క్రీడాభూమి

కోహ్లీ ‘డబుల్’.. జయంత్ సెంచరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో కదంతొక్కితే, జట్టులోకి కొత్తగా వచ్చిన ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్ శతకాన్ని నమోదు చేశాడు. అంతకు ముందు, మ్యాచ్ మూడోరోజు ఆటలో మురళీ విజయ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ముగ్గురు బ్యాట్స్‌మెన్ అద్వితీయ ప్రతిభ కనబరచడంతో, ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగు రోజు ఆటలో భారత్ 631 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. దీనితో 231 పరుగులు వెనుకబడిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించి, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 182 పరుగులు చేయగలిగింది. ఈ జట్టు ఇంకా 49 పరుగులు వెనుకబడిగా, నాలుగు వికెట్లు చేతిలో ఉన్నాయి. మరో రోజు ఆట మిగిలివున్న తరుణంలో ఇంగ్లాండ్ ఓటమి ఖాయంగా కనిపిస్తున్నది. మిగతా ఆట మొత్తాన్ని నాలుగు వికెట్లతో ఇంగ్లాండ్ నెట్టుకొచ్చి, మ్యాచ్‌ని డ్రా చేసుకున్నా, సిరీస్‌ను కోల్పోతుంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసినా, చివరిదైన చెన్నై టెస్టుతో సంబంధం లేకుండా సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 400 పరుగులకు సమాధానంగా మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 451 పరుగులు చేసిన భారత్ నాలుగో రోజు ఆటను కొనసాగించి, 605 పరుగుల వద్ద జయంత్ యాదవ్ వికెట్‌ను కోల్పోయింది. కోహ్లీతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించిన జయంత్ తన కెరీర్‌లో మొదటి సెంచరీని నమోదు చేశాడు. 204 బంతులు ఎదుర్కొన్న అతను 15 ఫోర్ల సాయంతో 104 పరుగులు సాధించి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి, వికెట్‌కీపర్ జానీ బెయిర్‌స్టో స్టంప్ చేయడంతో అవుటయ్యాడు. తర్వాతి కొద్ది సేపటికే కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ కూడా ముగిసింది. అతను 340 బంతులు ఎదుర్కొని 235 పరుగులు సాధించి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో జేమ్స్ ఆండర్సన్‌కు చిక్కాడు. కోహ్లీ స్కోరులో 25 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌కావడంతో 631 పరుగుల స్కోరువద్ద భారత్ ఆలౌటైంది. అప్పటికి ఉమేష్ యాదవ్ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 192 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. మోయిన్ అలీ, జో రూట్ చెరి రెండు వికెట్లు సాధించారు.
మొదటి ఓవర్‌లోనే వికెట్
భువనేశ్వర్ కుమార్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికే ఇంగ్లాండ్ తన రెండో ఇన్నింగ్స్‌లో మొదటి వికెట్‌ను చేజార్చుకుంది. కెరీర్‌లో తొలి టెస్టు ఆడి, మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో రాణించిన కీటన్ జెన్నింగ్స్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్‌బిగా అవుటయ్యాడు. కెప్టెన్ అలస్టర్ కుక్ 18 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 43 పరుగులు. మరో ఆరు పరుగుల తర్వాత మోయిన్ అలీ కూడా పెవిలియన్ చేరాడు. అతను మూడు బంతులు ఎదుర్కొని, పరుగుల ఖాతా తెరవకుండానే రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మురళీ విజయ్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. క్రీజ్‌లో నిలిచి, ఇంగ్లాండ్‌ను ఆదుకోవడానికి విశ్వప్రయత్నం చేసిన జో రూట్ 112 బంతుల్లో, 11 ఫోర్లతో 77 పరుగులు చేసి, చివరికి జయంత్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్‌బి అయ్యాడు. జానీ బెయిర్‌స్టోతో కలిసి అతను నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ, ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేయలేకపోయాడు. బెయిర్‌స్టో బాధ్యతంగా ఆడుతూ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే, బెన్ స్టోక్స్ 18 పరుగులు చేసి, అశ్విన్ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. జాక్ బాల్ (2)ను పార్థీవ్ పటేల్ క్యాచ్ పట్టగా అశ్విన్ అవుట్ చేశాడు. ఆరో వికెట్ కూలడంతో, అప్పటికి మరో మూడు బంతులు మాత్రమే మిగిలి ఉండడంతో, నాలుగో రోజు ఆట ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. కాగా, ఇంగ్లాండ్ ఇప్పటికీ 49 పరుగులు వెనుకంజలో ఉంది. కనీసం 50 పరుగులు చేస్తే, ఇన్నింగ్స్ ఓటమి నుంచి బయటపడుతుంది. చివరి నాలుగు వికెట్లను కాపాడుకుంటూ, చివరి వరకూ ఆలౌట్‌కాకపోతే, మ్యాచ్‌ని డ్రా చేసుకోగలుగుతుంది. కానీ, సిరీస్‌ను మాత్రం కోల్పోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే, ఇంగ్లాండ్ ఈ టెస్టును కోల్పోవడం ఖాయంగా కనిపిస్తున్నది.

* నాలుగో రోజు ఆటలో మొత్తం 362 పరుగులు నమోదయ్యాయి. మన దేశంలో జరిగిన టెస్టుల్లో, నాలుగో రోజు ఆటలో ఇది రెండో అత్యధిక స్కోరు. 2005లో పాకిస్తాన్‌తో జరిగిన కోల్‌కతా టెస్టులో నాలుగో రోజు ఆటలో 369 పరుగులు వచ్చాయి. వాటిలో 274 పరుగులు భారత్ చేయగా, మిగతా 95 పరుగులను పాకిస్తాన్ సాధించింది.
* ఈ ఇన్నింగ్స్‌లో అదిల్ రషీద్ ఏకంగా 192 పరుగులు ధారాదత్తం చేశాడు. ఇంగ్లాండ్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్లలో అతనిది మూడో స్థానం. 1987లో పాకిస్తాన్‌తో ది ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ బోథం 217 పరుగులిచ్చాడు. 1930లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఇయాన్ పీబ్లెస్ 204 పరుగులు సమర్పించుకున్నాడు. వీరిద్దరి తర్వాత, మూడో స్థానంలో అదిల్ రషీద్ ఉన్నాడు.

తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, సెంచరీ సాధించిన మొదటి భారతీయుడిగా జయంత్ యాదవ్ రికార్డు సృష్టించాడు. మొత్తం మీద టెస్టు క్రికెట్‌లో ఈ విధంగా ఎయిత్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చి శతకాన్ని నమోదు చేసిన ఏడో బ్యాట్స్‌మన్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు.

చిత్రం..సెంచరీ చేసిన జయంత్ యాదవ్