క్రీడాభూమి

గాయాలతోనే ఆడాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: గాయాలతో బాధపడుతూ దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో ఆడాలా అంటూ భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) అధికారులపై స్టార్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. శాగ్ నుంచి తనను మినహాయించాలని కోరుతూ బాయ్‌తోపాటు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు కూడా తాను లేఖలు రాశానని మంగళవారం పిటిఐతో మాట్లాడుతూ కశ్యప్ చెప్పాడు. కానీ, ఎవరూ సానుకూలంగా స్పందించలేదని వాపోయాడు. అంతేగాక, శాగ్‌లో పాల్గొనాలని కోరుతూ గౌహతికి విమానం టికెట్లు పంపారని చెప్పాడు. పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నందువల్లే తాను ఈ సీజన్‌లో ఏడు టోర్నీలకు దూరమయ్యానని అన్నాడు. రియో డి జెనీరోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించేందుకు తనకు 12 వారాల సమయం మాత్రమే ఉందని ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఒకప్పుడు 8వ స్థానంలో ఉన్నప్పటికీ, తాజాగా 12వ స్థానానికి పడిపోయిన కశ్యప్ అన్నాడు. ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)తోపాటు లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రీలో తాను ఆడానని తెలిపాడు. లక్నో టోర్నీలో ఆడుతున్న సమయంలోనే పొత్తికడుపు కండరాల సమస్య తిరగబెట్టిందని చెప్పాడు. తన సమస్యను వివరిస్తూ బాయ్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడమేగాక, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్‌ను స్వయంగా కలిసి వివరించానని అన్నాడు. కానీ, ఫలితం దక్కలేదని 29 ఏళ్ల కశ్యప్ చెప్పాడు.
ఏం చేయాలి?
ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని కశ్యప్ వాపోయాడు. ‘స్వదేశంలో జరుగుతున్న శాగ్‌లో అత్యుత్తమ జట్లు ఆడాలన్నది ప్రభుత్వ ఆలోచన. నిజమే. కానీ, నాది ప్రత్యేక కేసు. ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు నాకు 12 వారాల సమయం మాత్రమే ఉంది. వీటిలో ఏడు వారాలు ఆటకు, ఐదు వారాలు శిక్షణకు ఉపయోగించుకోవాలి. ఇంత తక్కువ సమయంలో ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడం చాలా కష్టమైన విషయం. దీనికి తోడు శాగ్‌లో పాల్గొనడం దాదాపు అసాధ్యం. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. శాగ్‌లో పాల్గొన్నప్పుడు ఒకవేళ నా గాయం మళ్లీ మొదటికొస్తే, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాలన్న నా ప్రయత్నం వృథా అవుతుంది. అధికారులేమో నాకు టికెట్లు కూడా పంపి, తప్పనిసరిగా పాల్గొనాలంటూ పరోక్షంగా సంకేతాలు అందించారు. ఎటూ తేల్చుకోలేని సంకట స్థితిని ఎదుర్కొంటున్నాను’ అన్నాడు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ బాడ్మింటన్ ఆడుతున్నప్పుడు కాలి పిక్క కండరాలు చిట్లడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నానని కశ్యప్ తెలిపాడు.
ర్యాంకింగ్స్ కీలకం
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత సంపాదించలంటే ప్రపంచ ర్యాంకింగ్స్ అత్యంత కీలకమవుతాయి. ఈఏడాది మే మాసం చివరి నాటికి ఉన్న ర్యాంకుల జాబితా ఆధారంగా ఒలింపిక్స్‌లో పాల్గొనే ఆటగాళ్లను ఖరారు చేస్తారు. దీనితో అతి తక్కువ సమయంలో కశ్యప్ అంతర్జాతీయ ఈవెంట్స్‌లో అద్భుత ఫలితాలను రాబట్టాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అతను ప్రస్తావిస్తూ, చాలా మంది గత ఏడాది మొత్తం ఏదో ఒక టోర్నీని ఆడుతునే ఉన్నారని, తాను మాత్రం చాలా టోర్నీలకు దూరమయ్యానని చెప్పాడు. ఇక ముందు జరిగే జర్మన్ ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్, స్విస్ ఓపెన్ వంటి టోర్నీల్లో గొప్పగా రాణిస్తేనే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించగలుగుతానని అన్నాడు. వీటితోపాటు ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ టోర్నీలు కూడా ఉంటాయన్నాడు. ఫిట్నెస్ సమస్యలు లేకుండా ఈ టోర్నీల్లో ఆడే పరిస్థితిలో తనను ఉంచాల్సిందిగా భవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.
బిజీ షెడ్యూల్
భారత షట్లర్ల కోసం బిజీ షెడ్యూల్ ఎదురుచూస్తున్నది. శాగ్‌లో బాడ్మింటన్ టీం ఈవెంట్ ఈనెల 6, 7 తేదీల్లో జరుగుతుంది. 8వ తేదీ ఉదయం సెమీ ఫైనల్, రాత్రి ఫైనల్ మ్యాచ్‌లు ఉంటాయి. 9, 10 తేదీల్లో పురుషులు, మహిళల సింగిల్స్ విభాగాల్లో పోరు సాగుతుంది. చివరిసారి, 2010లో బంగ్లాదేశ్ ఆతిథ్యమిచ్చిన శాగ్‌లో పాల్గొన్న భారత్ పురుషులు, మహిళల విభాగాల్లో కలిసి 7 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. మరోసారి అలాంటి ప్రదర్శననే ప్రభుత్వం కోరుకుంటున్నది. అయితే, ఈనెల 15 నుంచి 21వ తేదీ వరకు బాడ్మింటన్ ఆసియా టీం చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. ఈ పోటీలకు సిద్ధమయ్యేందుకు ప్రాక్టీస్ కొనసాగించాల్సిన తమకు శాగ్‌లో పాల్గొనడం సాధ్యం కాదని సైనా నెహ్వాల్, పివి సింధు వంటి స్టార్లు స్పష్టం చేశారు. శాగ్ నుంచి తమను తప్పించాల్సిందిగా కోరారు. కానీ, అత్యుత్తమ బృందాలనే పంపాలంటూ కేంద్రం ఇటీవలే అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలను ఆదేశించింది. అందుకే, సైనా, సింధుతోపాటు ప్రత్యేక కేసుగా పరిగణించాలన్న కశ్యప్ విజ్ఞప్తిని కూడా బాయ్ పట్టించుకోలేదు. శాగ్‌లో ఆడేది లేదంటున్న షట్లర్ల పట్టుదలే నెగ్గుతుందో లేక ప్రభుత్వానిదే పైచేయి అవుతుందో చూడాలి.