క్రీడాభూమి

పాక్‌పై భారత్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కువాంటన్ (మలేసియా), అక్టోబర్ 23: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో ఆదివారం జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత్ 3-2 తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించింది. ఒక దశలో 1-2 తేడాతో వెనుకబడిన భారత్‌కు రూపీందర్‌పాల్ సింగ్, రమణ్‌దీప్ సింగ్ ఒక నిమిషం తేడాలో గోల్స్ చేసి, చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టారు. హాకీలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇది 166వ మ్యాచ్‌కాగా, భారత్‌కు 54వ విజయం. పాకిస్తాన్ 82 మ్యాచ్‌ల్లో గెలిచింది. 30 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. మొత్తం మీద భారత్ ఇప్పటి వరకూ పాక్‌పై 318 గోల్స్ చేసింది. అదే విధంగా భారత్‌పై పాకిస్తాన్ 384 గోల్స్ సాధించింది. తీవ్ర ఉత్కంఠ, ఉద్రిక్తతల మధ్య మొదలైన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు సంయమనాన్ని ప్రదర్శించాయి. ఆరంభంలో వ్యూహాత్మక రక్షణ విధానాన్ని అనుసరించాయి. 22వ నిమిషంలో పార్‌దీప్ మోర్ గోల్ చేసి, భారత్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. 24 ఏళ్ల మోర్‌కు 13 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఇదే తొలి గోల్‌కావడం విశేషం. కాగా, భారత్ గోల్ సాధించడంతో పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా వ్యూహాన్ని మార్చేశారు. భారత్ గోల్ పోస్టుపై పదేపదే దాడులకు ఉపక్రమించారు. 31వ నిమిషంలో రిజ్వాన్ మహమ్మద్ సీనియర్ పాక్‌కు ఈక్వెలైజర్‌ను అందించాడు. మరో ఎనిమిది నిమిషాల్లోనే ఇర్ఫాన్ మహమ్మద్ జూనియర్ ద్వారా పాక్ 2-1 ఆధిక్యానికి దూసుకెళ్లింది. ఈ పరిణామంతో కంగుతిన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచారు. పాక్‌కు రెండో గోల్ లభించిన నాలుగు నిమిషాల్లోనే రూపీందర్‌పాల్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీనితో స్కోరు సమమైంది. ఒకే ఒక్క నిమిషం తర్వాత రమణ్‌దీప్ సింగ్ చక్కటి ఫీల్డ్ గోల్‌ను నమోదు చేసి, భారత్‌కు 3-2 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం భారత్ మరోసారి డిఫెన్స్‌కు ప్రాధాన్యతనివ్వడంతో పాక్‌కు ఈక్వెలైజర్‌ను సాధించే అవకాశం దక్కలేదు. ఈ టోర్నమెంట్ ఫైనల్‌గా క్రీడాపండితులు అభివర్ణించి, హై ఓల్టేజీ మ్యాచ్‌లో పాక్‌ను ఓడించిన భారత్ సెమీస్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. క్వార్టర్ ఫైనల్స్‌గా పేర్కొనే ఈ లీగ్ దశలో భారత జట్టు 25న చైనాను, 26న మలేసియాను ఢీ కొంటుంది.
ఆద్యంతం ఉత్కంఠ
భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం నాటి లీగ్ మ్యాచ్ ఆద్యంత ఉత్కంఠ రేపింది. భారత్‌లో ఉగ్రవాద దాడులను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్‌పై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో జరిగిన ఈ మ్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఉగ్రవాదానికి పాక్ మద్దతునిస్తున్నదని, ఆ దేశంలో ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను కొనసాగించరాదని భారత్‌లో అధిక సంఖ్యాకులు డిమాండ్ చేస్తున్నారు. చాలాకాలంగా రెండు దేశాల మధ్య నేరుగా క్రీడా పోటీలు జరగడం లేదు. అంతర్జాతీయ వేదికలపై మాత్రమే తలపడుతున్నాయి. ఉరీలోని భారత సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత పాక్‌తో క్రీడల పట్ల విముఖత మరింత పెరిగింది. 2008లో ముంబయిపై పాకిస్తాన్‌కు చెందిన ఉద్రవాదులు దాడి జరిపిన తర్వాత ఆ దేశంతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి దాకా పాకిస్తాన్ క్రికెటర్లను తమతమ జట్లలోకి తీసుకోవడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజీలు సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఎంతో డిమాండ్ ఉన్న క్రికెట్‌లోనే రెండు దేశాల మధ్య సంబంధాలు లేకపోవడంతో, దాని ప్రభావం మిగతా ఆటలపైన కూడా పడింది. పాకిస్తాన్‌కు ఆటగాళ్లను పంపడానికి భారత జాతీయ క్రీడా సమాఖ్యలు ఇష్టపడడం లేదు. ఉరీ సంఘటన తర్వాత కూడా సరిహద్దులో చోటు చేసుకుంటున్న కాల్పులు, చొరబాటు ప్రయత్నాలు, దాడులకు పాక్ తెగబడుతూ ఉండడంతో రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్, పాక్ హాకీ జట్ల పోరు సహజంగానే ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అయితే, రెండు జట్ల ఆటగాళ్లు వాగ్వాదాలకు, వివాదాలకు తావివ్వకుండా మ్యాచ్‌ని పూర్తి చేయడంతో నిర్వాహకులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మలేసియా విజయం
జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మలేసియా 7-2 తేడాతో గెలుపొందింది. స్టార్ స్ట్రయికర్ ఫైజల్ సరీ రెండు గోల్స్ చేయగా, మరో ఐదుగురు ఆటగాళ్లు ఒక్కో గోల్ సాధించి మలేసియాను గెలిపించారు.

యుద్ధ భూమిని తలపించాల్సిన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హాకీ పోరు ప్రశాంతంగా ముగిసింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ మ్యాచ్‌ని భారత్ గెల్చుకొని, సెమీస్‌లో స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. కోట్లాది మంది అభిమానుల కోసమేగాక, ఉరీ సంఘటనలో ప్రాణాలు కోల్పోయన అమర జవాన్ల కుటుంబాల కోసం కూడా పాకిస్తాన్‌ను ఓడించి తీరుతామని స్పష్టం చేసిన భారత కెప్టెన్ శ్రీజేష్ తన మాటలను చేతల్లో చూపించాడు. ప్రత్యర్థి జట్టు ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా భారత ఆటగాళ్లు ఎంతో సంయమనంతో ఆడారు. ఆధిక్యాన్ని తగ్గించి ఈక్వెలైజర్‌ను నమోదు చేసిన నిమిషం వ్యవధిలోనే కీలక గోల్‌ను సంపాదించిన భారత్ 3-2 గోల్స్ తేడాతో విజయభేరి మోగించి, అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.

చిత్రం... ఆసియా చాంపియన్స్ ట్రోఫీ
హాకీ టోర్నమెంట్‌లో
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను
ఓడించి భారత జట్టు