క్రీడాభూమి

టీమిండియా ప్రస్థానం సంతృప్తికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకటిరెండు చేదు అనుభవాలను మినహాయిస్తే ఈ ఏడాది టీమిండియా ప్రస్థానం సంతృప్తికరంగానే సాగింది. స్వదేశంలో జరిగిన ఐసిసి టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకోలేకపోవడం అభిమానులను నిరాశపరచినా, మొత్తం మీద అన్ని ఫార్మాట్స్‌లోనూ భారత్ మెరుగ్గానే ఆడింది. రికార్డులు సృష్టిస్తూ కొన్ని చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది. జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్ ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లను ఆడింది. వనే్డల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఒకరిద్దరు బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకొని భారీ స్కోర్లు చేసినప్పటికీ, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో వైఫల్యాలను ఎదుర్కొంది. చివరి మ్యాచ్‌లోనూ ఓడితే 0-5 తేడాతో వైట్‌వాష్ తప్పదన్న భయం అభిమానులను వేధించింది. అయితే, యువ బ్యాట్స్‌మన్ మనీష్ పాండే జట్టును ఆదుకున్నాడు. కెరీర్‌లో తన తొలి వనే్డ సెంచరీని నమోదు చేసి, విజయాన్ని అందించి భారత్ పరువు నిలిపాడు. కాగా, టి-20 ఫార్మాట్‌లో ఎదురుదాడికి దిగిన భారత్ 3-0 తేడాతో ప్రత్యర్థిని క్లీన్‌స్వీప్ చేసింది. ఆ టూర్‌లో, వనే్డల్లో రోహిత్ శర్మ (441 పరుగులు), విరాట్ కోహ్లీ (391 పరుగులు), స్టీవెన్ స్మిత్ (315 పరుగులు) మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. టి-20 ఫార్మాట్‌లో కోహ్లీ (199 పరుగులు), షేన్ వాట్సన్ (151 పరుగులు), రోహిత్ శర్మ (143 పరుగులు) టాప్-3 స్థానాల్లో నిలిచారు.
లంకతో టి-20 సిరీస్
ఐసిసి టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు సిద్ధమయ్యేందుకు వీలుగా శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్ ఆడింది. మొదటి మ్యాచ్‌ని ఐదు వికెట్ల తేడాతో కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచి, సురీస్‌ను సొంతం చేసుకుంది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ (106 పరుగులు), దినేష్ చండీమల్ (74 పరుగులు), చామర కపుగడేర (57 పరుగులు) మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 9 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. దుష్మంత చమీర, ఆశిష్ నెహ్రా చెరి ఐదు వికెట్లు కూల్చి, సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు.
ఆసియా కప్
బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టి-20 చాంపియన్‌షిప్‌లో భారత్ విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి శుభారంభం చేసిన టీమిండియా ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కూడా మట్టికరిపించింది. మహమ్మద్ ఆమీర్ నిప్పులు చెరిగే బంతులకు సరైన సమాధానం చెప్పిన విరాట్ కోహ్లీ భారత్‌ను గెలిపించాడు. ఆతర్వాత శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) జట్లపై విజయాలను నమోదు చేసిన భారత్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో మరోసారి బంగ్లాదేశ్‌ను ఢీ కొంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి కోహ్లీ భారత్‌కు సునాయాస విజయాన్ని సాధించిపెట్టాడు.
టి-20 ప్రపంచ కప్‌లో నిరాశే
స్వదేశంలో జరిగిన టి-20 ప్రపంచ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంటుందని అభిమానులు ఆశించారు. అందుకు తగినట్టుగానే భారత్ మెరుగైన ఆటతో అందరినీ మెప్పించింది. ప్రత్యేకించి, చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి, ఐసిసి నిర్వహించే వనే్డ, టి-20 ప్రపంచ కప్స్‌లో ఆ జట్టుపై తన ఆధిక్యాన్ని మరోసారి ప్రదర్శించింది. సెమీ ఫైనల్ వరకూ దూసుకొచ్చిన భారత్‌కు అక్కడ వెస్టిండీస్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్లకు 192 పరుగుల మెరుగైన స్కోరునే సాధించగలిగింది. రోహిత్ శర్మ 43, ఆజింక్య రహానే 40 పరుగులు చేసి అవుట్‌కాగా, విరాట్ కోహ్లీ 89, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా, 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లెండన్ సిమన్స్ 82, ఆండ్రె రసెల్ 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, విండీస్‌ను గెలిపించారు. ఓపెనర్ జాస్సన్ చార్లెస్ (52) ఈ విజయంతో తన వంతు భూమిక పోషించాడు.
