క్రీడాభూమి

‘ఆస్ట్రేలియా’ క్వీన్ సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 28: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ మహిళల సింగిల్స్ సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఆమె ఈ విజయంతో మళ్లీ నంబర్ వన్‌గా ఎదిగింది. సోమవారం అధికారికంగా ప్రకటించే ర్యాంకింగ్స్‌లో ఆమె తన స్థానాన్ని తిరిగి సంపాదిస్తుంది. ‘విలియమ్స్’ ఇంటి పోరుగా మారిన శనివారం నాటి ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌లో సెరెనా తనకంటే 14 నెలలు పెద్దదైన తన సోదరి వీనస్‌ను 6-4, 6-4 తేడాతో ఓడించింది. నిరుడు ఫైనల్ చేరినప్పటికీ, ఏంజెలిక్ కెర్బర్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్ ట్రోఫీకి పరిమితమైన ఆమె ఈసారి తన అక్కకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, మ్యాచ్ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగింది. ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా, ఆటపైనే దృష్టి కేంద్రీకరించిన ఆమె చేసిన పొరపాట్లు చాలా తక్కువ. కాగా, వీనస్ ఆట అందుకు భిన్నంగా కొనసాగింది. ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒక గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకునే అవకాశం రావడంతో ఆమె తీవ్రమైన ఒత్తిడికి గురైంది. అంతేగాక, ప్రత్యర్థి సెరెనా కావడంతో వీనస్ తడబాటు స్పష్టంగా కనిపించింది. పదేపదే పొరపాట్లు చేసి, ఓటమిని కొనితెచ్చుకుంది. నరాలు చిట్లిపోయే స్థాయిలో హోరాహోరీగా సాగుతుందని అనుకున్న మ్యాచ్ చివరికి దాదాపు ఏకపక్ష పోరుగా మారింది. సెరెనా తన ఆధిక్యాన్ని నిరూపించుకుంటూ కెరీర్‌లో ఏడోసారి ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీని అందుకుంది.

వీనస్, సెరెనా అక్కాచెల్లెళ్లేగాక, టెన్నిస్ కోర్టులో చిరకాల ప్రత్యర్థులు కూడా కావడంతో, వీరి మధ్య జరిగిన పోరు ఆసక్తిని రేపింది. 36 ఏళ్ల వీనస్‌ను వరుస సెట్లలో ఓడించిన 35 ఏళ్ల సెరెనా కెరీర్‌లో 23వ గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిల్ సాధించింది. ఇంత వరకూ 22 టైటిళ్లతో స్ట్ఫె గ్రాఫ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్న ఆమె తాజా విజయంతో మార్గరెట్ కోర్ట్ రికార్డుకు చేరువైంది. స్ట్ఫెని మూడో స్థానానికి నెట్టేసిన సెరెనా, ‘ఆల్‌టైం రికార్డు’ దిశగా మరో అడుగు ముందుకేసింది. మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో అత్యధిక విజయాల జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించగా, సెరెనా 23 టైటిళ్లతో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. ఈ ఏడాది మరో మూడు గ్రాండ్ శ్లామ్ టోర్నీలు జరగనుండగా, మార్గరెట్ కోర్ట్ రికార్డును సెరెనా అధిగమించే అవకాశాలున్నాయి.

చిత్రాలు..ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీతో సెరెనా విలియమ్స్ హొయలు
*చెల్లెలు సెరెనా చేతిలో ఓడిన ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్