క్రీడాభూమి

సిక్సర్లతో జిగేల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, ఏప్రిల్ 18: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో ఎడిషన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో వరుస వైఫల్యాలతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) ఉన్నట్టుండి ఒక్కసారిగా జూలు విదిల్చింది. మంగళవారం రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గుజరాత్ లయన్స్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించగా, గుజరాత్ లయన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు చేజార్చుకుని 192 పరుగులకు పరిమితమైంది. పేలవమైన ఫామ్‌తో ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన విండీస్ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (38 బంతుల్లో 77), కెప్టెన్ విరాట్ కోహ్లీ (50 బంతుల్లో 64) చెరో అర్థ శతకంతో విజృంభించి రాయల్ చాలెంజర్స్ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. అంతకుముందు టాస్ గెలిచిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ సురేష్ రైనా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన రాయల్ చాలెంజర్స్ ఓపెనర్లు క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే బ్యాట్ ఝళిపించారు. తొలి ఆరు ఓవర్లలోనే 45 పరుగులు రాబట్టిన వీరు 76 బంతుల్లో 122 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేశారు. నాలుగో ఓవర్‌లో బాసిల్ థంపి వేసిన బంతికి ఒక పరుగు రాబట్టుకుని టీ-20 ఫార్మాట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసిన గేల్ ఆ తర్వాత సిక్సర్లు, ఫోర్లతో మరింత విజృంభించాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా వేసిన ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు, మరో సిక్సర్ బాదిన గేల్ అదే ఓవర్‌లో చివరి బంతిని సిక్సర్‌గా మలచబోయి లాంగ్ ఆఫ్‌లో బౌండరీ వద్ద బ్రెండన్ మెక్‌కలమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే మెక్‌కలమ్ బౌండరీ లైన్‌ను తాకినట్టు రీప్లేలో తేలడంతో గండం నుంచి బయట పడిన గేల్ గుజరాత్ లయన్స్‌కు మరోసారి తన తడాఖా చూపించాడు. పదో ఓవర్‌లో శివిల్ కౌశిక్ వేసిన బంతిని భారీ సిక్సర్‌గా మలచి 50 పరుగులు పూర్తి చేసుకున్న గేల్ ఆ తర్వాత డ్వెయిన్ స్మిత్ బౌలింగ్‌లో మరో సిక్సర్ బాదాడు. దీంతో రాయల్ చాలెంజర్స్ వికెట్లేమీ నష్టపోకుండానే 100 పరుగుల మార్కును దాటింది. ఆ తర్వాత స్మిత్ వేసిన మరో ఓవర్‌లో నాలుగో బంతిని గేల్ సిక్సర్‌గా మలచడంతో ఆ ఓవర్‌లో ఆర్‌సిబి ఏకంగా 17 పరుగులు రాబట్టుకుంది. అయితే 13వ ఓవర్‌లో బాసిల్ థంపి లెగ్ బిఫోర్ వికెట్ రూపంలో గేల్‌ను పెవిలియన్‌కు పంపాడు. 38 బంతుల్లో ఏడు భారీ సిక్సర్లు, మరో ఐదు ఫోర్ల సహాయంతో 77 పరుగులు సాధించిన గేల్ నిష్క్రమణతో ఆర్‌సిబి 122 పరుగుల స్కోరు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయినప్పటికీ మరోవైపు కోహ్లీ జోరు ఆగలేదు. 15వ ఓవర్‌లో కౌశిక్ వేసిన బంతికి రెండు పరుగులు సాధించి అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్న కోహ్లీ అదే ఓవర్‌లో నాలుగో బంతిని భారీ సిక్సర్‌గా మలచిన తర్వాత మొత్తం మీద 50 బంతుల్లో ఒక సిక్సర్, మరో ఏడు ఫోర్ల సాయంతో 64 పరుగులు సాధించి ధవళ్ కులకర్ణి బౌలింగ్‌లో డ్వెయిన్ స్మిత్‌కు దొరికిపోయాడు. ఇక చివర్లో ట్రవిస్ హెడ్ (16 బంతుల్లో 30), వికెట్ కీపర్ కేదార్ జాదవ్ (16 బంతుల్లో 38) కూడా దూకుడుగా ఆడి అజేయంగా నిలవడంతో రాయల్ చాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన గుజరాత్ లయన్స్ రెండో ఓవర్‌లోనే ఓపెనర్ డ్వెయిన్ స్మిత్ (1) వికెట్‌ను కోల్పోయినప్పటికీ నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కలమ్ ప్రత్యర్థి బౌలర్లను దీటుగా ఎదుర్కొని తనదైన శైలిలో సిక్సర్ల మోత మోగించాడు. కెప్టెన్ సురేష్ రైనా (8 బంతుల్లో 23)తో కలసి 26 పరుగులు, ఆరోన్ ఫించ్ (15 బంతుల్లో 19)తో కలసి 66 పరుగులు, వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (4 బంతుల్లో 1)తో కలసి మరో 3 పరుగులు జోడించిన మెక్‌కలమ్ 44 బంతుల్లో ఏడు సిక్సర్లు, మరో రెండు ఫోర్ల సహాయంతో 72 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి యజువేంద్ర చాహాల్ బౌలింగ్‌లో ఐదో వికెట్‌గా నిష్క్రమించాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 22 బంతుల్లో 23 పరుగులు రాబట్టి రనౌట్‌గా వెనుదిరగ్గా, ఇషాన్ కిషన్ 16 బంతుల్లో 39 పరుగులు సాధించి ఆడమ్ మిల్నే బౌలింగ్‌లో చాహాల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో గుజరాత్ లయన్స్ పరుగుల వేటలో వెనుకబడింది. ఆ తర్వాత ఆండ్రూ టై (6 బంతుల్లో 6), బాసిల్ థంపి (0) అజేయంగా నిలువడంతో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు సాధించిన గుజరాత్ లయన్స్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ లయన్స్‌కు ఇది నాలుగో ఓటమి కాగా, ఆరు మ్యాచ్‌లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఇది రెండో విజయం.
సంక్షిప్తంగా స్కోర్లు
రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 213/2 (క్రిస్ గేల్ 77, విరాట్ కోహ్లీ 64, కేదార్ జాదవ్ 38-నాటౌట్, ట్రవిస్ హెడ్ 30-నాటౌట్, బాసిల్ థంపి 1/31, ధవళ్ కులకర్ణి 1/37). వికెట్ల పతనం: 1-122, 2-159.
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: 20 ఓవర్లలో 192/7 (బ్రెండన్ మెక్‌కలమ్ 72, ఇషాన్ కిషన్ 39, సురేష్ రైనా 23, రవీంద్ర జడేజా 23, ఆరోన్ ఫించ్ 19, యుజువేంద్ర చాహాల్ 3/31, పవన్ నేగీ 1/21, ఆడమ్ మిల్నే 1/43, శ్రీనాథ్ అరవింద్ 1/53). వికెట్ల పతనం: 1-1, 2-37, 3-103, 4-106, 5-137, 6-165, 7-191.