క్రీడాభూమి

ఉనాద్కత్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్‌పై 12 పరుగుల తేడాతో పుణే విజయం

జయదేవ్ ఉనాద్కత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను వేయడానికి సిద్ధమయ్యే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 13 పరుగుల దూరంలో ఉంది. ఆ ఓవర్ మొదటి బంతిని రక్షణాత్మకంగా ఆడిన బిపుల్ శర్మ (8) రెండో బంతిని సరిగ్గా అర్థం చేసుకోలేక, బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాతి బంతికే రషీద్ ఖాన్ (3)ను ఉనాద్కత్ రిటర్న్ క్యాచ్ పట్టుకొని అవుట్ చేశాడు. ఆ వెంటనే భువనేశ్వర్ కుమార్ (0)ను అజింక్య రహానే క్యాచ్ అందుకోగా అవుట్ చేసిన ఉనాద్కత్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు. భువీ వికెట్‌తో ఉనాద్కత్ ఐపిఎల్‌లో వంద వికెట్ల మైలురాయిని చేరుకోడం విశేషం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ రెండు వరుస బంతుల్లో మహేంద్ర సింగ్ ధోనీ, శార్దూల్ ఠాకూర్ వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం నాలుగు వికెట్లు సాధించగా, రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మీడియం పేసర్ జయదేవ్ ఉనాద్కత్ ఒక ఓవర్‌లో రెండు వికెట్లు కూల్చాడు. ఆతర్వాత ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసి, హ్యాట్రిక్ సాధించాడు. మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి, ఉత్తమ బౌలర్‌గా నిలిచాడు.

హైదరాబాద్, మే 6: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ షాకిచ్చింది. జయదేవ్ ఉనాద్కత్ సూపర్ హ్యాట్రిక్‌తో చెలరేగడంతో, అత్యంత కీలకమైన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో విజయం సాధించి, ప్లే ఆఫ్‌లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. హోం గ్రౌండ్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరుస్తున్న డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్‌కు ఇది ఊహించని దెబ్బ. పుణే సూపర్‌జెయింట్‌ను 20 ఓవర్లలో 148 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, ఆ లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులు చేయగలిగింది. చివరి ఓవర్ వరకూ సన్‌రైజర్స్ విజయం సులభంగానే కనిపించింది. కానీ, ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన ఉనాద్కత్ హ్యాట్రిక్ నమోదు చేసి, సన్‌రైజర్స్ అభిమానులను నిరాశ పరిచాడు. మొత్తం మీద అతను ఐదు వికెట్లు పడగొట్టి పుణే విజయంలో కీలక భూమిక పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు.
ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్
హోం గ్రౌండ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో పుణే సూపర్‌జెయింట్ బ్యాటింగ్‌కు దిగి, ఆరు పరుగుల స్కోరువద్ద రాహుల్ త్రిపాఠీ వికెట్‌ను కోల్పోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పుణే సూపర్‌జెయింట్‌కు ఒంటిచేత్తో విజయాన్ని సాధించిపెట్టిన త్రిపాఠీ ఈ మ్యాచ్‌లో నాలుగు బంతులు ఎదుర్కొని, ఒక పరుగు చేసి రనౌటయ్యాడు. పరుగు కోసం ప్రయత్నించిన అతను సకాలంలో క్రీజ్‌లోకి చేరుకోలేక, బిపుల్ శర్మ స్టంప్స్‌ను పడగొట్టడంతో పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అజింక్య రహానే కొంత సేపు సన్‌రైజర్స్ బౌలింగ్‌కు ఎదురునిలిచి, 20 బంతుల్లో 22 పరుగులు చేసిన తర్వాత బిపుల్ శర్మ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్‌కు చిక్కాడు. అనంతరం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ జట్టును ఆదుకున్నారు. వేగంగా పరుగులు రాబట్టే సత్తావున్న బెన్ స్టోక్స్ 25 బంతులు ఎదుర్కొని, ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. అతనిని రషీద్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో సన్‌రైజర్స్ ఊపిరి పీల్చుకుంది. అప్పటికి జట్టు స్కోరు 99 పరుగులు. మరో రెండు పరుగుల తర్వాత స్టీవెన్ స్మిత్ వికెట్ కూడా కూలింది. అతను 39 బంతులు ఎదుర్కొని, 34 పరుగులు చేసి, సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లో బిపుల్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. స్మిత్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం విశేషం. ఛేజింగ్‌లో సమర్థుడిగా పేరు తెచ్చుకున్న ఆల్‌రౌండర్ డాలియన్ క్రిస్టియన్ (4), స్టార్ బ్యాట్స్‌మన్ మనోజ్ తివారీ (9) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 21 బంతుల్లో 31 పరుగులు చేసి సిద్ధార్థ్ కౌల్ బౌలింగ్‌లోనే వికెట్‌కీపర్ నమన్ ఓఝా క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతని స్కోరులో 2 ఫోర్లు, మరో 2 సిక్సర్లు ఉన్నా యి. శార్దూల్ ఠాకూర్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే అవుటయ్యాడు. మొత్తం మీద పుణే సూపర్‌జెయింట్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు చేసింది. అప్పటికి వాషింగ్టన్ సుందర్ (1), జయదేవ్ ఉనాద్కత్ (0) క్రీజ్‌లో ఉన్నారు. పుణే సూపర్‌జెయింట్ బ్యాటింగ్ పతనానికి కారకుడైన సిద్ధార్థ్ కౌల్ నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి 4 వికెట్లు కూల్చాడు. రషీద్ ఖాన్, బిపుల్ శర్మ చెరొక వికెట్ తమతమ ఖాతాల్లో వేసుకున్నారు.
స్టోక్స్ దెబ్బ
ప్లే ఆఫ్‌లో స్థానాన్ని పదిలం చేసుకోవడానికి 149 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ను బెన్ స్టోక్స్ దెబ్బతీశాడు. జట్టు స్కోరు 25 పరుగుల వద్ద శిఖర్ ధావన్ (12 బంతుల్లో 19 పరుగులు)ను అతని క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో నాలుగు పరుగుల తర్వాత కేన్ విలియమ్‌సన్ కూడా వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన అతనిని మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ అందుకోగా స్టోక్స్ అవుట్ చేశాడు. ఫామ్‌ను కొనసాగిస్తూ, 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 40 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ వికెట్ కూడా స్టోక్స్‌కు లభించింది. శార్దూల్ ఠాకూర్ క్యాచ్ పట్టగా వార్నర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అర్ధ శతకం దిశగా దూసుకెళుతున్న యువరాజ్ సింగ్‌ను రాహుల్ త్రిపాఠీ క్యాచ్ పట్టగా జయదేవ్ ఉనాద్కత్ అవుట్ చేశాడు. యువీ 43 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. అదే ఓవర్ చివరి బంతిలో నమన్ ఓఝా వికెట్‌ను కూడా ఉనాద్కత్ కూల్చాడు. ఓఝా తొమ్మిది పరుగులు చేసి, స్టోక్స్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. 18వ ఓవర్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ విజయానికి 32 పరుగుల దూరంలో నిలిచింది. ఉనాద్కత్ వేసిన ఆ ఓవర్‌లో పది పరుగులు లభించగా, రెండు వికెట్లు కూలాయి. 19వ ఓవర్ వేసిన స్టోక్స్ వికెట్ పడగొట్టలేకపోయినా, కేవలం తొమ్మిది పరుగులే ఇచ్చాడు. దీనితో చివరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయానికి 13 పరుగుల దూరంలో నిలిచింది. ఉనాద్కత్ చివరి ఓవర్ వేసి, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా, మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. దీనితో 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లకు 136 పరుగులు చేసిన సన్‌రైజర్స్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

