క్రీడాభూమి

విశాఖలో ఫ్లాట్ వికెట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (స్పోర్ట్స్), నవంబర్ 14 : విశాఖలోని విశాఖ ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో మైదానం మొదట్లో స్పిన్నర్లకు అంతగా అనుకూలించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ప్రారంభంలో ఫ్లాట్‌గా ఉండి, క్రమంగా టర్న్ తీసుకుంటుందని నిపుణులు అంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) క్యూరేటర్ కస్తూరి శ్రీరాం కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రాజ్‌కోట్‌లో మాదిరి కాకుండా విశాఖ పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండదని చెప్పాడు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో, రెండో రోజు భోజన విరామం తర్వాత పిచ్‌పై బంతి దిశను మార్చుకునే పరిస్థితి ఉంటుందని అన్నాడు. ఆదివారం వాతావరణం చల్లగా ఉందని, కానీ, సోమవారం విపరీతమైన వేడి కారణంగా పిచ్ బాగా ఎండిందని శ్రీరాం తెలిపాడు. మ్యాచ్ ప్రారంభం నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పలేమని వ్యాఖ్యానించాడు. ఈ మైదానంలో మొట్టమొదిసారి టెస్టు మ్యాచ్ జరుగుతున్నందువల్ల పిచ్ స్వభావం ఫలానా విధంగా ఉంటుందని చెప్పడానికి వీల్లేదని అన్నాడు. ఇలావుంటే, చివరిసారి ఈ పిచ్‌పై, న్యూజిలాండ్‌తో అక్టోబర్ 29న వనే్డ ఇంటర్నేషనల్ జరిగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేసింది. అనంతరం పిచ్ స్పిన్‌కు అనుకూలించడంతో భారత్ చెలరేగిపోయింది. న్యూజిలండ్‌ను 23.1 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూల్చింది. అమిత్ మిశ్రా 18 పరుగులకు ఐదు వికెట్లు పడగొడితే, అక్షర్ పటేల్ కేవలం తొమ్మిది పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఇంగ్లాండ్‌తో ఐదు రోజుల టెస్టు మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, పిచ్ తీరు ఎలాగైనా మారవచ్చని, అయితే, స్పిన్‌కు ఎక్కువగా అనుకూలించవచ్చని అంటున్నారు. రంజీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్, అసోం జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మూడు రోజుల్లోపే ముగిసింది. అసోం 69 పరుగులకే కుప్పకూలడంతో, ఆ జట్టు కోచ్, భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి పిచ్ తీరుపై సందేహాలు వ్యక్తం చేశాడు. అయితే, అలాంటి విమర్శలు రాకుండా ఎసిఎ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది.
చేరుకున్న భారత్, ఇంగ్లాండ్ జట్లు
టెస్ట్ మ్యాచ్‌కు తొలిసారిగా ఆతిథ్యమివ్వబోతున్న తలపడేందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లు సోమవారం ఇక్కడకు చేరుకున్నాయి. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన ఇరు జట్ల క్రికెటర్లకు ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం వసతి ఏర్పాటు చేసిన నోవాటెల్‌కు చేరుకున్న ఆటగాళ్లకు హోటల్ సిబ్బంది తిలకందిద్ది, పూలమాలలతో స్వాగతం పలికారు. మూడు రోజుల ముందుగా విశాఖ వచ్చిన రెండు జట్లు మంగళవారం నుంచి సాధన చేయనున్నాయి. మంగళవారం ఉదయం 9 గంటలకు ఇంగ్లాండ్, మధ్యాహ్నం ఒంటటి గంటకు టీమిండియా నెట్స్‌లో పాల్గొంటాయి. అలాగే బుధవారం ఉదయం భారత జట్టు, మధ్యాహ్నం ఇంగ్లండ్ జట్లు ప్రాక్టీస్ సెషన్‌కు హాజరవుతారని సమాచారం.
రాజ్‌కోట్‌లో జరిగిన తొలిటెస్టులో భారత్, ఇంగ్లాండ్ జట్లు రెండూ సెంచరీల మోత మోగించి భారీస్కోర్లు సాధించడంతో రెండవ టెస్టకు ఆదరణ పెరిగింది. తొలిటెస్టు ప్రారంభం వరకు స్తబ్దుగా ఉన్న టిక్కెట్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ మ్యాచ్‌లో కూడా రెండు జట్లు బ్యాట్ ఝుళిపించి అలరిస్తాయని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సోమవారం కౌంటర్లలో ప్రారంభమైన టిక్కెట్ల అమ్మకాలపై కొత్తనోట్ల ప్రభావం కనిపించింది.

చిత్రం... హోటల్‌కు చేరుకున్న ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్, అతని సహచర క్రికెటర్లు

విశాఖలోని నోవాటెల్ హోటల్‌కు వస్తున్న భారత టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సభ్యులు అమిత్ మిశ్రా, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా

ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్ పోరు

విజేందర్ ప్రత్యర్థి చెకా

న్యూఢిల్లీ, నవంబర్ 14: ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ వచ్చేనెల 17న జరిగే ఫైట్‌లో అంతర్జాతీయ చాంపియన్ ఫ్రాన్సిస్ చెకాను ఢీ కొంటాడు. ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబివో) ఈ విషయాన్ని ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. 34 ఏళ్ల చెకా ఇప్పటి వరకూ 43 ఫైట్స్‌లో పాల్గొన్నాడు. 32 విజయాలు సాధించాడు. వీటిలో 17 నాకౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం. 16 సంవత్సరాల కెరీర్‌లో అతనికి ఇప్పటి వరకూ మూడు వందలకు పైగా రౌండ్స్‌లో ఫైట్ చేసిన అనుభవం ఉంది. డబ్ల్యుబిఎఫ్ మాజీ చాంపియన్ చెకా ఇప్పుడు అంతర్జాతీయ సూపర్ మిడిల్‌వెయిట్ చాంపియన్‌గా కొనసాగుతున్నాడు. 34 ఏళ్ల అతను ఇంత వరకూ భారత్‌లో రింగ్‌లోకి దిగలేదు. ఇలావుంటే ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతారం ఎత్తిన తర్వాత ఒక్కసారి కూడా పరాజయాన్ని చవిచూడని విజేందర్‌కు మొదటిసారి గట్టిపోటీదారు ఎదురుకానున్నాడు. అంతర్జాతీయ ఫైట్స్‌లో విశేష అనుభవం ఉన్న చెకాను విజేందర్ ఏ విధంగా ఢీ కొంటాడో చూడాలి.

కివీస్‌తో సిరీస్‌కు
విశేష స్పందన!
న్యూఢిల్లీ, నవంబర్ 14: న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కు మన దేశంలో గతంలో ఎన్నడూ లేనంతగా విశేష స్పందన లభించింది. అధికారిక గణాంకాలను అనుసరించి ఈ సిరీస్‌లో మ్యాచ్‌లకు 73.97 లక్షల హిట్స్ లభించాయి. అంతకు ముందు భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లో మ్యాచ్‌లకు దక్కిన 61.53 లక్షల హిట్స్‌ను కివీస్‌తో జరిగిన సిరీస్ అధిగమించి, కొత్త రికార్డు సృష్టించింది.