క్రీడాభూమి

కోహ్లీ, విజయ్ శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో
కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ. కెరీర్‌లో 15వ టెస్టు సెంచరీని సాధించిన అతను 147 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు
ఎనిమిదో టెస్టు శతకాన్ని నమోదు చేసిన మురళీ విజయ్

ముంబయి, డిసెంబర్ 10: విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్, ఓపెనర్ మురళీ విజయ్ బాధ్యతాయుతమైన ఆట ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు టీమిండియాకు 51 పరుగుల ఆధిక్యాన్ని అందించాయి. ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి. కెరీర్‌లో కోహ్లీ 15వ, విజయ్ 8వ శతకాలను నమోదు చేసి, భారత్‌ను మెరుగైన స్థితిలో నిలబెట్టారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి లోకేష్ రాహుల్ (24) వికెట్‌ను కోల్పోయి 146 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, రెండో బంతి లోనే
పుజారా
వికెట్‌ను కోల్పోయింది. అతను 104 బంతుల్లో, ఆరు ఫోర్లతో 47 పరుగులు చేసి, జాక్ బాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సెకండ్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి స్కోరుబోర్డును ముందుకు దూకించిన విజయ్ మూడో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అతను తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 282 బంతులు ఎదుర్కొని, 10 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 136 పరుగులు సాధించి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ వికెట్ 262 పరుగుల వద్ద కూలింది. ఆతర్వాత వికెట్ల పతనం కొనసాగింది. కరుణ్ నాయర్ కేవలం 13 పరుగులు చేసి, మోయిన్ అలీ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. ఓపెనర్ స్లాట్‌ను రాహుల్ అందిపుచ్చుకోగా, వికెట్‌కీపర్ పాత్రకే పరిమితమైన పార్థీవ్ పటేల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. 31 బంతులు ఎదుర్కొన్న అతను 15 పరుగులు చేసి, జానీ బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా, జో రూట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 305 పరుగులు. మరో రెండు పరుగులు జత కలిసి తర్వాత, అశ్విన్ తన ఖాతాను తెరవకుండానే, జో రూట్ బౌలింగ్‌లో కీటన్ జెన్నింగ్స్‌కు దొరికిపోయాడు. ఏడో వికెట్‌కు కోహ్లీతో 57 పరుగులు జోడించిన జడేజా వికెట్ 364 పరుగుల వద్ద కూలింది. 46 బంతుల్లో 25 పరుగులు చేసిన అతను జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా అదిల్ రషీద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఏడో వికెట్ కూలిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన జయంత్ యాదవ్‌తో కలిసి కోహ్లీ మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 142 ఓవర్లలో ఏడు వికెట్లకు 451 పరుగులు సాధించింది. కోహ్లీ 241 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్లతో 147 పరుగులు, జయంత్ 86 బంతుల్లో 30 పరుగులు సాధించి నాటౌట్‌గా ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ, అదిల్ రషీద్, జో రూట్ తలా రెండు వికెట్లు సాధించారు. జాక్ బాల్‌కు ఒక వికెట్ లభించింది. మొత్తం మీద మూడోరోజు ఆటలో భారత్‌పై పైచేయగా కనిపించింది.

