క్రీడాభూమి

భారత జట్టు భళా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె, ఫిబ్రవరి 21: మైదానంలోపల,బైటా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత భారత క్రికెట్ జట్టు స్వయంసమృద్ధంగా మారుతుండడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అంటూ, ఇలాంటి జట్టుతో కలిసి పని చేయడం తన అదృష్టమన్నాడు.‘గత పది నెలలుగా ఈ యువ క్రికెటర్లతో కలిసి పని చేసే అవకాశం నాకు లభించింది. ఈ జట్టు ఎంతో ఎదగడం, పరిస్థితులను అర్థం చేసుకుని పరిష్కారాలను కూడా వెతుక్కోవడం ఎంతో బాగుంది. ఏ జట్టయినా స్వయం సమృద్ధం కావాలని, సలహా కోసం ఇతరుల వైపు చూడకుండా ఉండాలని ఏ కోచ్ అయినా కోరుకుంటాడు’ అని గురువారంనుంచి ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కుంబ్లే అన్నాడు. మైదానంలోపల, అలాగే వెలుపల ఎదురయ్యే సమస్యలకు ఆటగాళ్లే పరిష్కారాలు కనుగొనే వాతావరణాన్ని సృష్టించడానికి తాను ప్రయత్నించానని కూడా ఆయన అన్నాడు.
టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచిన రవిచంద్రన్ అశ్విన్‌లాంటి ఆటగాళ్లను కూడా కుంబ్లే ప్రశంసించాడు. జట్టులో కొంతమంది 40-45 టెస్టులు మాత్రమే ఆడారు. కోహ్లీ మాత్రం 50కి పైగానే టెస్టులు ఆడాడు. కొంతమంది వ్యక్తిగతంగా ఘనతలు సాధించారు. రవిచంద్రన్‌లాంటి వాళ్లు రికార్డులు కూడా సృష్టించారు. అది నిజంగా అద్భుతమేనని ఆయన అన్నాడు. ఇలాంటి వాళ్లు జట్టులో ఉండడం నిజంగా ఎంతో మంచిదని, వీళ్లందరితో కలిసి పని చేసే అవకాశం తనకు లభించడం వరంగా భావిస్తున్నట్లు కుంబ్లే చెప్పాడు.
సొంత గడ్డపై ఆడేటప్పుడు కూడా భారత జట్టులో 16 మంది ఆటగాళ్లు ఉండడం గురించి అడగ్గా, గాయాలులాంటి ఏదయినా అనుకోని సమస్య ఎదురయినప్పుడు సర్దుబాటు చేసుకోవడం కోసం ఇలా 16 మందిని ఎంపిక చేశామని కుంబ్లే చెప్పాడు. ఒక జట్టుగా కలిసి ముందుకు సాగే జట్టును రూపొందించాలని అనుకున్నామని, ఒక చాంపియన్ జట్టును రూపొందించాలన్నదే తమ అందరి లక్ష్యమని అన్నాడు. జట్టులో కొంతమంది డొమెస్టిక్ ఆటగాళ్లు కూడా ఉండడం గురించి అడగ్గా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకునే వారిని ఎంపిక చేసినట్లు చెప్పాడు. అనికేత్ చౌదరి, బాసిల్ తంపి, నాథూ సింగ్ లాంటి వాళ్లను జట్టులో చేర్చుకోవడం తమ పథకంలో భాగమేనని, న్యూజిలాండ్ పర్యటనకు ముందు జయంత్ యాదవ్‌ను కూడా అలాగే ఎంపిక చేశామని కుంబ్లే చెప్పాడు. అయితే వీళ్లంతా కూడా సమీప భవిష్యత్తులోనే జట్టులో భాగం కావలసిన అవసరం లేదని, అయితే రాబోయే సిరీస్‌లను లేదా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిని కూడా ఈ వర్క్ కల్చర్‌లోకి తీసుకురావడం అవసరమని భావించినట్లు కుంబ్లే చెప్పాడు.
1980 దశకంలో కపిల్ దేవ్ నేతృత్వంలో భారత జట్టు సాధించిన 19 టెస్టుల అపజయాలు ఎరుగని జట్టు రికార్డుతో సమానంగా ఇప్పుడు కోహ్లీ బృందం ఉంది. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో ఈ రికార్డును బద్దలు కొట్టాలనుకుంటున్నారా అని అడగ్గా, తాము రికార్డులను గురించి ఆలోచించడంలేదని ప్రతి తొలి సెషన్‌లోను రాణించడం గురించే అలోచిస్తున్నామని కుంబ్లే చెప్పాడు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులోని స్పిన్నర్లను ఒకప్పటి షేన్‌వార్న్‌లాంటి దిగ్గజాలతో పోల్చి చూడడం తనకు ఇష్టం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా కుంబ్లే చెప్పాడు. ప్రత్యర్థిని తాము ఎంతో గౌరవిస్తామని అంటూ, జట్టు కూర్పు ఎలా ఉన్నా సిద్ధంగా ఉండాలని అనుకుంటున్నామని చెప్పాడు.