క్రీడాభూమి

ఫైనల్‌కు పుణే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 16: హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా ఓటమిపాలుకాగా, పదో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో ఎలాంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టిన రైజింగ్ పుణే సూపర్‌జెయింట్ మంగళవారం నాటి మొదటి క్వాలియఫయర్‌లో విజయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించిన కారణంగా ముంబయికి ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి తలపడుతుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పుణే సూపర్‌జెయంట్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులే చేయగలిగినప్పటికీ, ఆతర్వాత ముంబయని 9 వికెట్లకు 142 పరుగులకు కట్టడి చేసింది. పది పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్న ముంబయి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన పుణే సూపర్‌జెయింట్ మొదటి ఓవర్‌లో రాహుల్ త్రిపాఠీ వికెట్‌ను కోల్పోయింది. రెండు బంతులు ఎదుర్కొన్న అతను పరుగుల ఖాతా తెరవకుండానే మిచెల్ మెక్‌క్లీనగన్ బౌలింగ్‌లో బంతిని అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కూడా క్రీజ్‌లో నిలదొక్కుకోలేదు. అతను రెండు బంతుల్లో ఒక పరుగు చేసి, లసిత్ మలింగ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యకు దొరికాడు. ఫలితంగా పుణే సూపర్‌జెయింట్ తొమ్మిది పరుగులకు రెండు కీలక వికెట్లు చేజార్చుకొని కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్ అజింక్య రహానేకు మనోజ్ తివారీ అండగా నిలిచాడు. వీరిద్దరూ ముంబయి బౌలింగ్‌ను ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు కదిలించారు. మూడో వికెట్‌కు 80 పరుగులు జత కలిసి తర్వాత రహానే వికెట్ కూలింది. 43 బంతులు ఎదుర్కొని, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 56 పరుగులు చేసిన అతను కర్న్ శర్మ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. రహానే అవుటైన తర్వాత బ్యాటింగ్ చేపట్టిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వేగంగా పరుగులు రాబట్టాడు. అతనికి చక్కటి సహకారాన్ని అందించిన తివారీ 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 పరుగులు చేసి, ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌటయ్యాడు. అప్పటికి ధోనీ 40 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. 26 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో ఐదు సిక్సర్లు ఉన్నాయి. ముంబయి బౌలర్లు మిచెల్ మెక్‌క్లీనగన్, లసిత్ మలింగ, కర్న్ శర్మ తలా ఒక వికెట్ సాధించారు.
నిరాశపరచిన రాయుడు
నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లేందుకు 163 పరుగులు సాధించాల్సిన స్థితిలో ముంబయి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లెండల్ సిమన్స్, పార్థీవ్ పటేల్ ఆరంభం నుంచే పరుగులు కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. మొదటి వికెట్‌కు 35 పరుగులు జత కలిసిన తర్వాత ఒక పరుగు కోసం ప్రయత్నించిన సిమన్స్ రనౌటయ్యాడు. మరో ఆరు పరుగుల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ (1)ను వాషింగ్టన్ సుందర్ ఎల్‌బిగా అవుట్ చేశాడు. అదే ఓవర్‌లో అతను తెలుగు తేజం అంబటి రాయుడు (0) వికెట్‌ను కూడా కూల్చాడు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో జట్టును ఆదుకునే సత్తా తనకు ఉందని అనేక సందర్భాల్లో నిరూపించిన రాయుడు కీలకమైన ఈమ్యాచ్‌లో డకౌట్ కావడం అభిమానులను నిరాశ పరచింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 37 బంతుల్లోనే, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 63 పరుగులు సాధించిన రాయుడు అదే స్థాయిలో ఆడలేకపోయాడు. అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి స్మిత్‌కు దొరికిపోయాడు. జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తావున్న కీరన్ పొలార్డ్ సైతం నిలదొక్కుకొని ఆడలేదు. అతను ఏడు పరుగులు చేసి, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లోనే స్మిత్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఓపెనర్ పార్థీవ్ పటేల్ ఒంటరి పోరాటాన్ని కొనసాగిస్తుంటే, వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంలో హార్దిక్ పాండ్య కూడా విఫలమయ్యాడు. అతను 14 పరుగులు చేసి, లాకీ ఫెర్గూసన్ బౌలింగ్‌లో డానియల్ క్రిస్టియన్ క్యాచ్ పట్టగా వెనుదిరిగాడు. బాధ్యతాయుతంగా ఆడిన పార్థీవ్ పటేల్ 38 బంతుల్లో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. జట్టు స్కోరు వంద పరుగుల మైలురాయిని దాటిన కొద్ది సేపటికే కృణాల్ పాండ్య అవుటయ్యాడు. 15 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అతను శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో డానియల్ క్రిస్టియన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 101 పరుగుల వద్ద ముంబయి ఆరో వికెట్ కోల్పోయింది. అదే ఓవర్ చివరి బంతికి పార్థీవ్ పటేల్ కూడా అదే రీతిలో పెవిలియన్ చేరాడు. అతను 40 బంతుల్లో, మూడు ఫోర్లు, మరో మూడు సిక్సర్ల సాయంతో 52 పరుగులు సాధించాడు. అతను వెనుదిరగడంతో ముంబయి విజయంపై దాదాపుగా ఆశ వదులుకుంది. సమస్యను మరింత పమెంచుతూ, మహేంద్ర సింగ్ ధోనీ క్యాచ్ పట్టగా జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో కర్న్ శర్మ (4) అవుటయ్యాడు. మొత్తానికి చివరి రెండు ఓవర్లలో ముంబయి విజయానికి 39 పరుగుల దూరంలో నిలిచింది. జయదేవ్ ఉనాద్కత్ వేసిన 19వ ఓవర్‌లో ముంబయికి తొమ్మిది పరుగులు లభించాయి. చివరి ఓవర్‌లో 30 పరుగులు రాబట్టాల్సి ఉండగా, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో తొమ్మిది పరుగులు లభించగా, మెక్‌క్లీనగన్ (12) వికెట్ కూలింది. ముంబయ 9 వికెట్లకు 142 పరుగులు చేయగలిగింది. విజయానికి పది పరుగు దూరంలో ఆగిపోయంది. బుధవారం డిఫెం డింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్‌లో విజయం సాధిం చిన జట్టులో ముంబయ ఫైనల్‌లో స్థానం కోసం పోరాటం సాగించనుంది.

చిత్రం..16 పరుగులిచ్చి 3 వికెట్లు కూల్చిన వాషింగ్టన్ సుందర్