క్రీడాభూమి

ఇంగ్లాండ్ ఖాతాలో చివరి వనే్డ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జనవరి 22: వనే్డ సిరీస్‌లో వైట్‌వాష్ వేయించుకునే ప్రమాదం నుంచి ఇంగ్లాండ్ బయటపడింది. భారత్‌తో ఆదివారం జరిగిన చివరి, మూడో వనే్డను ఐదు పరుగుల తేడాతో గెల్చుకొని, పరువు నిలబెట్టుకుంది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి వరకూ పోరాడినప్పటికీ, ఐదు పరుగుల తేడాతో మ్యాచ్‌ని కోల్పోయినప్పటికీ, టీమిండియా ఈ సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కేదార్ జాదవ్ చివరి వరకూ కొనసాగించిన పోరాటం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది.
రాయ్ కీలక ఇన్నింగ్స్
బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండడంతో, ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించే సత్తా ఉందన్న నమ్మకంతో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆహ్వానంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్ జాసన్ రాయ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి వికెట్‌కు 98 పరుగులు జత కలిసిన తర్వాత సాబ్ బిల్లింగ్స్‌ను జస్‌ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టగా రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 58 బంతులు ఎదుర్కొన్న బిల్లింగ్స్ 35 పరుగులు చేశాడు. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జానీ బెయిర్‌స్టో కూడా బాధ్యతాయుతంగా ఆడగా, 56 బంతుల్లో, పది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 65 పరుగులు చేసిన రాయ్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో, సెకండ్ డౌన్‌లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ క్రీజ్‌లోకి వచ్చాడు. అతను 44 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేశాడు. విధ్వంసకారిగా మారుతున్న అతనిని జస్‌ప్రీత్ బుమ్రా క్యాచ్ పట్టగా, హార్దిక్ పాండ్య పెవిలియన్‌కు పంపాడు. జొస్ బట్లర్ 11 పరుగులు చేసి హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో లోకేష్ రాహుల్‌కు దొరికిపోయాడు. తర్వాత కొద్ది సేపటికే బెయిర్‌స్టో వికెట్ కూలింది. 64 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 56 పరుగులు చేసిన అతను హార్దిక్ పాండ్య బౌలింగ్‌లోనే రవీంద్ర జడేజాకు చిక్కాడు. లోయల్ మిడిల్ ఆర్డర్‌లో బెన్ స్టోక్స్ విజృంభణతో ఇంగ్లాండ్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. మోయిన్ అలీ రెండు పరుగులకే అవుట్‌కాగా, క్రిస్ వోక్స్ 19 బంతుల్లోనే 34 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి లియామ్ ప్లంకెట్ (1) రనౌటయ్యాడు. ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 321 పరుగులు సాధించగా, అప్పటికి బెన్ స్టోక్స్ క్రీజ్‌లో ఉన్నాడు. అతను 39 బంతులు ఎదుర్కొని 57 పరుగులు సాధించాడు. ఈ స్కోరులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. భారత బౌలర్ హార్దిక్ పాండ్యకు మూడు వికెట్లు లభించాయి. రవీంద్ర జడేజా రెండు వికెట్లు కూల్చాడు.
రహానే విఫలం
వనే్డల్లో రాణించలేడన్న విమర్శలు ఎదుర్కొంటున్న ఆజింక్య రహానే ఈ మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. 322 పరుగుల లక్ష్యాన్ని అందుకొని, ఇంగ్లాండ్‌కు వైట్‌వాష్ వేయాలన్న ఉత్సాహంతో ఉన్న టీమిండియాకు 13 పరుగుల స్కోరువద్ద తొలి దెబ్బ తగిలింది. డేవిడ్ విల్లే వేసిన బంతిని అర్థం చేసుకోలేక రహానే (1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. 11 బంతులు ఎదుర్కొన్న అతను 11 పరుగులు చేసి, జాక్ బాల్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ జొస్ బట్లర్ క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. 63 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 55 పరుగులు చేసిన కోహ్లీని జొస్ బట్లర్ చక్కటి క్యాచ్ అందుకోగా బెన్ స్టోక్స్ అవుట్ చేయడంతో రన్‌రేట్ కొద్దిగా మందగించింది. యువరాజ్ సింగ్ 57 బంతులు ఎదుర్కొని, 45 పరుగులు చేశాడు. జట్టు స్కోరు 133 పరుగుల వద్ద అతను లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో శామ్ బిల్లింగ్స్‌కు దొరికాడు. రెండో టెస్టులో యువీతో పాటు సెంచరీ చేసిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 25 పరగులకే వెనుదిరిగాడు. జాక్ బాల్ బౌలింగ్‌లో అతను జొస్ బట్లర్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఈ దశలో కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య టీమిండియా పోరాటాన్ని కొనసాగించారు. ఇంగ్లాండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు ఆరో వికెట్‌కు 104 పరుగులు జోడించి, విజయంపై ఆశలు పెంచారు. జాదవ్‌కు చక్కటి మద్దతునిస్తూ, 43 బంతుల్లో 56 పరుగులు చేసిన పాండ్య ఒక భారీ షాట్‌కు ప్రయత్నించి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అతని స్కోరులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అశ్విన్ కేవలం ఒక పరుగు చేసి, బెన్ స్టోక్స్ బౌలింగ్‌లోనే క్రిస్ వోక్స్‌కు చిక్కాడు. చివరిలో సరైన సహాకారం అందించే వారు కరవుకాగా, ఇన్నింగ్స్ ముగిసేందుకు మరో బంతి మిగిలి ఉండగా జాదవ్ అవుటయ్యాడు. అతను 75 బంతుల్లో, 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 90 పరుగులు చేసి, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో డీప్ పాయింట్ దిశగా షాట్ కొట్టి, బిల్లింగ్స్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. చివరి బంతిని భువనేశ్వర్ కుమార్ రక్షణాత్మకంగా ఆడడంతో, భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 316 పరుగులు చేయగలిగింది.
బెన్ స్టోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా కేదార్ జాదవ్ ఎంపికయ్యాడు.

