క్రీడాభూమి

హోరాహోరీలో న్యూజిలాండ్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చివరి వరకూ హోరాహోరీగా సాగిన రెండో వనే్డలో న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ సూపర్ సెంచరీతో అదరగొట్టడంతో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 242 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.3 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన మొదటి మ్యాచ్‌ని టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రెండో వనే్డను సాధించిన న్యూజిలాండ్ ప్రస్తుతానికి 1-1గా భారత్‌కు సమవుజ్జీగా నిలిచింది.
ఫామ్‌లోకి కివీస్ కెప్టెన్
భారత్ టూర్‌లో ఇప్పటి వరకూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్‌సన్ రెండో వనే్డలో ఫామ్‌లోకి వచ్చాడు. 128 బంతులు ఎదుర్కొని, 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 118 పరుగులు చేశాడు. అయితే, అతని శ్రమకు తగిన ఫలితం దక్కలేదు. ఓపెనర్ టామ్ లాథమ్ (46)ను మినహాయిస్తే, మిగతా కివీస్ బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. పకడ్బందిగా బంతులు వేసిన భారత బౌలర్లు చివరి ఓవర్లలో కివీస్ బ్యాట్స్‌మెన్‌ను సమర్థంగా కట్టడి చేయగలిగారు. ఇన్నింగ్స్ రెండో బంతికే మార్టిన్ గుప్టిల్ వికెట్ కోల్పోయిన జట్టును లాథమ్‌తో కలిసి ఆదుకున్న విలియమ్‌సన్ రెండో వికెట్‌కు 120 పరుగులు జోడించాడు. లాథమ్ వికెట్ కూలిన తర్వాత న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. రాస్ టేలర్ (21), కొరీ ఆండర్సన్ (21) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక వెనుదిరిగారు. విలియమ్‌సన్ ఐదో వికెట్‌గా అవుట్ కావడంతో కివీస్ పోరాటానికి దాదాపుగా తెరపడింది. లోయర్ మిడిల్ ఆర్డర్, టెయిలెండర్లు సింగిల్ డిజిట్స్‌కే పరిమితంకాగా, న్యూజిలాండ్ చివరి 15 ఓవర్లలో కేవలం 66 పరుగులు చేయగలిగింది. అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా చెరి 3 వికెట్లు పడగొట్టి, కివీస్‌ను దెబ్బతీశారు.
టాప్ ఆర్డర్ తడబాటు
న్యూజిలాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేక భారత టాప్ ఆర్డర్ తడబడింది. ఫలితంగా 25 పరుగుల స్కోరువద్ద టీమిండియా తొలి వికెట్‌ను రోహిత్ శర్మ రూపంలో కోల్పోయింది. అతను 15 పరుగులు చేసి ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ ల్యూక్ రోన్చీకి దొరికిపోయాడు. మొదటి వనే్డలో చెలరేగిపోయిన టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం తొమ్మిది పరుగులకే, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో కీపర్ రోన్చీకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన మనీష్ పాండే (19) దురదృష్టవశాత్తు రనౌట్‌కాగా, మరో పరుగు తర్వాత ఆజింక్య రహానే పోరాటానికి కూడా తెరపడింది. అతను 28 పరుగులు సాధించి, మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో కొరీ ఆండర్సన్ చక్కటి క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఈ దశలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన కేదార్ జాదవ్ వేగంగా పరుగులు సాధించాడు. అయితే, 37 బంతుల్లో, రెండు ఫోర్లు, మరో రెండు సిక్సర్లతో 41 పరుగులు చేసి మాట్ హెన్రీ బౌలింగ్‌లో రోన్చీ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. అతను ధోనీతో కలిసి 11.5 ఓవర్లలో 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అతని వికెట్ కూలడంతో బ్యాటింగ్‌కు దిగిన అక్షర్ పటేల్‌తో కలిసి ధోనీ ఆరో వికెట్‌కు 33 పరుగులు జోడించాడు. తన సహజమైన దూకుడుకు భిన్నంగా, నింపాదిగా ఆడిన ధోనీ 65 బంతులు ఎదుర్కొని, 39 పరుగులు చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత కొద్దిసేపటికే అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ముగిసింది. పార్ట్‌టైమర్ మార్టిన్ గుప్టిల్ రెండు వైడ్ బాల్స్ వేసి, మొదటి సరైన బంతికి అక్షర్ వికెట్ సాధించాడు. బంతిని షాట్‌గా మలచబోయి, మిచెల్ సాంట్నర్ క్యాచ్ పట్టడంతో అక్షర్ అవుటయ్యాడు. అదే ఓవర్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు డౌగ్ బ్రాస్‌వెల్ క్యాచ్ పట్టగా అమిత్ మిశ్రా (1)ను గుప్టిల్ పెవిలియన్ పంపాడు. 183 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్ చేజార్చుకుంది. ఈ దశలో హార్దిక్ పాండ్య, ఉమేష్ యాదవ్ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 16 పరుగుల దూరంలో నిలిచింది. ఇన్నింగ్స్‌లో 49వ ఓవర్ వేసిన ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి బంతిని ఉమేష్ యాదవ్ సింగిల్‌గా మార్చాడు. రెండోది డాట్ బాల్‌కాగా, మూడో బంతిలో హార్దిక్ పాండ్య భారీ ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతి మరో డాట్ బాల్‌గా నమోదైంది. ఐదో బంతిని బలంగా బాదడానికి ప్రయత్నించిన హార్దిక్ పాండ్య 36 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద మిచెల్ సాంట్నర్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన ఆ ఓవర్ చివరి బంతిలో ఉమేష్ యాదవ్ ఒక పరుగు చేశాడు.
చివరి ఓవర్‌లో పది పరుగులు అవసరంకాగా, క్రీజ్‌లో ఉన్న ఉమేష్ యాదవ్‌తో కలిసి జస్‌ప్రీత్ బుమ్రా లక్ష్యాన్ని చేరడం కష్టంగా కనిపించింది. టిమ్ సౌథీ వేసిన చివరి ఓవర్ మొదటి బంతికి రెండు పరుగుల చేసిన ఉమేష్ యాదవ్ రెండో బంతిలో సింగిల్ తీశాడు. దీనితో స్ట్రయికింగ్ ఎండ్‌కు వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా (0) క్లీన్ బౌల్డ్‌కాగా, భారత్ ఇన్నింగ్స్‌కు 236 పరుగుల వద్ద తెరపడింది. అప్పటికి ఉమేష్ యాదవ్ 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

చిత్రం..న్యూజిలాండ్ సెంచరీ హీరో కేన్ విలియమ్‌సన్ బ్యాటింగ్