క్రీడాభూమి

రహానే కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 12: తొలి వామప్ మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఇంగ్లాండ్ ఎలెవెన్ గురువారం నాటి రెండో వామప్ మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో చేజార్చుకుంది. ఓపెనర్ ఆజింక్య రహానే కెప్టెన్ ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఎ’ విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువ వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ తాను ధోనీకి సిసలైన వారసుడినని నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఎలెవెన్ 282 పరుగులకు ఆలౌట్‌కాగా, ఇండియా ‘ఎ’ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు జాసన్ రాయ్, అలెక్స్ హాలెస్ చక్కటి ఆరంభాన్నిచ్చే దిశగా స్కోరుబోర్డును కదిలించారు. అయితే, 42 పరుగుల వద్ద ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో హిట్‌వికెట్‌గా రాయ్ (25) అవుట్ కావడంతో ఇంగ్లాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన జానీ బెయిర్‌స్టోతో కలిసి హాలెస్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. 53 బంతులు ఎదుర్కొని 51 పరుగులు చేసిన అతనిని రహానే క్యాచ్ అందుకోగా షాబాజ్ నదీం అవుట్ చేశాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తాను ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై పెవిలియన్ చేరాడు. నదీం తన బౌలింగ్‌లోనే రిటర్న్ క్యాచ్ పట్టుకొని మోర్గాన్ వికెట్‌ను కూల్చడంతో భారత్ ‘ఎ’ మ్యాచ్‌పై పట్టు సంపాదించింది. 65 బంతుల్లో, పది ఫోర్ల సాయంతో 64 పరుగులు చేసిన టాప్ స్కోరర్ బెయిర్‌స్టో చివరికి అశోక్ దిండా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రిషభ్ పంత్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. బెన్ స్టోక్స్ (38), చివరిలో అదిల్ రషీద్ (39), డేవిడ్ విల్లే (38 నాటౌట్) కొంత వరకూ భారత్ ‘ఎ’ బౌలింగ్‌ను ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయింది. 48.5 ఓవర్లలో 282 పరుగుల వద్ద ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. భారత బౌలర్లలో పర్వేజ్ రసూల్ 38 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రదీప్ సంగ్వాన్, అశోక్ దిండా, షాబాజ్ నదీం తలా రెండు వికెట్లు సాధించారు.
ఇంగ్లాండ్ ఎలెవెన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కెప్టెన్ రహానే, షెల్డన్ జాక్సన్ బలమైన పునాది వేశారు. 18.5 ఓవర్లలో వీరు తొలి వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 56 బంతుల్లో 59 పరుగులు సాధించిన జాక్సన్‌ను బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా మోయిన్ అలీ అవుట్ చేయడంతో భారత్ ‘ఎ’ తొలి వికెట్ కూలింది. అయితే, ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్ మరింతగా చెలరేగిపోవడంతో, ఇంగ్లాండ్ బౌలర్లు నీరుగారిపోయారు. అదిల్ రషీద్ ఓవర్‌లో అలెక్స్ హాలెస్ క్యాచ్ పట్టగా 59 పరుగులు వ్యక్తిగత స్కోరువద్ద పంత్ అవుట్‌కావడంతో ఇంగ్లాండ్ ఎలెవెన్ ఊపిరి పీల్చుకుంది. కానీ, సెంచరీ పూర్తి చేసే ఊపుమీద కనిపించిన రహానే, సెకండ్ డౌన్ ఆటగాడు సురేష్ రైనా భారత్ ‘ఎ’ను విజయం దిశగా నడిపించారు. రహానే 83 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 91 పరుగులు చేసి, సెంచరీ పూర్తికాకుండానే దురదృష్టవశాత్తు డేవిడ్ విల్లే బౌలింగ్‌లో అవుటయ్యాడు. 34 బంతుల్లో 45 పరుగులు చేసిన రైనాను అలెక్స్ హాలెస్ క్యాచ్ అందుకోగా, జాక్ బాల్ పెవిలియన్‌కు పంపాడు. చివరిలో దీపక్ హూడా (23), ఇషాన్ కిషన్ (5) మరో వికెట్ కూలకుండా జట్టుకు విజయాన్ని అందించారు. ఇంకా 62 బంతులు మిగిలి ఉండగానే భారత్ ‘ఎ’ విజయభేరి మోగించడం విశేషం.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ ఎలెవెన్: జాసన్ రాయ్ హిట్ వికెట్ ప్రదీప్ సంగ్వాన్ 25, అలెక్స్ హాలెస్ సి ఆజింక్య రహానే బి షాబాజ్ నదీం 51, జానీ బెయిర్‌స్టో సి రిషభ్ పంత్ బి అశోక్ దిండా 64, ఇయాన్ మోర్గాన్ సి అండ్ బి షాబాజ్ నదీం 0, బెన్ స్టోక్స్ సి ఇషాన్ కిషన్ బి పర్వేజ్ రసూల్ 38, జొస్ బట్లర్ సి అండ్ బి పర్వేజ్ రసూల్ 0, మోయిన్ అలీ సి రిషభ్ పంత్ బి అశోక్ దిండా 1, క్రిస్ వోక్స్ బి పర్వేజ్ రసూల్ 16, అదిల్ రషీద్ సి రిషభ్ పంత్ బి ప్రదీప్ సంగ్వాన్ 39, లియామ్ ప్లంకెట్ సి రిషభ్ పంత్ బి సిద్ధార్థ్ కౌల్ 8, డేవిడ్ విల్లే నాటౌట్ 38, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (48.5 ఓవర్లలో ఆలౌట్) 282.
వికెట్ల పతనం: 1-42, 2-116, 3-116, 4-163, 5-165, 6-190, 7-190, 8-198, 9-211, 10-282.
బౌలింగ్: ప్రదీప్ సంగ్వాన్ 6.5-0-64-2, సిద్ధార్థ్ కౌల్ 6-0-31-1, అశోక్ దిండా 8-1-55-2, షాబాజ్ నదీం 10-0-41-2, వినయ్ కుమార్ 7-1-47-0, పర్వేజ్ రసూల్ 10-1-38-3, దీపక్ హూడా 1-0-6-0.
భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: ఆజింక్య రహానే బి డేవిడ్ విల్లే 91, షెల్డన్ జాక్సన్ సి జానీ బెయిర్‌స్టో బి మోయిన్ అలీ 59, రిషభ్ పంత్ సి అలెక్స్ హాలెస్ బి అదిల్ రషీద్ 59, సురేష్ రైనా సి అలెక్స్ హాలెస్ బి జాక్ బాల్ 45, దీపక్ హూడా 23 నాటౌట్, ఇషాన్ కిషన్ 5 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 1, మొత్తం (39.4 ఓవర్లలో 4 వికెట్లకు) 283.
వికెట్ల పతనం: 1-119, 2-197, 3-233, 4-268.
బౌలింగ్: క్రిస్ వోక్స్ 7-1-54-0, డేవిడ్ విల్లే 5-0-32-1, జాక్ బాల్ 6-0-46-1, బెన్ స్టోక్స్ 4.4-0-30-0, అదిల్ రషీద్ 7-0-51-1, మోయిన్ అలీ 7-0-46-1, లియామ్ ప్లంకెట్ 3-0-24-0.

చిత్రం..రహానే (83 బంతుల్లో 91 పరుగులు)