క్రీడాభూమి

స్పిన్ అస్త్రంతో పాకిస్తాన్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, అక్టోబర్ 12: స్పిన్ బౌలింగ్‌ను ప్రధాన అస్త్రంగా మార్చుకున్న పాకిస్తాన్ గురువారం నుంచి వెస్టిండీస్‌తో ఇక్కడ ఆరంభం కానున్న మొదటి డే/నైట్ టెస్టుకు సిద్ధమైంది. దుబాయ్ వేదికగా హోం సిరీస్‌లు ఆడుతున్న పాకిస్తాన్ ఇప్పటికే వెస్టిండీస్‌ను టి-20, వనే్డ సిరీస్‌ల్లో చిత్తచేసింది. టి-20ల్లో మొదటి మ్యాచ్‌ని 9 వికెట్ల తేడాతో కైవసం చేసుకున్న పాకిస్తాన్ రెండో మ్యాచ్‌ని 16 పరుగులు, చివరిదైన మూడో మ్యాచ్‌ని 8 వికెట్ల ఆధిక్యంతో సొంతం చేసుకొని, ప్రత్యర్థికి వైట్‌వాష్ వేసింది. అనంతరం మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను కూడా క్లీన్‌స్వీప్ చేసింది. మూడు వనే్డలను వరుసగా 111, 59, 136 పరుగుల తేడాతో గెల్చుకుంది. అదే ఉత్సాహంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో కసరత్తు చేసింది. టెస్టుల్లో సంప్రదాయ బద్ధంగా వాడే ఎర్ర రంగు బంతులకు బదులు డే/నైట్ మ్యాచ్‌ల్లో గులాబీ రంగు బంతులను వాడతారు. ఐదు రోజుల టెస్టులో ఆట స్థానిక కాలమానం ప్రకారం 3.30 గంటలకు మొదలై, రాత్రి 10.30 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం తర్వాత వికెట్‌పై తేమ ఏర్పడి, బంతి విపరీతంగా స్పిన్ అవుతుంది. గులాబీ బంతులు వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ అవుతాయి. ఈ రెండు అంశాలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పాకిస్తాన్ వ్యూహ రచన చేస్తున్నది.
ఈ ఏడాది ఆగస్టు మాసంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-2గా డ్రా చేసుకున్న పాకిస్తాన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొట్టమొదటిసారి నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. అయితే, న్యూజిలాండ్‌ను భారత్ 3-0 తేడాతో చిత్తుచేసి, నంబర్ వన్‌గా నిలవగా, పాకిస్తాన్ రెండో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా తిరిగి భారత్ నుంచి ‘టెస్టు గద’ను తీసుకోవడమే ధ్యేయంగా పెట్టుకుంది. టి-20, వనే్డ ఫార్మెట్స్‌లో దారుణంగా విఫలమైన వెస్టిండీస్‌ను టెస్టు ఫార్మెట్‌లోనూ పాకిస్తాన్ సులభంగా ఓడిస్తుందని విశే్లషకుల అభిప్రాయం. మిస్బా ఉల్ హక్ నాయకత్వంలోని ఈ జట్టు సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ సేవలను కోల్పోతున్నది. డెంగ్యూ జ్వరం సోకడంతో ఆసుపత్రిపాలైన యూనిస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. దీనితో అతను మొదటి టెస్టుకు అందుబాటులో ఉండడని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. అతని స్థానంలో 21 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న ఓపెనర్లు మహమ్మద్ హఫీజ్, షాన్ మసూద్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు. ఈ పరిణామాన్ని మిగతా ఆటగాళ్లకు హెచ్చరికగా చెప్పుకోవాలి. అంతేగాక, ఫిట్నెస్ సరిగ్గా లేకపోయినా, ఫామ్‌ను కొనసాగించలేకపోయినా జట్టులో స్థానం ఉండదని కోచ్ మికీ ఆర్థర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్ తర్వాత అతను చేసిన హెచ్చరికలు, వెస్టిండీస్‌పై ఆటగాళ్లంతా సర్వశక్తులు ఒడ్డి పోరాడేందుకు పరోక్షంగా ఉపయోగపడ్డాయి. కాగా, జట్టులోని ఇద్దరు స్పెషలిస్టు స్పిన్నర్లు జాసిర్ షా, జుల్ఫీకర్ బాబర్ సామర్థ్యంపై కొండంత నమ్మకంతో విండీస్‌ను టెస్టు సిరీస్‌లోనూ చిత్తుచేయడానికి పాకిస్తాన్ సన్నాహాలు పూర్తి చేసింది.
400వ టెస్టు
వెస్టిండీస్‌తో గురువారం మొదలయ్యే మ్యాచ్ పాకిస్తాన్‌కు 400వ టెస్టు కావడం విశేషం. ఈ చిరస్మరణీయ టెస్టును ఎప్పటికీ గుర్తిండిపోయేలా భారీ విజయంతో ముగించాలని పాక్ జట్టు పట్టుదలగా ఉంది. 1952లో మొట్టమొదటి టెస్టు భారత్‌తో ఆడిన ఈ జట్టు విండీస్‌పై క్లీన్‌స్వీప్ సాధించి, తిరిగి ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించమే లక్ష్యంగా ఎంచుకుంది. గులాబీ బంతులతో డే/నైట్ టెస్టు ఆడడం ఈ జట్టుకు ఇదే మొదటిసారి. ఈఏడాది డిసెంబర్ మాసంలో ఆస్ట్రేలియాతో జరిగే డే/నైట్ టెస్టుకు విండీస్‌తో పోరును ప్రాక్టీస్ ఈవెంట్‌గా స్వీకరించింది. జాసన్ హోల్డర్ కెప్టెన్‌గా ఉన్న వెస్టిండీస్ అన్ని విభాగాల్లోనూ బలహీనంగా ఉండడంతో, టెస్టు సిరీస్‌పై పాక్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సిరీస్‌లో మిగతా రెండు టెస్టులు ఈనెల 21 నుంచి 25 వరకు అబూదబీలో, 30 నుంచి నవంబర్ 3 వరకు షార్జాలో జరుగుతాయి.