భారత కెప్టెన్ మైలురాళ్లు ఎన్నో!
ముంబయి: భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆటలో పలు అరుదైన మైలురాళ్లను చేరుకున్నాడు. ఒకప్పుడు సచిన్ తెండూల్కర్ మాదిరిగానే, ఇప్పుడు కోహ్లీ కూడా బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ ఏదో ఒక రికార్డును నెలకొల్పడం లేదా మైలురాయిని చేరడం ఆనవాయితీగా మారింది. టెస్టు కెరీర్‌లో 52వ టెస్టు (89వ ఇన్నింగ్స్) ఆడుతున్న అతను 15వ శతకాన్ని నమోదు చేసే క్రమంలో 4,000 పరుగులను పూర్తి చేశాడు. తక్కువ టెస్టుల్లో ఈ మైలురాయిని చేరిన ఆరో భారత బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. వీరేందర్ సెవాగ్ (79), సునీల్ గవాస్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (84), సచిన్ తెండూల్కర్ (85), మహమ్మద్ అజరుద్దీన్ (88) ఈ అంశంలో అతని కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ తన 89వ టెస్టులో నాలుగు వేల పరుగులకు చేరుకున్నాడు. కాగా, మిడ్ వికెట్ దిశగా చక్కటి షాట్ కొట్టి పరుగులు రాబట్టడం ద్వారా ఈఏడాది టెస్టుల్లో 1,000 పరుగుల మైలురాయిని దాటాడు. 2011లో రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత్ తరఫున టెస్టు ఫార్మాట్‌లో, ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒక బ్యాట్స్‌మెన్ ఈ ఫీట్ సాధించడం ఇదే మొదటిసారి. మొత్తం మీద ద్రవిడ్, కోహ్లీతోపాటు సచిన్ తెండూల్కర్ (1997) మాత్రమే ఈ విధంగా ఒక క్యాలండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించాడు. ఇలావుంటే, 28 ఏళ్ల కోహ్లీ ఈ టెస్టు సిరీస్‌లోనే 500 పరుగులను కూడా పూర్తి చేయడం విశేషం. సునీల్ గవాస్కర్ తర్వాత, ఒకే టెస్టు సిరీస్‌లో ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన భారత క్రికెటర్ కూడా కోహ్లీనే కావడం గమనార్హం. అయితే, గవాస్కర్ రెండు సార్లు (వెస్టిండీస్‌పై 1978-79 సిరీస్‌లో, ఇంగ్లాండ్‌పై 1981-82 సిరీస్‌లో) ఈ ఘనతను అందుకున్నాడు. ఈ ఏడాది 11వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 70 కంటే ఎక్కువ సగటును నమోదు చేయగలిగాడు. జానీ బెయిర్‌స్టో, జో రూట్, అలస్టర్ కుక్ మాత్రమే ఈఏడాది టెస్టుల్లో ఇంత మెరుగైన సగటును నమోదు చేయగలిగారు. ఆ ముగ్గురు ఇంగ్లాండ్ క్రికెటర్లే.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: 130.1 ఓవర్లలో 400 ఆలౌట్ (అలస్టర్ కుక్ 46, కీటన్ జెన్నింగ్స్ 112, మోయిన్ అలీ 50, జొస్ బట్లర్ 76, అశ్విన్ 6/112, రవీంద్ర జడేజా 4/109).
భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 146): లోకేష్ రాహుల్ బి మోయిన్ అలీ 24, మురళీ విజయ్ సి అండ్ బి అదిల్ రషీద్ 136, చటేశ్వర్ పుజారా బి జేక్ బాల్ 47, విరాట్ కోహ్లీ 147 నాటౌట్, కరుణ్ నాయర్ ఎల్‌బి మోయిన్ అలీ 13, పార్థీవ్ పటేల్ సి జానీ బెయిర్‌స్టో బి జో రూట్ 15, అశ్విన్ సి కీటన్ జెన్నింగ్స్ బి జో రూట్ 0, రవీంద్ర జడేజా సి జొస్ బట్లర్ బి అదిల్ రషీద్ 25, జయంత్ యాదవ్ 30 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (142 ఓవర్లలో 7 వికెట్లకు) 451.
వికెట్ల పతనం: 1-39, 2-146, 3-262, 4-279, 5-305, 6-307, 7-364.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 15-5-43-0, క్రిస్ వోక్స్ 8-2-34-0, మోయిన్ అలీ 45-5-139-2, అదిల్ రషీద్ 44-5-152-2, జాక్ బాల్ 14-5-29-1, బెన్ స్టోక్స్ 8-2-24-0, జో రూట్ 8-2-18-2.

పోటెత్తిన అభిమానులు

ముంబయి, డిసెంబర్ 10: వాంఖడే స్టేడియానికి శనివారం అభిమానులు పోటెత్తారు. అన్ని స్టాండ్స్ క్రిక్కిరిసిపోయాయి. స్థానిక ఆటగాడు ఆజింక్య రహానే గాయం కారణంగా ఈ మ్యాచ్‌లో ఆడని విషయం తెలిసిందే. కాగా, ముంబయికి చెందిన ఆటగాడు తుది జట్టులో లేకుండా ఒక మ్యాచ్ జరగడం భారత ఇదే మొదటిసారి. ముంబయికి ప్రాతినిథ్యం లేకుండా, ముంబయిలోనే జరిగే టెస్టుకు అభిమానులు భారీ సంఖ్యలో వస్తారా? లేదా? అన్న అనుమానం ఎంసిఎ అధికారులను వేధించింది. అయితే, సుమారు 22,000 మంది అభిమానులతో స్టేడియం నిండిపోయింది. గర్వారే, దివేచా, ఎంసిఎ, సునీల్ గవాస్కర్, విజయ్ మర్చంట్ స్టాండ్స్ పూర్తిగా నిండిపోయాయి. సచిన్ తెండూల్కర్ స్టాండ్‌లో ఎక్కువ మంది ఇంగ్లాండ్ జట్టు అభిమానులు కనిపించారు. ఈ స్టేడియంలో చివరిసారి టెస్టు 2013లో వెస్టిండీస్‌తో జరిగింది. సచిన్ తెండూల్కర్‌కు అది 200వ టెస్టు కావడం, దానితోనే అతను ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడం విశేషం. సుమారు మూడేళ్ల తర్వాత జరుగుతున్న టెస్టు మ్యాచ్‌కి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. స్థానిక క్రికెటర్ తుది జట్టులో లేకపోయినా పట్టించుకోకుండా టీమిండియాకు జేజేలు పలికారు. ఆదివారం కావడం, కోహ్లీ ఇంకా క్రీజ్‌లోనే ఉండడం వల్ల నాలుగోరోజు ఆటకు కూడా అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తారని ఎంసిఎ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.