క్రీడాభూమి

పదవీచ్యుతిపై బాధ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో తన పాత్ర ముగిసిందని పదవి నుంచి ఉద్వాసనకు గురైన బిసిసిఐ కార్యదర్శి అజయ్ షిర్కే అన్నాడు. బోర్డు కార్యదర్శి పదవి నుంచి తనను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తూ సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు తనకేమీ బాధ కలిగించలేదని, తాను బాగానే ఉన్నానని ఆయన చెప్పాడు. అయితే బోర్డు పాలనా వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడినంత మాత్రాన అంతర్జాతీయ స్థాయిలో బిసిసిఐ ఖ్యాతి తగ్గరాదని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ‘బిసిసిఐ కార్యదర్శి పదవి నుంచి నన్ను తొలగించడంపై నేను ప్రతిస్పందించాల్సింది ఏమీ లేదు. సుప్రీం కోర్టు తీర్పు అదే అయితే నేను పదవి నుంచి తప్పుకోవాల్సిందే. అంతకుమించి మరో మార్గం లేదు. బిసిసిఐలో నా పాత్ర ముగిసినట్లే’ అని అజయ్ షిర్కే పేర్కొన్నాడు. తనతో పాటు బిసిసిఐ అధ్యక్ష పదవి నుంచి అనురాగ్ ఠాకూర్‌ను తొలగిస్తున్నట్లు సుప్రీం కోర్టు సోమవారం తీర్పు ఇచ్చిన కొద్ది సేపటికే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసులను బోర్డు అమలు చేసి ఉంటే ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేదా? అని షిర్కేను ప్రశ్నించగా, ఈ విషయంలో తాము మరో విధంగా వ్యవహరించేందుకు వీలు లేదన్నాడు. ‘లోధా కమిటీ సిఫారసుల విషయంలో నేను గానీ బిసిసిఐ అధ్యక్షుడు గానీ చేయగలిగింది ఏమీ లేదు. బోర్డులో ఎంతో మంది సభ్యులు ఉన్నారు. ఎప్పటికైనా ఈ సిఫారసులపై నిర్ణయం తీసుకోవాల్సింది వారే. నేనేమీ చరిత్రలోకి వెళ్లదల్చుకోలేదు. చరిత్రను నిర్ణయించేది ప్రజలే. బిసిసిఐ కార్యదర్శి పదవిపై వ్యక్తిగతంగా నాకేమీ ప్రత్యేకమైన మక్కువ లేదు. గతంలో నేను పదవికి రాజీనామా చేశా. నాకు ఇతర పనులు చాలా ఉన్నాయి. బోర్డులో ఖాళీ ఏర్పడటంతో నేను తిరిగొచ్చి ఏకగ్రీవంగా ఎన్నికయ్యా. ఇప్పుడు అది సుప్రీం కోర్టు చేతుల్లో ఉంది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల నేనేమీ ఆవేదన చెందడం లేదు. నేను బాగానే ఉన్నా’ అని షిర్కే బ్రిటన్ నుంచి టెలిఫోన్ ద్వారా తెలిపాడు.

చిత్రం..బిసిసిఐ కార్యదర్శి పదవి పోగొట్టుకున్న అజయ్ షిర్కే