క్రీడాభూమి

అశ్విన్ తిప్పేశాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మార్చి 7: ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన రెండో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు సంచలన విజయాన్ని సాధించింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 41 పరుగులకే 6 వికెట్లు కైవసం చేసుకుని ఈ మ్యాచ్‌ను భారత్‌కు అనుకూలంగా మార్చాడు. దీంతో భారత జట్టు మరో రోజు ఆట మిగిలి ఉండగానే 75 పరుగుల తేడాతో కంగారూలను మట్టికరిపించి నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 188 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు ఉపక్రమించిన భారత బౌలర్లలో అశ్విన్‌కు నాలుగో రోజు పిచ్ ఎంతగానో సహకరించింది. ఈ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్న అతను ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారి 41 పరుగులకే 6 వికెట్లు కైవసం చేసుకున్నాడు. టెస్టుల్లో అశ్విన్ 5 కంటే ఎక్కువ వికెట్లు సాధించడం ఇది 25వ సారి. అశ్విన్‌తో పాటు ఉమేష్ యాదవ్ (2/30), రవీంద్ర జడేజా (1/3), ఇశాంత్ శర్మ (1/28) కూడా బౌలింగ్‌లో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో కేవలం 112 పరుగులకే చేతులెత్తేసింది.
పుణెలో జరిగిన తొలి టెస్టులో భారత్ స్వల్ప స్కోరుకే 9 వికెట్లు కోల్పోయిన విధంగానే మంగళవారం బెంగళూరులో ఆస్ట్రేలియా కూడా రెండో ఇన్నింగ్స్‌లో 26-36 ఓవర్ల మధ్య కేవలం 11 పరుగుకే 6 వికెట్లు కోల్పోయి దారుణంగా చతికిలబడింది. అంతకుముందు బ్యాట్‌తో లోకేష్ రాహుల్ తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులు, చటేశ్వర్ పుజారా రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులు, అజింక్యా రహానే రెండో ఇన్నింగ్స్‌లో 52 పరుగులు, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 20 పరుగులు సాధించి సమష్ఠిగా రాణించడం అంతిమంగా భారత్‌కు కలిసొచ్చింది. అలాగే పుణె టెస్టులో సరిగా రాణించలేకపోయినప్పటికీ ఈ మ్యాచ్‌లో విజృంభించిన టీమిండియా స్పిన్నర్ల ద్వయం రవిచంద్రన్ అశ్విన్ (8 వికెట్లు), రవీంద్ర జడేజా (7 వికెట్లు) రెండు ఇన్నింగ్స్‌లో మొత్తం 20 వికెట్లకు గాను 15 వికెట్లను కైవసం చేసుకుని కంగారూల పతనాన్ని శాసించగలిగారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు భారత్ నిర్ధేశించిన లక్ష్యం 188 పరుగులే అయినప్పటికీ చిన్నస్వామి స్టేడియంలో నాలుగో రోజు బంతి బంతికీ పిచ్ విషమంగా మారడంతో ఇది 350 పరుగుల పెద్ద లక్ష్యం మాదిరిగా కనిపించింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ స్టీవ్ స్మిత్ (28), పీటర్ హ్యాండ్స్‌కూంబ్ (24) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఎవరూ 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
అంతకుముందు 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు మరో 25 పరుగులకే నైట్‌వాచ్‌మన్ అజింక్యా రహానే (52)తో పాటు కరుణ్ నాయర్ (0) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మరో 36 పరుగులకే మరో నైట్‌వాచ్‌మన్ చటేశ్వర్ పుజారా (92)తో పాటు రవిచంద్రన్ అశ్విన్ (4), ఉమేష్ యాదవ్ (1), ఇశాంత్ శర్మ (6) నిష్క్రమించగా, వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా 20 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 97.1 ఓవర్లు ఆడి 274 పరుగులకు ఆలౌటైన భారత జట్టు కంగారూలకు 188 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది.
అనంతరం స్వల్ప లక్ష్యంతో ఛేజింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టులో నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ మ్యాట్ రెన్షా 5 పరుగులకే ఇశాంత్ బౌలింగ్‌లో వికెట్ల వెనుక వృద్ధిమాన్ సాహకు దొరికి పోయినప్పటికీ 10వ ఓవర్ ముగిసే వరకూ పరిస్థితులు ఆసీస్‌కే అనుకూలింగా ఉన్నాయి. 10వ ఓవర్ పూర్తయ్యే సమయానికి ఆస్ట్రేలియా 1 వికెట్‌ను మాత్రమే కోల్పోయి 42 పరుగులు సాధించడమే ఇందుకు కారణం. అయితే ఆ తర్వాత లెగ్‌బిఫోర్ వికెట్ల రూపంలో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (17)ను రవిచంద్రన్ అశ్విన్, సెకెండ్ డౌన్ బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ (9)తో పాటు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (28)ను ఉమేష్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాను ఆదుకునేందుకు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్‌కూంబ్ ప్రయత్నించినప్పటికీ భారత బౌలర్ల ముందు ఎవరూ నిలవలేకపోయారు. అశ్విన్ పదునైన బంతులతో విరుచుకుపడి మిచెల్ మార్ష్ (13), మాథ్యూ వేడ్ (0), మిచెల్ స్టార్క్ (1), నాథన్ లియోన్ (2)తో పాటు హ్యాండ్స్‌కూంబ్ (24)ను పెవిలియన్‌కు చేర్చగా, మధ్యలో స్టీవ్ ఒకీఫ్ (2)ను రవీంద్ర జడేజా క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 35.4 ఓవర్లు ఆడి 112 పరుగులకే ఆలౌటైన ఆస్ట్రేలియా 75 పరుగుల తేడాతో చతికిలబడింది.

చిత్రం..ఆసీస్ వెన్ను విరిచిన రవిచంద్రన్ అశ్విన్ (6/41)