క్రీడాభూమి

చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో పాల్గొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 7: చాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌లో టీమిండియా ఆడడంపై నెలకొన్న అనుమానాలకు తెరపడింది. ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్నట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) ప్రకటించింది. ఆదివారం జరిగిన బోర్డు ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టు ఎంపిక సోమవారం జరుగుతుందని ప్రకటించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)కు లీగల్ నోటీసు పంపాలన్న నిర్ణయాన్ని కూడా విరమించుకుంది. మొత్తం మీద సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) చేసిన సూచనలకు, హెచ్చరికలకు బిసిసిఐ సానుకూలంగా స్పందించక తప్పలేదు. అవసరమైతే సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి వెనుకాడబోమని బిసిసిఐకి సిఒఎ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసిసి ఆదాయంలో తన వాటాను తగ్గించుకోవడానికి సిద్ధపడని బిసిసిఐ ఒకానొక సమయంలో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాలన్న నిర్ణయానికి వచ్చింది. అంతేగాక, ఐసిసిపై ఒత్తిడిని పెంచే వ్యూహంలో భాగంగా చాంపియన్స్ ట్రోఫీకి మిగతా ఏడు దేశాలు తమతమ జట్లను ప్రకటించినప్పటికీ, తాను మాత్రం వివరాలు ఇవ్వకుండా తాత్సారం చేసింది. ఈ పరిణామాలపై స్పందించిన సిఒఎ తక్షణమే చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాలని బిసిసిఐని ఆదేశించిన విషయం తెలిసిందే. దేశ క్రికెట్ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకుంటే, సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించింది. సిఒఎ ఆగ్రహించడంతో దారికొచ్చిన బిసిసిఐ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. అంతేగాక, క్రీడా వివాదాల మధ్యవర్తిత్వ కోర్టులో కేసు వేస్తామంటూ ఐసిసికి లీగల్ నోటీసు పంపాలన్న ఆలోచనను విరమించుకుంది. చాంపియన్స్ ట్రోఫీకి సోమవారం జట్టు ఎంపిక జరుగుతుందని, ఆ టోర్నీ నుంచి వైదొలగే ఆలోచన లేదని బిసిసిఐ తేల్చిచెప్పింది. కాగా, బిసిసిఐ నిర్ణయాలపై సిఒఎ చీఫ్ వినోద్ రాయ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ప్రయోజనమే తమకు ముఖ్యమని వ్యాఖ్యానించిన అతను, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందన్న వార్త తమకు ఆనందాన్నిచ్చిందని తెలిపాడు.
శ్రీనివాసన్ హడావుడి!
బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఆదివారం నాటి ఎస్‌జిఎంలో హడావుడి చేశాడు. లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన అతను ఐసిసిపై చట్టపరమైన చర్య తీసుకోవాలని ప్రతిపాదించాడు. అసలు అతను ఈ సమావేశంలో పాల్గొనడంపైనే పలు అనుమానాలు ఉన్నాయి. లోధా సూచనల ప్రకారం బిసిసిఐ సమావేశాల్లో శ్రీనివాసన్ ప్రమేయం ఉండరాదని ఒక వర్గం బలంగా వాదిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అతను సమావేశంలో చర్చకు దిగి, ఐసిసికి నోటీసు ఇవ్వాలని సూచించడం కొంత సేపు గందరగోళ పరిస్థితులను సృష్టించింది. అయితే, చర్చల అనంతరం, శ్రీనివాసన్ ప్రతిపాదనను ఎస్‌జిఎం తిరస్కరించడంతో ఐసిసికి నోటీసు కథ సుఖాంతమైంది.