క్రీడాభూమి

సన్‌రైజర్స్‌కు కఠిన పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 7: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌తో జరిగే పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) గ్రూప్ మ్యాచ్‌లో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. పాయింట్ల పట్టికలో ముంబయి అగ్రస్థానంలో ఉండగా, సన్‌రైజర్స్ 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒకదానిని గెల్చుకోలేకపోతే, ప్లే ఆఫ్ దశకు చేరుకునే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. అందుకే, సోమవారం జరిగే మ్యాచ్‌ని డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నిజానికి రెండు వరుస పరాజయాలు జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో ఎదురైన ఓటమి కంటే, తాజా మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్‌పై గెలవలేకపోవడం వార్నర్ బృందాన్ని బాధిస్తున్నది. ఈ సీజన్‌లో మొట్టమొదటిసారి హోం గ్రౌండ్‌లో సన్‌రైజర్స్‌కు అదే మొదటి ఓటమికావడమే ఆటగాళ్లను నిద్రకు దూరం చేస్తున్నది. అత్యంత సాధారణమైన 149 పరుగుల లక్ష్యాన్ని కూడా ఈ జట్టు ఛేదించలేకపోయింది. కెప్టెన్ వార్నర్ (40), యువరాజ్ సింగ్ (47) తప్ప జట్టులో ఎవరూ గొప్పగా ఆడలేదు. ఒంటి చేత్తో విజయాలను సాధించిపెట్టే సత్తావున్న శిఖర్ ధావన్ (19), కేన్ విలియమ్‌సన్ (4), మోజెస్ హెన్రిక్స్ (4), కీలక ఇన్నింగ్స్ ఆడగల ప్రతిభావంతుడు, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ నమన్ ఓఝా (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడం సన్‌రైజర్స్ ఓటమికి ప్రధాన కారణం. పుణే మీడియం పేసర్ జయదేవ్ ఉనాద్కత్ హ్యాట్రిక్‌ని నమోదు చేయడమేగాక, మ్యాచ్‌లో మొత్తం ఐదు వికెట్లు పడగొట్టి, సన్‌రైజర్స్‌ను దారుణంగా దెబ్బతీశాడు.
బౌలింగే బలం!
బౌలింగ్ బలంతోనే సన్‌రైజర్స్ బరిలోకి దిగుతున్నదనేది వాస్తవం. భువనేశ్వర్ కుమార్ స్ట్రయిక్ బౌలర్‌గా రాణిస్తుండగా, పుణేతో జరిగిన మ్యాచ్‌లో సిద్ధార్థ్ కౌల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతని ప్రతిభ కారణంగానే పుణే 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే, సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వైఫల్యమే ఆ జట్టు ఓటమికి కారణమైంది. కాగా, సిద్ధార్థ్ కౌల్, భువీతోపాటు జట్టుకు అండగా నిలుస్తున్న ఆశిష్ నెహ్రా సోమవారం నాటి మ్యాచ్‌లో ఆడతాడా లేదా అన్నది అనుమానంగా కనిపిస్తున్నది. పుణేతో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్ మొదటి బంతి వేసిన తర్వాత కండరాలు బెణకడంతో నెహ్రా మైదానాన్ని వీడాడు. జట్టు కుప్పకూలుతున్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చినప్పటికీ, అతని ఫిట్నెస్‌పై అనుమానాలు కొనసాగుతునే ఉన్నాయి.
ప్రయోగాలకు సమయం!
ముంబయి ఇండియన్స్ ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరుకోవడంతో, ఆ జట్టు ప్రయోగాలకు సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. అయితే, బెంచ్ బలాన్ని పరీక్షించుకుంటుందా? లేక ఇప్పటికే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు ప్రాక్టీస్ కొనసాగాలన్న ఉద్దేశంతో విన్నింగ్ టీంనే కొనసాగిస్తుందా? అన్నది చూడాలి. గత మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను 146 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన తీరు ముంబయి బలానికి నిదర్శనం. తొలుత బ్యాటింగ్‌కు దిగిన 212 పరుగుల భారీ స్కోరు సాధించిన ముంబయి, ఆతర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను 13.4 ఓవర్లలో 66 పరుగులకే నియంత్రించి తిరుగులేని విజయాన్ని సాధించి, ఈసారి టైటిల్ రేసులో ముందున్నట్టు చెప్పకనే చెప్పింది. లెండల్ సిమన్స్, కీరన్ పొలార్డ్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, నితీష్ రాణా, కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యాలు జట్టును వేధిస్తున్నాయి. వారు కూడా తమదైన శైలిలో ఆడితే, ముంబయిని అడ్డుకోవడం ప్రత్యర్థి జట్లకు కష్టమన్నది వాస్తవం. ఈ జట్టు బౌలింగ్ విభాగంలో హర్భజన్ సింగ్, కర్న్ శర్మ వంటి సమర్థులున్నారు. డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ చెరి మూడు వికెట్లు పడగొట్టారు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ మెక్‌క్లీనగన్, ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి ప్రతిభావంతులు కూడా ఈ జట్టులో ఉన్నారు. హోం గ్రౌండ్‌లో ఆడడాన్ని మినహాయిస్తే, సన్‌రైజర్స్‌కు సోమవారం నాటి మ్యాచ్‌లో అనుకూలించే అంశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. సమష్టిగా పోరాడితే తప్ప ముంబయిని ఓడించడం ఈ జట్టుకు సాధ్యం కాదనే చెప్పాలి.