క్రీడాభూమి

ఉమ్మడి జాబితాలో కీడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 27: భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రాల జాబితాలో ఉన్న క్రీడలను ఉమ్మడి జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. జాతీయ క్రీడా సమాఖ్యల (ఎన్‌ఎస్‌ఎఫ్) ప్రతినిధులతో గురువారం ఇక్కడ సమావేశమైన గోయల్ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రాల పరిధి నుంచి క్రీడలను తప్పించి, ఉమ్మడి జాబితాలోకి చేర్చడం మంచిదని అభిప్రాయపడ్డారు. అత్యధిక శాతం జాతీయ సమాఖ్యలు దీనికి సానుకూలత వ్యక్తం చేశాయని అన్నారు. అయితే, అన్ని రాష్ట్రాలతో చర్చించిన తర్వాతే ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్రాల జాబితాలో ఉన్న ఒక అంశాన్ని ఉమ్మడి జాబితాలోకి తేవడానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుందని గుర్తుచేశారు. సమాఖ్యలతో సమావేశం కావడం ఇది రెండోసారని అంటూ, దేశంలో క్రీడాభివృద్ధికి అన్ని స్థాయిల్లోనూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే క్రీడల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. క్రీడలను ఉమ్మడి జాబితాలో చేర్చడానికి జాతీయ సమాఖ్యలన్నీ సానుకూలంగా తీర్మానాన్ని ఆమోదించాయని, కానీ, ఈ విషయంలో విస్తృత స్థాయి చర్చ అవసరమని అన్నారు. మరో నాలుగేళ్లలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఇంతకు ముందు కూడా పలువురు క్రీడా ప్రముఖులతో భేటీ అయ్యానని, అభిప్రాయాలు సేకరించానని చెప్పారు. ఈ నెల మొదట్లో పిటి ఉష, అంజూ బి. జార్జి, సాక్షి మాలిక్, మేరీ కోమ్, సర్దార్ సింగ్, గగన్ నారంగ్, గోపీచంద్, ఖాజన్ సింగ్, శ్రీజేష్, సత్పాల్, వీరేందర్ పునియా, నాగపురి రమేష్ తదితరులతో గోయల్ చర్చించారు. ద్వితీయ, తృతీయ స్థాయి క్రీడాకారులను కూడా తయారు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని క్రీడా మంత్రికి పలువురు సూచించారు. అదే విధంగా దేశంలో అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలను సంపూర్ణంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మాజీ ఒలింపియన్లు, క్రీడాకారుల సహాయసహకారాలు తీసుకోవాలని సలహా చెప్పారు. క్రీడాభివృద్ధికి పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసి, పకడ్బందిగా అమలు చేయాలని కోరారు. అప్పటి సమావేశ వివరాలను వెల్లడించిన గోయల్ తాజాగా జాతీయ క్రీడా సమాఖ్యల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జాబితాలో క్రీడలను చేర్చే అంశంపై చర్చలు జరుపుతామని, అదే విధంగా చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రీడా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయాన్ని కూడా పరిశీలిస్తామని గోయల్ తెలిపారు.

చిత్రం.. విజయ్ గోయల్