క్రీడాభూమి

బిసిసిఐకి మార్గదర్శి ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: పరిస్థితులు చక్కబడే వరకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ఎవరి మార్గదర్శకంలో పని చేస్తుంది? ఎవరు బోర్డును ఎవరు నడిపిస్తారు? లోధా కమిటీ చేసిన సిఫార్సులు నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యతను ఎవరు స్వీకరిస్తారు? ఈ ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, కార్యదర్శి అజయ్ షిర్కేలను సుప్రీం కోర్టు తొలగించిన తర్వాత నెలకొన్న పరిస్థితులు భారత క్రికెట్ దిశను ఎటువైపు నడిపిస్తాయోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతున్నది. బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే అర్హత తనకు లేదని మాజీ కెప్టెన్, పశ్చిమ బెంగాల్ క్రికెట్ సంఘం (కాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తేల్చిచెప్పడంతో, రేసులో ఎవరున్నారన్న ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంపై రెండు విడతలు విచారణ నిర్వహించి, నివేదికలు సమర్పించిన విశ్రాంత న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ మరోసారి కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయన్న వాదన జోరందుకుంది. భారత క్రికెట్ ప్రక్షాళనకు లోధా నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించి, పదేపదే తాము చేసిన ఆదేశాలను నిర్లక్ష్యం చేసిన ఠాకూర్, షిర్కేపై వేటు పడడంతో సుప్రీం కోర్టు తీర్పుపై సుమారు ఒకటిన్నర సంవత్సరాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అదే సమయంలో తాత్కాలిక అధ్యక్షుడు ఎవరన్న కొత్త ప్రశ్న అందరినీ వేధిస్తున్నది. బోర్డులోని ఐదుగురు ఉపాధ్యక్షులు ఉన్నారు. వీరిలో ఎవరి పేరును అధ్యక్ష పదవికి ప్రతిపాదిస్తారన్నది ఇంకా తేలలేదు. బిసిసిఐలో సెంట్రల్ జోన్ నుంచి మూడోసారి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సికె ఖన్నా, రెండోసారి ఉపాధ్యక్షుడిగా ఉన్న గౌతమ్ రాయ్ పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే, వీరిద్దరిపైనా పలు విమర్శలు ఉన్నాయి. ఖన్నాను ముద్గల్ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా అభివర్ణించగా, గౌతమ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని డెలాయిట్ దర్యాప్తు సంస్థ తేల్చిచెప్పింది. వీరిద్దరూ తమతమ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ఎన్నో దశాబ్దాలుగా వివిధ పదవుల్లో కొనసాగుతున్నారు. దీనితో వీరు కూలింగ్ ఆఫ్ పిరియడ్‌లోకి వెళ్లక తప్పదని విశే్లషకులు అంటున్నారు. మరో ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు కూడా కూలింగ్ ఆఫ్ పిరియడ్‌లోకి వెళ్లాలి. దీనితో అధ్యక్ష పదవికి బోర్డు ఎవరిని నామినేట్ చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
తెరపైకి ముద్గల్ పేరు
గతంలో ఐపిఎల్ జరిగే సమయంలో అప్పటి అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్‌ను తప్పించిన సుప్రీం కోర్టు ఆ టోర్నీని పర్యవేక్షించే బాధ్యతను సునీల్ గవాస్కర్‌కు అప్పగించింది. ఆ సమయంలోనే శివలాల్ యాదవ్ బోర్డుకు తాత్కాలిక అధ్యక్షుడిగా సేవలు అందించాడు. బోర్డు సరైన వ్యక్తిని ఎంపిక చేయలేనప్పుడు లేదా నిబంధనల ప్రకారం నడుచుకోనప్పుడు సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందనడానికి ఈ సంఘటనలే ఉదాహరణ. ఇప్పుడు కూడా సుప్రీం కోర్టు మరోసారి బోర్డు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చన్న వాదన వినిపిస్తున్నది. ఉపాధ్యక్షుల్లో చాలా మందికి బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే అర్హత లేదు. ప్రముఖంగా వినిపించిన కొంత మంది పేర్లు కూడా లోధా సిఫార్సుల్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అనర్హులుగానో లేదా కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లోకి వెళ్లేవారిగానో ఉన్నారు. ఒకవేళ తాత్కాలిక అధ్యక్షుడి పేరును బోర్డు ఖరారు చేయలేకపోతే, సుప్రీం కోర్టు ఆ బాధ్యతను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. గతంలో రెండు పర్యాయాలు ముద్గల్‌కు కీలక బాధ్యతలు అప్పచెప్పిన సుప్రీం కోర్టు మరోసారి అతనికే బోర్డు పగ్గాలను అప్పగించే అవకాశం లేకపోలేదు. మొత్తం మీద బోర్డుకు తాత్కాలిక అధ్యక్షుడు ఎవరన్నది ఆసక్తి రేపుతున్నది.

నాకు అర్హత లేదు: గంగూలీ
బోర్డు అధ్యక్ష పదవికి తాను రేసులో ఉన్నట్టు వచ్చిన వార్తలను మాజీ కెప్టెన్, కాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తోసిపుచ్చాడు. తనకు ఆ అర్హత లేదని తేల్చిచెప్పాడు. అనురాగ్ ఠాకూర్ స్థానంలో అధ్యక్షుడిగా ఎవరు ఉంటారన్న ప్రశ్న వచ్చినప్పుడు, చర్చకు వచ్చిన ఉపాధ్యక్షుల పేర్లు ఒక్కొక్కటిగా తెరపరుగవుతున్న తరుణంలో గంగూలీ పేరు ప్రధానంగా వినిపించిన విషయం తెలిసిందే. అయితే, అతను బిసిసిఐలో ఉపాధ్యక్షుడి హోదాలో లేడు. అంతేగాక, కాబ్ అధ్యక్షుడిగా అతను కేవలం ఒక ఏడాది కాలాన్ని మాత్రమే పూర్తి చేశాడు. నిబంధనలను అనుసరించి అతను మరో రెండేళ్లు కాబ్ అధ్యక్షుడిగా కొనసాగాలి. ఈ అంశాలనే గంగూలీ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. బిసిసిఐ తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టేందుకు తనకు అర్హత లేదన్నాడు.