క్రీడాభూమి

ఫేవరిట్ సెరినా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 27: సోదరి వీనస్ విలియమ్స్‌పై ఫేవరిట్‌గా శనివారం జరిగే ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో సెరెనా విలియమ్స్ బరిలోకి దిగనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె రెండో స్థానంలో ఉండగా, వీనస్‌ది 17వ స్థానం. అంతేగాక, ఇప్పటి వరకూ ఇద్దరూ పరస్పరం 27 పర్యాయాలు ఢీ కొంటే, సెరెనా 16 విజయాలు సాధించింది. వీనస్ 11 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇటీవల కాలంలో సెరెనాను వీనస్ ఓడించిన సందర్భాలు లేవు. ఇలావుంటే, 35, 36 సంవత్సరాల వయసు ఉన్న ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్ల మధ్య జరిగే ఫైనల్ పోరు కోసం సహజంగానే ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీనస్ 14 సంవత్సరాల క్రితం ఇక్కడ ఫైనల్ చేరింది. సెరెనా నిరుడు ఫైనల్ చేరినప్పటికీ, ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది. 1998లో మొట్టమొదటిసారి ఒకరితో ఒకరు ఢీకొన్న వీనస్, సెరెనాలకు ఒకరి ఆట గురించి మరొకరికి క్షుణ్ణంగా తెలుసు. ఇద్దరూ అక్కాచెల్లెళ్లు కావడం, చిన్నతనం నుంచి ఒకే దగ్గర ప్రాక్టీస్ చేయడం, ఇద్దరూ కలిసే టోర్నీల్లో పాల్గొనడం వీరి మధ్య సాన్నిహిత్యాన్ని మరింత పెంచింది. ఫలితంగా, ఒకరి బలాబలాలపై మరొకరికి స్పష్టమైన అవగాహన ఉంది. అయితే, గెలిచిన వారు కేరింతలు కొట్టాల్సిన పనిగానీ, ఓడిన వారు నీరుగారిపోయే పరిస్థితిగానీ లేకపోవడం వీరి మధ్య జరిగే మ్యాచ్ ప్రత్యేకత. వీరిద్దరి మధ్య జరిగే పోరులో ఒకరు వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిస్తే, ఒక మ్యాచ్‌లో మరొకరు గెలవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదే ఒరవడి కొనసాగితే మాత్రం, గత రెండు మ్యాచ్‌ల్లో వీనస్‌పై గెలిచిన సెరెనాకు శనివారం నాటి యుద్ధంలో ఓటమి తప్పకపోవచ్చు. కానీ, గణాంకాలను పరిశీలించినా, బలబలాలను బేరీజు వేసుకున్నా వీనస్‌పై సెరెనాదే పైచేయిగా కనిపిస్తున్నది.
వీనస్ కెరీర్‌లో ఏడు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించినా ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెల్చుకోలేదు. 2003లో ఒకసారి ఆమె ఫైనల్ చేరినా, రన్నరప్‌గానే నిలిచింది. ఐదు పర్యాయాలు వింబుల్డన్, రెండుసార్లు యుఎస్ ఓపెన్‌ను సాధించిన ఆమె 2002లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిందిగానీ టైటిల్ కైవసం చేసుకోలేకపోయింది. ఫ్రెంచ్ ఓపెన్‌తోపాటు అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఆస్ట్రేలియా ఓపెన్‌ను ఈసారి వీనస్ గెల్చుకుంటుందా అన్నది అనుమానంగానే ఉంది. పైగా, చివరిసారి ఆమె గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను తొమ్మిదేళ్ల క్రితం సాధించింది. ఆతర్వాత ఇప్పటి వరకూ ఆమె అదే స్థాయిలో ఆడలేకపోయింది. ఇనే్నళ్లకు మరోసారి గ్రాండ్ శ్లామ్ ఫైనల్ చేరిన ఆమె ఈ అవకాశాన్ని ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. చాలాకాలం తర్వాత వీరి మధ్య జరిగే పోరు ఆసక్తిని రేపుతున్నది.
స్ట్ఫెని అధిగమించడమే లక్ష్యం!
మహిళల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్టు రికార్డు సృష్టించింది. ఆమె ఖాతాలో 24 టైటిళ్లు ఉన్నాయి. స్ట్ఫె గ్రాఫ్, సెరెనా చెరి 22 టైటిళ్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. శనివారం నాటి ఫైనల్‌లో వీనస్‌ను ఓడించడం ద్వారా ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెలిచి, స్ట్ఫెని అధిగమించడమే సెరెనా లక్ష్యంగా ఎంచుకుంది. శనివారం ఆమె విజేతగా నిలిస్తే, స్ట్ఫెని మూడో స్థానానికి నెట్టి, తాను రెండో స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ ఏడాది జరిగే మిగతా మూడు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో విజయాలను నమోదు చేసి మార్గరెట్ రికార్డును అధిగమించే ఆత్మవిశ్వాసం ఆమెకు లభిస్తుంది. ఆమె అదే ప్రయత్నం చేయడం ఖాయం.

చాలాకాలం తర్వాత ఒక గ్రాండ్ శ్లామ్ టోర్నీలో ఫైనల్ చేరిన వీనస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. గణాంకాలను పరిశీలిస్తే, సెరెనా కంటే వెనుకబడి ఉన్నప్పటికీ, టైటిల్‌ను అందుకునే సత్తా ఆమెకు లేకపోలేదు. ఒకవేళ ఫైనల్‌లో గెలిస్తే, మార్టినా నవ్రతిలోవా తర్వాత గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించిన ఎక్కువ వయసుగల క్రీడాకారిణిగా వీనస్ రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదిస్తుంది.

సెరెనా విలియమ్స్ కెరీర్‌లో 22 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకొని, మరో టైటిల్ కోసం పోరాడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఆమె మళ్లీ నంబర్ వన్ స్థానంలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తున్నది. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ ఆమె అద్వితీయ ప్రతిభాపాటవాలు కనబరుస్తూ, ఫైనల్ చేరింది. ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ టైటిల్‌కు చేరువైన సెరెనాకు ఫైనల్‌లో తన సోదరి వీనస్ ఎదురుకావడం ఒక రకంగా ఆనందం కలిగించి ఉండొచ్చు. గెలిస్తే ఆమె ఖాతాలో మరో గ్రాండ్ శ్లామ్ టైటిల్ చేరుతుంది. అంతేగాక, స్టెఫీ గ్రాఫ్‌ను అధిగమించి, ఆల్‌టైమ్ గ్రేట్ జాబితాలో రెండో స్థానానికి చేరుతుంది. ఓడినా, తన అక్క చేతిలో ఓడానన్న సంతృప్తి మిగులుతుంది. విలియమ్స్ కుటుంబ పోరుగా మారిన ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల ఫైనల్ ఆసక్తి రేపుతున్నది. అందరి దృష్టీ ఈ మ్యాచ్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

చిత్రం..చెల్లెలు సెరెనాతో తుది పోరుకు సిద్ధంగా ఉన్న వీనస్ విలియమ్స్