స్కోరుబోర్డు
రైజింగ్ పుణే సూపర్‌జెయింట్: అజింక్య రహానే సి యువరాజ్ సింగ్ బి బిపుల్ శర్మ 22, రాహుల్ త్రిపాఠీ రనౌట్ 1, స్టీవెన్ స్మిత్ సి బిపుల్ శర్మ బి సిద్ధార్థ్ కౌల్ 34, బెన్ స్టోక్స్ బి రషీద్ ఖాన్ 39, మహేంద్ర సింగ్ ధోనీ సి నమన్ ఓఝా బి సిద్ధార్థ్ కౌల్ 31, డానియల్ క్రిస్టియన్ సి రషీద్ ఖాన్ బి సిద్ధార్థ్ కౌల్ 4, మనోజ్ తివారీ రనౌట్ 9, వాషింగ్టన్ సుందర్ 1 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ సి డేవిడ్ వార్నర్ బి సిద్ధార్థ్ కౌల్ 0, జయదేవ్ ఉనాద్కత్ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7, మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 148.
వికెట్ల పతనం: 1-6, 2-39, 3-99, 4-101, 5-105, 6-142, 7-147, 8-147.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 4-0-39-0, ఆశిష్ నెహ్రా 1.1-0-5-0, సిద్ధార్థ్ కౌల్ 4-0-29-4, రషీద్ ఖాన్ 4-0-18-1, మోజెస్ హెన్రిక్స్ 2.5-0-15-0, బిపుల్ శర్మ 4-0-39-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ సి శార్దూల్ ఠాకూర్ బి బెన్ స్టోక్స్ 40, శిఖర్ ధావన్ బి బెన్ స్టోక్స్ 19, కేన్ విలియమ్‌సన్ సి మహేంద్ర సింగ్ ధోనీ బి బెన్ స్టోక్స్ 4, యువరాజ్ సింగ్ సి రాహుల్ త్రిపాఠీ బి జయదేవ్ ఉనాద్కత్ 47, మోజెస్ హెన్రిక్స్ బి ఇమ్రాన్ తాహిర్ 4, నమన్ ఓఝా సి బెన్ స్టోక్స్ బి జయదేవ్ ఉనాద్కత్ 9, బిపుల్ శర్మ సి బెన్ స్టోక్స్ బి జయదేవ్ ఉనాద్కత్ 8, రషీద్ ఖాన్ సి అండ్ బి జయదేవ్ ఉనాద్కత్ 3, భువనేశ్వర్ కుమార్ సి మనోజ్ తివారీ బి జయదేవ్ ఉనాద్కత్ 0, సిద్ధార్థ్ కౌల్ 0 నాటౌట్, ఆశిష్ నెహ్రా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 136.
వికెట్ల పతనం: 1-25, 2-29, 3-83, 4-96, 5-117, 6-127, 7-136, 8-136, 9-136.
బౌలింగ్: జయదేవ్ ఉనాద్కత్ 4-1-30-5, వాషింగ్టన్ సుందర్ 3-0-19-0, బెన్ స్టోక్స్ 4-0-30-3, ఇమ్రాన్ తాహీర్ 4-0-24-1, శార్దూల్ ఠాకూర్ 2-0-12-0, డానియల్ క్రిస్టియన్ 3-0-21-0.

రైజింగ్ పుణే సూపర్‌జెయంట్
హ్యాట్రిక్ వీరుడు జయదేవ్ ఉనాద్కత్

విజేత బ్రిటన్
ఇపో, మే 6: అజ్లాన్ షా హాకీ టైటిల్‌ను గ్రేట్ బ్రిటన్ అజ్లాన్ షా హాకీ చాంపియన్‌షిప్‌ను టైటిల్‌ను గ్రేట్ బ్రిటన్ సొంతం చేసుకుంది. శనివారం జరిగిన హోరాహోరీ ఫైనల్‌లో ఈ జట్టు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను 4-3 తేడాతో ఓడించింది. డేవిడ్ గుడ్‌ఫీల్డ్ రెండు గోల్స్ చేసి, బ్రిటన్ టైటిల్ సాధించడంలో తోడ్పడ్డాడు. అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైన బ్రిటన్ ఆరంభం నుంచే దాడులకు ఉపక్రమించింది. మ్యాచ్ 8వ నిమిషంలోనే అలాన్ ఫోర్సిత్ తొలి గోల్ చేయగా, మూడు నిమిషాల వ్యవధిలో డేవిడ్ గోల్డ్ఫీల్డ్ ద్వారా బ్రిటన్‌కు రెండో గోల్ లభించింది. ప్రత్యర్థి రెండు వరుస గోల్స్ చేయడంతో కంగుతిన్న ఆస్ట్రేలియా ఎదురుదాడికి దిగింది. 28వ నిమిషంలో ఎడీ ఒకెనె్డన్ గోల్ చేసి, టైటిల్ నిలబెట్టుకునే ఆశలు పెంచాడు. కానీ, 33వ నిమిషంలో బ్రిటన్‌కు ఒలీ విలియమ్స్ మూడో గోల్‌ను అందించడంతో ఆసీస్ ఆత్మరక్షణలో పడింది. జాషువా పొలార్డ్ చేసిన గోల్‌తో ఆసీస్ ఊరట చెందింది. కానీ, డేవిడ్ గుడ్‌ఫీల్డ్ 43వ నిమిషంలో చేసిన గోల్‌తో బ్రిటన్ ఆధిక్కు చేరింది. ఆతర్వాత బ్రిటన్ వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు ప్రాధాన్యతనివ్వగా, 48వ నిమిషంలో డిలాన్ వథర్‌స్పూన్ ఆసీస్‌కు ఒక గోల్ అందించాడు. కీలకమైన నాలుగో గోల్ చేసేందుకు ఆసీస్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలను సమర్థంగా అడ్డుకున్న బ్రిటన్ 4-3 తేడాతో విజయభేరి మోగించింది.

ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
ఫైనల్‌లో థాపా ఓటమి
తాష్కెంట్, మే 6: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ పురుషుల 60 కిలోల విభాగంలో శివ థాపా రజత పతకంతో సరిపుచ్చుకున్నాడు. ఫైనల్‌లో అతను అల్నూర్ అబురైమోవ్‌తో తలపడి, ఓటమిపాలయ్యాడు. రజత పతకాన్ని అందుకున్న అతను, ఈ చాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండేళ్లు పతకాలను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

కిప్చోగ్ చేజారిన రికార్డు
మోన్జా, మే 6: ఒలింపిక్ మారథాన్ చాంపియన్ ఎల్యుడ్ కిప్చోగ్ ఒక అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశాన్ని కేవలం 24 సెకన్ల తేడాతో చేజార్చుకున్నాడు. 26.2 మైళ్లు (42.195 కిలోమీటర్లు) దూరాన్ని రెండు గంటల్లోపు పూర్తి చేయాలన్న అతని ప్రయత్నం ఫలించలేదు. అయితే, 2014 బెర్లిన్ మారథాన్‌ను 2 గంటల, 2 నిమిషాల 57 సెకన్లలో పూర్తిచేసి నెలకొల్పిన రికార్డును కిప్చోగ్ బద్దలు చేశాడు. అతను రెండు గంటల 27 సెకన్లలో గమ్యాన్ని చేరి కొత్త రికార్డు సృష్టించాడు. అయితే, మోన్జా జాతీయ ఆటోడ్రోమ్ రేసింగ్ సర్క్యూట్‌లో ఒక గంట 59 నిమిషాల, 59 సెకన్లలో మారథాన్ రేస్‌ను ముగించిన కిప్చోగ్ అవుట్‌డోర్ మారథాన్‌లో అదే ప్రదర్శనను పునరావృతం చేయలేకపోయాడు. కేవలం 27 సెకన్ల తేడాతో రెండు గంటల్లోగా మారథాన్‌ను పూర్తి చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

మహిళల రెజ్లింగ్
కెప్టెన్‌గా సాక్షి
న్యూఢిల్లీ, మే 6: ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత మహిళల బృందానికి రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ నాయకత్వం వహించనుంది. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు జరిగే ఈ పోటీల్లో భారత జట్టుకు భజరంగ్ పునియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. 24 స్వర్ణం, 24 రజతం, 48 కాంస్య పతకాల కోసం మహిళల విభాగంలో 83 మంది రెజ్లర్లు పోటీపడతారు.

ప్రాణం తీసిన పందెం!
ఢాకా, మే 6: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫలితంపై వేసిన పందెం ఒకరి ప్రాణాలను హరించింది. ఢాకా పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 2న జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌పై సంతోష్ కుమార్ అనే వ్యక్తి తన స్నేహితులతో పందెం కట్టాడు. అందులో అతను నెగ్గినప్పటికీ, పందెం మొత్తాన్ని ఇవ్వడానికి మిగతా వారు నిరాకరించడంతో ఘర్షణ చోటు చేసుకుంది. బెట్టింగ్‌లో ఓడిన వారు కొట్టడంతో తీవ్రంగా గాయపడిన సంతోష్ కుమార్ రంగాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అర్జున అవార్డుకు సిక్కీ రెడ్డి పేరు
న్యూఢిల్లీ, మే 6: డబుల్స్ స్పెషలిస్టు సిక్కీ రెడ్డి పేరును అర్జున అవార్డుకు ప్రతిపాదించినట్టు భారత బాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రకటించింది. అదే విధంగా పురుషుల విభాగంలో సుమీత్ రెడ్డి పేరును పరిశీలకు పంపినట్టు తెలిపింది. వీరిద్దరూ అంతర్జాతీయ పోటీల్లో అద్భుతంగా రాణిస్తున్నారని, అందుకే వారి పేర్లను అవార్డుల కమిటీకి పంపామని పేర్కొంది.
రెజ్లింగ్‌లో..
ఇలావుంటే, రెజ్లర్ సందీప్ తోమర్, హర్దీప్ సింగ్ పేర్లను అర్జున అవార్డు కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) ప్రతిపాదించింది. సందీప్ నిరుడు జరిగిన కామనె్వల్త్, ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచాడు. ఆసియా మీట్‌లో హర్దీప్ సింగ్‌కు రజత పతకం లభించింది.

చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్
టీమిండియా ఎంపిక రేపు
న్యూఢిల్లీ, మే 6: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే టీమిండియాను సోమవారం ఎంపిక చేస్తారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)తో ఆదాయంలో వాటాలపై తలెత్తిన వివాదం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి సెలక్షన్ కమిటీ ఇంకా జట్టును ఎంపిక చేయని విషయం తెలిసిందే. ఏప్రిల్ 25వ తేదీతో గడువు ముగిసినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేయడాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాలనాధికారుల బృందం (సిఒఎ) తీవ్రంగా పరిగణించింది. తక్షణమే జట్టును ఎంపిక చేయాలని బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనితో సోమవారం సెలక్షన్ కమిటీని సమావేశ పరచి, టీమిండియాను ఖరారు చేయనున్నట్టు బిసిసిఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరీ ఒక ప్రకటనలో తెలిపాడు.