క్రీడాభూమి

సంకుల సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 26: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు ఆటలో సంకుల సమరం కొనసాగింది. భారత బౌలింగ్, ఇంగ్లాండ్ బ్యాటింగ్ మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. ఇంగ్లాండ్ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి ఐదో వికెట్‌కు 57, జొస్ బట్లర్‌తో కలిసి ఆరో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యాలను అందించాడు. అతని ప్రతిభతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్లకు 268 పరుగులు చేసింది. ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 32 పరుగుల స్కోరువద్ద సహీబ్ హమీద్ వికెట్‌ను కోల్పోయింది. అతను 31 బంతుల్లో 9 పరుగులు చేసి, ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఆజింక్య రహానే క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. 32 పరుగుల వద్ద మొదటి వికెట్ కూలింది. 51 పరుగుల స్కోరువద్ద జో రూట్ (15), కెప్టెన్ అలస్టర్ కుక్ (27) వికెట్లు పడ్డాయి. జోను జయంత్ యాదవ్ ఎల్‌బిగా అవుట్ చేయగా, కుక్‌ను పార్థీవ్ పటేల్ క్యాచ్ పట్టగా అశ్విన్ పెవిలియన్‌కు చేర్చాడు. ఆల్‌రౌండర్ మోయిన్ అలీ (16) కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక మహమ్మద్ షమీ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కి దొరికిపోయాడు. ఈ దశలో బెన్ స్టోక్స్, జొస్ బట్లర్‌తో కలిసి జట్టును ఆదుకునేందుకు బెయిర్‌స్టో విశేషంగా శ్రమించాడు. స్టోక్స్ 59 బంతుల్లో 29 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి, పార్థీవ్ పటేల్ స్టంప్ చేయగా అవుటయ్యాడు. బట్లర్ 80 బంతులు ఎదుర్కొని, 43 పరుగులు చేసిన తర్వాత రవీంద్ర జడేజా బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీకి దొరికాడు. వికెట్లు కూలుతున్నప్పటికీ క్రీజ్‌లో నిలదొక్కుకొని, 117 బంతులు ఎదుర్కొన్న బెయిర్‌స్టో ఆరు ఫోర్ల సాయంతో 89 పరుగులు చేసి జయంత్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్ 70 బంతుల్లో 25 పరుగులు చేసి ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 268 పరుగులు చేసింది. అప్పటికి గరాత్ బాటీ (0), అదిల్ రషీద్ (4) క్రీజ్‌లో ఉన్నారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 27, సహీబ్ హమీద్ సి ఆజింక్య రహానే బి ఉమేష్ యాదవ్ 9, జో రూట్ ఎల్‌బి జయంత్ యాదవ్ 15, మోయిన్ అలీ సి మురళీ విజయ్ బి మహమ్మద్ షమీ 16, జానీ బెయిర్‌స్టో ఎల్‌బి జయంత్ యాదవ్ 89, బెన్ స్టోక్స్ స్టెంప్డ్ పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 29, జొస్ బట్లర్ సి విరాట్ కోహ్లీ బి రవీంద్ర జడేజా 43, క్రిస్ వోక్స్ బి ఉమేష్ యాదవ్ 25, అదిల్ రషీద్ 4 నాటౌట్, జేమ్స్ ఆండర్సన్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (90 ఓవర్లలో 8 వికెట్లకు) 268.
వికెట్ల పతనం: 1-32, 2-51, 3-51, 4-87, 5-144, 6-213, 7-258, 8-266.
బౌలింగ్: మహమ్మద్ షమీ 20-5-52-1, ఉమేష్ యాదవ్ 16-4-58-2, జయంత్ యాదవ్ 15-5-49-2, అశ్విన్ 18-1-43-1, రవీంద్ర జడేజా 21-3-56-2.

భారత్‌పై జానీ బెయిర్‌స్టో అత్యధిక స్కోరు చేశాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో 53 పరుగులు చేసిన అతను ఈ ఇన్నింగ్స్‌లో 89 పరుగులు సాధించాడు. ఆసియాలో అతని రెండో అత్యుత్తమ ఇన్నింగ్స్ కూడా ఇవే కావడం విశేషం. గత నెల బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన మ్యాచ్‌లో అతను 52 పరుగులు చేశాడు. మొత్తం మీద శనివారం అతను కెరీర్‌లో 13వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. అతను ఈ ఏడాది ఇప్పటి వరకూ15 టెస్టుల్లో 1,340 పరుగులు సాధించాడు. మరే ఇతర బ్యాట్స్‌మన్ ఈ ఏడాది టెస్టుల్లో ఇన్ని పరుగులు చేయలేదు. తాజా సీజన్‌లో అతను 3 శతకాలు, 7 అర్ధ శతకాలను తన ఖాతాలో వేసుకోవడం విశేషం.

ఆస్ట్రేలియా
383 ఆలౌట్
దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు
అడెలైడ్, నవంబర్ 26: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ, చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 383 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 259 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 307 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు, శనివారం ఆటను కొనసాగించి 383 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్లకు 194 పరుగులు సాధించింది.
కష్టాల్లో పాకిస్తాన్
హామిల్టన్, నవంబర్ 26: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఎదురీదుతున్నది. మొదటి రోజు ఆట వర్షం కారణంగా పూర్తిగా జరగలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ రెండు వికెట్లకు 77 పరుగులు చేసింది. ఈ దశలో భారీ వర్షం కురవడంతో ఆట నిలిచిపోయింది. కాగా, ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు, శనివారం ఆటను కొనసాగించిన న్యూజిలాండ్ 83.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 76 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలకు ఎదురీదుతున్నది.