చివరి
ఆ రెండు ఓవర్లు
కోల్‌కతా: చివరి రెండు ఓవర్లలో భారత్ విజయానికి 23 పరుగుల దూరంలో నిలిచింది. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న కేదార్ జాదవ్ క్రీజ్‌లో ఉండడంతో, టీమిండియా గెలుపు సాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమైంది. జాక్ బాల్ వేసిన ఓవర్‌లో మొదటి రెండు బంతులను రక్షణాత్మకంగా ఆడిన జాదవ్ మూడో బంతిని ఫోర్‌గా మార్చాడు. నాలుగు బంతి డాట్ బాల్‌కాగా, ఐదో బంతిలో రెండు పరుగులు చేశాడు. నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో భువనేశ్వర్ కుమార్ ఉండడంతో, విన్నింగ్ షాట్ కొట్టే బాధ్యతను తానే స్వీకరించే ఉద్దేశంతో చివరి బంతిలో సింగిల్ తీశాడు. మొత్తం మీద ఆ ఓవర్‌లో ఏడు పరుగులు లభించగా, చివరి ఓవర్‌లో భారత్‌కు 16 పరుగులు అవసరమయ్యాయి. క్రిస్ వోక్స్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిలోనే సిక్స్ కొట్టిన జాదవ్ రెండో బంతిని ఫోర్‌గా మార్చాడు. రెండు బంతుల్లో పది పరుగులు లభించడంతో భారత్ విజయానికి నాలుగు బంతుల్లో ఆరు పరుగుల దూరంలో నిలిచింది. అయితే, ఆతర్వాతి రెండు బంతుల్లో వోక్స్ ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉన్న జాదవ్ ఐదో బంతిని డీప్ పాయింట్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అయితే, బంతి సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో, అక్కడే పొంచివున్న శామ్ బిల్లింగ్స్ క్యాచ్ పట్టి, జాదవ్‌ను అవుట్ చేశాడు. దీనితో చివరి బంతిలో ఆరు పరుగులు అవసరమయ్యాయి. భువీ ఆ బంతిని డిఫెన్స్‌గా ఆడడంతో, భారత్ ఐదు పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ బి రవీంద్ర జడేజా 65, శామ్ బిల్మింగ్స్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి రవీంద్ర జడేజా 35, జానీ బెయిర్‌స్టో సి రవీంద్ర జడేజా బి హార్దిక్ పాండ్య 56, ఇయాన్ మోర్గాన్ సి జస్‌ప్రీత్ బుమ్రా బి హార్దిక్ పాండ్య 43, జొస్ బట్లర్ సి లోకేష్ రాహుల్ బి హార్దిక్ పాండ్య 11, బెన్ స్టోక్స్ 57 నాటౌట్, మోయిన్ అలీ సి రవీంద్ర జడేజా బి జస్‌ప్రీత్ బుమ్రా 2, క్రిస్ వోక్స్ రనౌట్ 34, లియామ్ ప్లంకెట్ రనౌట్ 1, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 321.
వికెట్ల పతనం: 1-98, 2-110, 3-194, 4-212, 5-237, 6-246, 7-319, 8-321.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 8-0-56-0, హార్దిక్ పాండ్య 10-1-49-3, జస్‌ప్రీత్ బుమ్రా 10-1-68-1, యువరాజ్ సింగ్ 3-0-17-0, రవీంద్ర జడేజా 10-0-62-2, రవిచంద్రన్ అశ్విన్ 9-0-60-0.
భారత్ ఇన్నింగ్స్: ఆజింక్య రహానే బి డేవిడ్ విల్లే 1, లోకేష్ రాహుల్ సి జొస్ బట్లర్ బి జాక్ బాల్ 11, విరాట్ కోహ్లీ సి జొస్ బట్లర్ బి బెన్ స్టోక్స్ 55, యువరాజ్ సింగ్ సి శామ్ బిల్లింగ్స్ బి లియామ్ ప్లంకెట్ 45, మహేంద్ర సింగ్ ధోనీ సి జొస్ బట్లర్ బి జాక్ బాల్ 25, కేదార్ జాదవ్ సి శామ్ బిల్లింగ్స్ బి క్రిస్ వోక్స్ 90, హార్దిక్ పాండ్య బి బెన్ స్టోక్స్ 56, రవీంద్ర జడేజా సి జానీ బెయర్‌స్టో బి క్రిస్ వోక్స్ 10, రవిచంద్రన్ అశ్విన్ సి క్రిస్ వోక్స్ బి బెన్ స్టోక్స్ 1, భువనేశ్వర్ కుమార్ 0 నాటౌట్, జస్‌ప్రీత్ బుమ్రా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 22, మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 316.
వికెట్ల పతనం: 1-13, 2-37, 3-102, 4-133, 5-173 6-277, 7-291, 8-297, 9-316.
బౌలింగ్: క్రిస్ వోక్స్ 10-0-75-2, డేవిడ్ విల్లే 2-0-8-1, జాక్ బాల్ 10-0-56-2, లియామ్ ప్లంకెట్ 10-0-65-1, బెన్ స్టోక్స్ 10-0-63-3, మోయన్ అలీ 8-0-41-0.

చిత్రం..భారత్ విజయానికి కడ వరకూ పోరాడి విఫలమైన కేదార్ జాదవ్