క్రీడాభూమి

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో గుజరాత్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. తొలి మ్యాచ్‌లో నిరుటి రన్నరప్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 35 పరుగుల తేడాతో ఓడించిన సన్‌రైజర్స్ రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ను తొమ్మిది వికెట్ల ఆధిక్యంతో చిత్తుచేసింది. డేవిడ్ వార్నర్, మోజెస్ హెన్రిక్స్ అర్ధ శతకాలతో కదంతొక్కి, జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నదన్న ధీమాతో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 135 పరుగులు చేసింది. యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టి, గుజరాత్‌ను కట్టడి చేశాడు. జట్టు స్కోరు 35 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను ఈ జట్టు బ్రెండన్ మెక్‌కలమ్ రూపంలో కోల్పోయింది. అతను ఐదు పరుగులు చేసి రషీద్ ఖఆన్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. మరో రెండు పరుగులకే రెండో వికెట్ కూలింది. క్రీజ్‌లో నిలదొక్కుకున్నట్టు కనిపించిన జాసన్ రాయ్ 21 బంతుల్లో 31 పరుగులు సాధించి, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ చక్కటి క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. ఆరోన్ ఫించ్ (3), సురేష్ రైనా (5)ను రషీద్ ఖాన్ ఎల్‌బిగా అవుట్ చేశాడు. 57 పరుగులకే నాలుగు వికెట్లు చేజార్చుకున్న గుజరాత్‌ను ఆదుకునే బాధ్యతను దినేష్ కార్తీక్, డ్వెయిన్ స్మిత్ స్వీకరించారు. ఐదో వికెట్‌కు వీరు 56 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బలపడుతున్న ఈ పార్ట్‌నర్‌షిప్‌ను భువనేశ్వర్ కుమార్ ఛేదించాడు. సబ్‌స్టిట్యూట్ ఆటగాడు శంకర్ క్యాచ్ పట్టగా అవుటైన స్మిత్ 27 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 37 పరుగులు చేశాడు. జట్టు స్కోరుకు మరో పరుగు జత కలవగా, దినేష్ కార్తీక్ వికెట్ కూడా కూలింది. అతను 32 బంతుల్లో 30 పరుగులు చేసి ఆశిష్ నెహ్రా బౌలింగ్‌లో నమన్ ఒఝాకు దొరికిపోయాడు. ధవళ్ కులకర్ణి ఒక పరుగు చేసి, రషీద్ ఖాన్ చక్కటి ఫీల్డింగ్ కారణంగా రనౌటయ్యాడు. మొత్తానికి గుజరాత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 135 పరుగులు చేయగలిగింది. అప్పటికీ ప్రవీణ్ కుమార్ 7, బాసిల్ థంపి 13 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.
ధావన్ విఫలం
సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి విఫలమై అభిమానులను నిరాశ పరిచాడు. తొమ్మిది బంతుల్లో తొమ్మిది పరుగులు చేసిన అతను ప్రవీణ్ కుమార్ బౌలింగ్‌లో బ్రెండన్ మెక్‌కలమ్ క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అయితే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన మోజెస్ హెన్రిక్స్‌తో కలిసి డేవిడ్ వార్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతులు ఎదుర్కొన్న అతను ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అజేయంగా 76 పరుగులు చేసి జట్టును ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించాడు. మోజెస్ హెన్రిక్స్ 39 బంతుల్లో, నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా, కేవలం 19 బంతులకే మూడు వికెట్లు పడగొట్టడంతోపాటు, ఒక రనౌట్ చేసిన రషీద్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

* సన్‌రైజర్స్ గెలిచిన మ్యాచ్‌ల్లో డేవిడ్ వార్నర్ అర్ధ శతకం సాధించడం ఇది 17వ సారి. మొత్తం మీద ఈ జట్టు 26 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసింది.
* ఈ ఏడాది రషీద్ ఖాన్ టి-20 ఫార్మాట్‌లో 23 వికెట్లు పడగొట్టాడు. ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్ల జాబితాలో సునీల్ నారైన్‌తో కలిసి నంబర్ వన్ స్థానాన్ని పంచుకుంటున్నాడు. 19 పరుగులకే మూడు వికెట్లు కూల్చిన అతను గుజరాత్‌ను కట్టడి చేశాడు. ఒక రనౌట్‌లోనూ ప్రధాన భూమిక పోషించాడు. ప్రత్యర్థిని భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్న రషీద్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
* గుజరాత్ లయన్స్‌తో ఇప్పటి వరకూ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ టాస్ గెలిచింది. మూడు పర్యాయాలు ఫీల్డింగ్ ఎంచుకొని, అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించింది.
**

చిత్రాలు....కెప్టెన్ ఇన్నింగ్స్ డేవిడ్ వార్నర్
*ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్. అఫ్గానిస్తాన్‌కు చెందిన ఈ బౌలర్ హైదరాబాద్ పిచ్‌ను సమర్థంగా ఉపయోగించుకొని, గుజరాత్ లయన్స్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు.