క్రీడాభూమి

నాయర్ రికార్డు ‘ట్రిపుల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 19: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత సిరీస్‌లోనే టెస్టు కెరీర్‌ను ఆరంభించి, వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన కరుణ్ నాయర్ తన మూడో టెస్టులో అనుకున్నది సాధించాడు. ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. నాటౌట్‌గా నిలిచి, భారత్ భారీ స్కోరుకు సహకరించాడు. అంతకు ముందు లోకేష్ రాహుల్ 199 పరుగులకు అవుట్‌కాగా, నాయర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగడంతో, భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లకు 759 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇదే స్కోరువద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించాడు. అప్పటికే టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 12 పరుగులు చేసింది. ఈ జట్టు ఇంకా 270 పరుగులు వెనుకంజలో ఉంది. పది వికెట్లు పదిలంగానే ఉన్నాయి. చివరి రోజు ఆటలో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయంగా కనిపిస్తున్నది.
నాలుగు వికెట్లకు 391 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఉదయం భారత్ ఆటను కొనసాగించింది. అయితే, మురళీ విజయ్ 29 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద లియామ్ డాసన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుట్ కావడంతో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అశ్విన్‌తో కలిసి నాయర్ స్కోరు బోర్డును ముందుకు దూకించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 149 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 67 పరుగులు సాధించిన అశ్విన్‌ను జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేశాడు. రవీంద్ర జడేజా 55 బంతుల్లో 51 పరుగులు చేసి, డాసన్ బౌలింగ్‌లో జాక్ బాల్‌కు చిక్కాడు. నాయర్ ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసిన తర్వాత కెప్టెన్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 381 బంతులు ఎదుర్కొని, 32 ఫోర్లు, 4 సిక్సర్లతో 303 పరుగులు సాధించిన నాయర్‌తోపాటు, ఉమేష్ యాదవ్ (1) అప్పటికి నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు స్టువర్ట్ బ్రాడ్, డాసన్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 157.2 ఓవర్లలో 477 ఆలౌట్ (జో రూట్ 88, మోయిన్ అలీ 146, జానీ బెయిర్‌స్టో 49, లియామ్ డాసన్ 66 నాటౌట్, అదిల్ రషీద్ 60, ఉమేష్ యాదవ్ 2/73, ఇశాంత్ శర్మ 2/42, రవీంద్ర జడేజా 3/106).
భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 4 వికెట్లకు 391): లోకేష్ రాహుల్ సి జొస్ బట్లర్ బి అదిల్ రషీద్ 199, పార్థీవ్ పటేల్ సి జొస్ బట్లర్ బి మోయిన్ అలీ 71, చటేశ్వర్ పుజారా సి అలస్టర్ కుక్ బి బెన్ స్టోక్స్ 16, విరాట్ కోహ్లీ సి కీటన్ జెన్నింగ్స్ బి స్టువర్ట్ బ్రాడ్ 15, కరుణ్ నాయర్ 303 నాటౌట్, మురళీ విజయ్ ఎల్‌బి లియామ్ డాసన్ 29, రవిచంద్రన్ అశ్విన్ సి జొస్ బట్లర్ బి స్టువర్ట్ బ్రాడ్ 67, రవీంద్ర జడేజా సి జాక్ బాల్ బి లియామ్ డాసన్ 51, ఉమేష్ యాదవ్ 1 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (190.4 ఓవర్లలో 7 వికెట్లకు) 759 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-152, 2-181, 3-211, 4-372, 5-435, 6-616, 7-754.
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 27-6-80-2, జాక్ బాల్ 23-2-93-0, మోయిన్ అలీ 41-1-190-1, బెన్ స్టోక్స్ 20-2-76-1, అదిల్ రషీద్ 29.4-1-153-1, లియామ్ డాసన్ 43-4-129-2, జో రూట్ 2-0-12-0, కీటన్ జెన్నింగ్స్ 5-1-20-0.

*భారత క్రికెట్ జట్టు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఏడు వందలు లేదా అంతకు మించి పరుగులు సాధించడం ఇది నాలుగోసారి. ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ ఐదో, చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడు వికెట్లకు 759 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేశాడు. 2009 డిసెంబర్ 2న శ్రీలంకతో ముంబయిలో టెస్టు ఆడుతున్నప్పుడు భారత్ తన ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 725 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 2010 జూలై 26న కొలంబోలో శ్రీలంకతో మ్యాచ్ ఆడుతూ టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 707 పరుగులు సాధించింది. 2004 జనవరి రెండున సిడ్నీలో ఆస్ట్రేలియాపై ఏడు వికెట్లకు 705 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
*ఒక సిరీస్‌లో ఆరుగురు భారత బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది నాలుగోసారి. కాగా, చివరిసారి వెస్టిండీస్‌పై 1978-79 సిరీస్‌లోనూ భారత్ తరఫున ఆరు సెంచరీలు నమోదయ్యాయి. కాగా, టాస్ ఓడినప్పటికీ, ఒక ఇన్నింగ్స్‌లో భారత్ నాలుగు వందలకుపైగా పరుగులు సాధించడం ఇది నాలుగోసారి. మరే ఇతర జట్టు ఇన్ని పర్యాయాలు టాస్ ఓడిన తర్వాత నాలుగు వందలకుపైగా స్కోర్లను సాధించలేదు.

చిత్రం..ట్రిపుల్ సెంచరీతో కదంతొక్కి, పలు రికార్డులు సృష్టించిన భారత బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్