కళతప్పిన ఐపిఎల్
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణాలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఈ ఏడాది కళ తప్పింది. స్టేడియాలు నిండినా, ప్రేక్షకులు కేరింతలు కొడుతున్నా, గతంలో మాదిరి విపరీతమైన ఐపిఎల్ ఫీవర్ కనిపించలేదు. దీనికితోడు ముంబయిలో మ్యాచ్‌లను నిర్వహించరాదని కోర్టు నిర్ణయం ఐపిఎల్‌కు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. నీటి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఐపిఎల్ మ్యాచ్‌లకు వేలాది లీటర్ల నీటిని వాడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్‌పై ముంబయి హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఫలితంగా సెమీస్‌సహా కొన్ని కీలక మ్యాచ్‌లను ముంబయి నుంచి ఇతర కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తమయ్యే ప్రమాదం కనిపిస్తున్నది. కాగా, ఇంతకు ముందు లాగానే ఈసారి కూడా ఐపిఎల్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిక్యం కొనసాగింది. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఒక టి-20 సిరీస్‌లో నాలుగు శతకాలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. అతను మొత్తం 973 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ 848 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ జట్టు మొట్టమొదటిసారి ఈ టోర్నమెంట్ ఫైనల్ చేరింది. కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్‌ను వార్నర్ కెప్టెన్‌గా ఉన్న సన్‌రైజర్స్ ఓడించి టైటిల్‌ను అందుకుంది.
జింబాబ్వే టూర్
ఐపిఎల్ ముగిసిన తర్వాత చాలా మంది కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోగా, భారత జట్టు జింబాబ్వే టూర్‌కు వెళ్లింది. లోకేష్ రాహుల్ తన కెరీర్‌లో మొదటి వనే్డలోనే సెంచరీ సాధించాడు. ఈ ఫీట్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో సొంతం చేసుకుంది. టి-20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌ని కోల్పోయినప్పటికీ, అతి కష్టం మీద మిగతా రెండు మ్యాచ్‌లను సాధించి, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
వెస్టిండీస్ టూర్
భారత క్రికెట్ జట్టు టెస్టు వరుస టెస్టుల సిరీస్‌ల పర్వం వెస్టిండీస్ టూర్‌తో మొదలైంది. అప్పటి నుంచి ఈనెలలో చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్ వరకూ భారత్ మొత్తం 12 టెస్టులు ఆడింది. విరాట్ కోహ్లీ ఈ సిరీస్‌లోనే కెరీర్‌లో తన తొలి డబుల్ సెంచరీ చేశాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ, బౌలింగ్‌లో అశ్విన్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచారు. మొదటి టెస్టును భారత్ ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెల్చుకుంది. రెండో టెస్టు డ్రాకాగా, మూడో టెస్టు వర్షం కారణంగా రద్దయింది.
అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భారత్, వెస్టిండీస్ జట్లు టి-20 సిరీస్‌లో ఫ్లోరిడాలో ఆడాయి. హోరాహోరీగా సాగిన మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్ ఒక పరుగు తేడాతో గెల్చుకుంది. రెండో మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు.
స్వదేశంలో సిరీస్‌లు..
ఫ్లోరిడా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత స్వదేశంలో టీమిండియా సిరీస్‌లు ఆడింది. తొలుత న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తమ ఆధిపత్యాన్ని కనబరిచారు. అన్ని విభాగాల్లోనూ రాణించిన భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌కు వైట్‌వాష్ వేసింది. టెస్టుల్లో ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని మళ్లీ సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లోనే కోహ్లీ రెండో డబుల్ సెంచరీ చేశాడు. కాగా, వనే్డ సిరీస్ నువ్వా నేనా అన్న చందంగా సాగింది. మొదటి నాలుగు వనే్డల్లో చెరి రెండు మ్యాచ్‌లను సాధించిన ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. చివరి మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ 79 పరుగులకే ఆలౌటైంది. అమిత్ మిశ్రా కేవలం 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు. లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించి, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం
న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా ఆధిపత్యాన్ని కనబరచింది. టెస్టుల్లో కోహ్లీ మూడోసారి డబుల్ సెంచరీ చేయడం విశేషం. యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేసి, ఆడిన మూడో ఇన్నింగ్స్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు.