క్రీడాభూమి

ఇంగ్లాండ్ 400 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 9: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్ (31), జొస్ బట్లర్ (76), చివరిలో జేక్ బాల్ (31) కొంత వరకు భారత బౌలింగ్‌ను ప్రతిఘటించడంతో ఇంగ్లాండ్ 400 పరుగుల మైలురాయిని చేరగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 146 పరుగులు చేసింది. ఐదు వికెట్లకు 288 పరుగుల స్కోరుతో రెండో రోజు ఉదయం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ 297 పరుగుల వద్ద బెన్ స్టోక్స్ వికెట్‌ను కోల్పోయింది. అతను 92 బంతులు ఎదుర్కొని, 31 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి చిక్కాడు. క్రిస్ వోక్స్ కేవలం 11 పరుగులకే అవుటయ్యాడు. పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో అతను పెవిలియన్ చేరాడు. అదిల్ రషీద్ (4) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. జాక్ బాల్ 60 బంతులు ఎదుర్కొని, 31 పరుగులు చేసి పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా అశ్విన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇంగ్లాండ్‌ను ఆదుకోవడానికి క్రీజ్‌లో పాతుకుపోయి, 137 బంతులు ఎదుర్కొని 76 పరుగులు చేసిన జొస్ బట్లర్‌ను కూడా రవీంద్ర జడేజా బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సరిగ్గా నాలుగు వందల పరుగుల వద్ద ముగిసింది. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌల్ చేశాడు. మొదటి రోజు ఆటలో నాలుగు వికెట్లు పడగొట్టిన అతను రెండో రోజున మరో రెండు వికెట్లు కూల్చాడు. అతను మొత్తం 112 పరుగులిచ్చి ఆరు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా 109 పరుగులకు నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
రాహుల్ ఇన్..
గాయం కారణంగా మూడో టెస్టు ఆడలేకపోయిన లోకేష్ రాహుల్ మళ్లీ తుది జట్టులోకి రావడంతో, ఓపెనర్ బాధ్యతల నుంచి వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ తప్పుకోవాల్సి వచ్చింది. మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రాహుల్ 41 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లతో 24 పరుగులు చేసి, మోయిన్ అలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం చటేశ్వర్ పుజారాతో కలిసి మురళీ విజయ్ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 52 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 146 పరుగులు చేసింది. విజయ్ 70, పుజారా 47 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టడం ఇది 23వ సారి. ఎక్కువ పర్యాయాలు ఫైవ్ వికెట్స్ హౌల్ సాధించిన భారత బౌలర్ల జాబితాలో అతను కపిల్ దేవ్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానాన్ని పంచుకుంటున్నాడు. అనిల్ కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25) మాత్రమే ఈ జాబితాలో అశ్విన్, కపిల్ కంటే ముందున్నారు. కాగా, మన దేశం తరఫున టెస్టుల్లో ఎక్కువ వికెట్లు కూల్చిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌కు ఏడో స్థానం లభించింది. మోయిన్ అలీని అవుట్ చేయడం ద్వారా అతను జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు)ను ఎనిమిదో స్థానానికి నెట్టేశాడు.

చిత్రం..భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన చటేశ్వర్ పుజారా 47 నాటౌట్, మురళీ విజయ్ 70 నాటౌట్