెన్ రాస్ టేలర్ మరోసారి విఫలమయ్యాడు. అతను నాలుగు బంతుల్లో పరుగుల ఖాతాను తెరవకుండానే అశ్విన్ బౌలింగ్‌లో ఆజింక్య రహానే క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 140 పరుగుల వద్ద న్యూజిలాండ్ మూడో వికెట్‌ను కోల్పోయింది. మరో ఎనిమిది పరుగుల తర్వాత మార్టిన్ గుప్టిల్ సైతం అవుటయ్యాడు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 144 బంతులు ఆడిన అతను 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 72 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. జట్టు స్కోరుకు మరో పరుగు కూడా చేరకుండానే హార్డ్ హిట్టర్ ల్యూక్ రోన్చీ వికెట్ కూలింది. ఆరు బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన అతను అశ్విన్ బౌలింగ్‌లో రహానే క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. వికెట్లు ఒకదాని తర్వాత మరొకటిగా కూలుతున్న తరుణంలో జట్టును ఆదుకోవడానికి జిమీ నీషమ్ శతవిధాల ప్రయత్నించాడు. వికెట్‌కీపర్ బ్రాడ్లే వాల్టింగ్ (48 బంతుల్లో 23 పరుగులు), మిచెల్ సాంట్నర్ (52 బంతుల్లో 22 పరుగులు)తో కలిసి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 115 బంతుల్లో, 11 ఫోర్ల సాయంతో 71 పరుగులు సాధించిన అతను అశ్విన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుట్‌కావడంతో కివీస్ పోరాటానికి దాదాపు తెరపడింది. జీతన్ పటేల్ 18 పరుగులు చేసి రనౌటయ్యాడు. గుప్టిల్ మాదిరిగానే అతను కూడా అశ్విన్ కారణంగా పెవిలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్‌లోనే పుజారా క్యాచ్ పట్టగా ట్రెంట్ బౌల్ట్ (0) అవుట్‌కావడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికి మాట్ హెన్రీ 15 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో అశ్విన్‌కు ఆరు, జడేజాకు రెండు వికెట్లు లభించాయి.
ఫాలోఆన్ ఇవ్వని కోహ్లీ
తొలి ఇన్నింగ్స్‌లో రెండు వందల కంటే ఎక్కువ ఆధిక్యాన్ని సంపాదించిన టీమిండియాకు ప్రత్యర్థిని ఫాలోఆన్‌కు దింపే అవకాశం ఉండింది. కానీ, కెప్టెన్ కోహ్లీ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పటికే బౌలర్లు బాగా అలసిపోయినందున, విరామం లేకుండా మళ్లీ బౌలింగ్ చేయడం అసాధ్యమనుకున్న కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించాడు. మురళీ విజయ్‌తో కలిసి ఓపెనర్‌గా దిగిన గౌతం గంభీర్ భుజం గాయం తిరగబెట్టడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. దీనితో పుజారా క్రీజ్‌లోకి వచ్చాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టం లేకుండా 18 పరుగులు చేసింది. మురళీ విజయ్ పదకొండు, పుజారా ఒక పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కూడా కలుపుకొని టీమిండియా 276 పరుగుల ముందంజలో ఉంది. పది వికెట్లు చేతిలో ఉన్నాయి.

స్కోరుబోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 169 ఓవర్లలో 5 వికెట్లకు 557 డిక్లేర్డ్ (చటేశ్వర్ పుజారా 41, విరాట్ కోహ్లీ 211, ఆజింక్య రహానే 188, రోహిత్ శర్మ 51 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ 2/113, జీతన్ పటేల్ 2/120).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 28): మార్టిన్ గుప్టిల్ రనౌట్ 72, టామ్ లాథమ్ సి అండ్ బి అశ్విన్ 53, కేన్ విలియమ్‌సన్ బి అశ్విన్ 8, రాస్ టేలర్ సి రహానే బి అశ్విన్ 0, ల్యూక్ రోన్చీ సి రహానే బి అశ్విన్ 0, జిమీ నీషమ్ ఎల్‌బి అశ్విన్ 71, బ్రాడ్లే వాల్టింగ్ సి రహానే బి రవీంద్ర జడేజా 23, మిచెల్ సాంట్నర్ సి కోహ్లీ బి రవీంద్ర జడేజా 22, జీతన్ పటేల్ రనౌట్ 18, మాట్ హెన్రీ 15 నాటౌట్, ట్రెంట్ బౌల్ట్ సి చటేశ్వర్ పుజారా బి అశ్విన్ 0, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (90.2 ఓవర్లలో ఆలౌట్) 299.
వికెట్ల పతనం: 1-118, 2-134, 3-140, 4-148, 5-148, 6-201, 7-253, 8-276, 9-294, 10-299.
బౌలింగ్: మహమ్మద్ షమీ 13-1-40-0, ఉమేష్ యాదవ్ 15-1-55-0, అశ్విన్ 27.2-5-81-6, రవీంద్ర జడేజా 28-5-80-2, మురళీ విజయ్ 7-0-27-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: మురళీ విజయ్ 11 నాటౌట్, గౌతం గంభీర్ రిటైర్డ్ హర్ట్ 6, చటేశ్వర్ పుజారా 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 0, మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 18.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 3-0-9-0, జీతన్ పటేల్ 2-0-8-0, మిచెల్ సాంట్నర్ 1-0-1-0.