క్రీడాభూమి

రిటైర్డ్ జడ్జీల ఆధ్వర్యంలో ‘మంచే’ జరుగుతుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 2: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం.లోధా నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసుల అమలును అడ్డుకుంటున్నందుకు పదవి నుంచి ఉద్వాసనకు గురైన బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. రిటైర్డ్ న్యాయమూర్తుల మార్గదర్శకత్వంలో క్రికెట్ బోర్డు పాలన మెరుగుపడుతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు భావిస్తున్నట్లయితే వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని ఆయన వ్యంగ్యాస్త్రాలను సంధించాడు. భారత క్రికెట్ బోర్డును సంస్కరించేందుకు లోధా కమిటీ చేసిన సిఫారసులను తప్పనిసరిగా అమలుచేసి తీరాలని స్పష్టం చేస్తూ గత ఏడాది జూలై 18వ తేదీన ఇచ్చిన తీర్పును పాటించడంలో బిసిసిఐ విఫలమవడంతో అనురాగ్ ఠాకూర్‌తో పాటు బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం పదవుల నుంచి తొలగించింది.
అయినప్పటికీ దేశంలో అత్యుత్తమ క్రీడా సంస్థగా బిసిసిఐ ముందుకు సాగుతుందని అనురాగ్ ఠాకూర్ అన్నాడు. ‘ఇదేమీ నా వ్యక్తిగత పోరాటం కాదు. క్రికెట్ బోర్డు స్వయం ప్రతిపత్తి కోసం చేస్తున్న పోరాటం. దేశంలోని పౌరులందరి మాదిరిగానే సుప్రీం కోర్టును నేను కూడా గౌరవిస్తా. అయితే రిటైర్డ్ జడ్డీల ఆధ్వర్యంలో బిసిసిఐకి మంచి జరుగుతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు భావిస్తున్నట్లయితే. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారి మార్గదర్శకత్వంలో భారత క్రికెట్ బోర్డు చక్కగా ముందుకు సాగుతుందని నేను విశ్వసిస్తున్నా’ అని ఆయన పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్‌ను పోస్టు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పుపై ఆయన పైవిధంగా స్పందించారు. భారత క్రికెట్‌కు మంచి జరగాలని, క్రీడలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్న తన అభిప్రాయానికి ఎప్పుడూ కట్టుబడే ఉంటానని ఆయన చెప్పారు.
గత ఏడాది మే నెలలో అనురాగ్ ఠాకూర్ బిసిసిఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందు బోర్డు సంయుక్త కార్యదర్శిగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. బిజెపి పార్లమెంట్ సభ్యుడైన ఠాకూర్ పదేళ్లు పైగా హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవ చేసే అవకాశం తనకు లభించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ఆయన చెప్పాడు.
కోర్టు ధిక్కార నేరం కింద
ఠాకూర్‌పై విచారణ
ఇదిలావుంటే, లోధా కమిటీ సిఫారసులు అమలు జరగనందుకు బిసిసిఐ అధ్యక్షుడిగా మీరు బాధ్యులు కాదా? అని అనురాగ్ ఠాకూర్‌ను సుప్రీం కోర్టు ప్రశ్నిస్తూ, కోర్టు ధిక్కార నేరం కింద ఆయనపై విచారణ ప్రారంభించింది. లోధా కమిటీ సిఫారసుల విషయమై లేఖ ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సిఇఓ డేవ్ రిచర్డ్‌సన్‌ను కోరిన అనురాగ్ ఠాకూర్ ఆ తర్వాత తాను ఆ విజ్ఞప్తి చేయలేదని తప్పుడు ప్రమాణం చేసినందుకు కోర్టు ధిక్కారం కింద విచారణను ఎదుర్కోవడంతో పాటు ఈ వ్యవహారంలో దోషిగా తేలితే జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుందని గత నెల 15వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు హెచ్చరించింది. బిసిసిఐలో కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నామినీని నియమించడమంటే క్రీడా వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని క్రికెట్ బోర్డు స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీయడమే అవుతుందని పేర్కొంటూ లేఖ ఇవ్వాలని అనురాగ్ ఠాకూర్ ఐసిసి సిఇఓను కోరిన విషయాన్ని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. సుప్రీం కోర్టు తాజాగా వెలువరించిన తీర్పునకు కట్టుబడి ఉంటామని అనురాగ్ ఠాకూర్‌తో పాటు అజయ్ షిర్కే ప్రకటించారు.

చిత్రం..వేటుకు గురైన అనురాగ్ ఠాకూర్