క్రీడాభూమి

శ్రీలంక రికార్డు విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెన్నింగ్టన్ ఓవల్ (లండన్), జూన్ 8: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తన నిలకడలేమిని మరోసారి ప్రదర్శించుకుంది. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చావుదెబ్బతీసిన విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత్, రెండో మ్యాచ్‌లో భారీ స్కోరు సాధించినప్పటికీ, పసలేని బౌలింగ్ కారణంగా శ్రీలంక చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన లంక రికార్డు సృష్టించగా, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో టీమిండియా డొల్లతనం స్పష్టంగా కనిపించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి, 50 ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగుల భారీ స్కోరు సాధించిన టీమిండియా ఆతర్వాత ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి ఓటమిని కొనితెచ్చుకుంది. శిఖర్ ధావన్ వీరోచిత సెంచరీ వృథాకాగా, సమష్టిగా రాణించిన లంక మూడు వికెట్లకు 322 పరుగులు చేసి, ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది.
టాస్ గెలిచిన లంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మరోసారి చక్కటి ఆరంభాన్నిచ్చారు. లంక బౌలింగ్‌ను ఆచితూచి ఆడుతూ వీరు 24.5 ఓవర్లలో మొదటి వికెట్‌కు 138 పరుగులు ఓడించారు. 79 బంతులు ఎదుర్కొని, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 78 పరుగులు సాధించిన రోహిత్ శర్మను తిసర పెరెరా క్యాచ్ పట్టగా లసిత్ మలింగ అవుట్ చేశాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదు బంతులు ఎదుర్కొని, ఒక్క పరుగుల కూడా చేయకుండానే నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నిరోషన్ డిక్‌విల్లా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. యువరాజ్ సింగ్ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. అతను 18 బంతులు ఎదుర్కొన్న అతను తన స్వతఃసిద్ధమైన ఆటకు విరుద్ధంగా బ్యాటింగ్ చేసి, కేవలం ఏడు పరుగులు చేశాడు. అసెల గుణరత్నే బౌలింగ్‌లో అతను క్లీన్ బౌల్డ్ కావడంతో 179 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆతర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి ఓపెనర్ ధావన్ స్కోరుబోర్డును పరుగులు తీయించాడు. 128 బంతులు ఎదుర్కొని, 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 125 పరుగులు చేసిన అతనిని కుశాల్ మేండిస్ క్యాచ్ పట్టగా మలింగ పెవిలియన్‌కు పంపాడు. హార్దిక్ పాండ్య 5 బంతుల్లో 9 పరుగులు చేసి సురంగ లక్మల్ బౌలింగ్‌లో కుశాల్ పెరెరాకు చిక్కాడు. 52 బంతుల్లో, ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 63 పరుగులు చేసి సత్తా చాటిన ధోనీని తిసర పెరెరా అవుట్ చేశాడు. అతని బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయిన ధోనీ నేరుగా చండీమల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇన్నింగ్స్ ముగిసేందుకు అప్పటికి ఇంకా నాలుగు బంతులు మాత్రమే మిగిలాయి. నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి కేదార్ జాదవ్ 13 బంతులు ఎదుర్కొని 25 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనితోపాటు నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉభ్న రవీంద్ర జడేజాకు ఒక్క బంతిని ఎదుర్కోలేదు.
ఆరంభంలోనే వికెట్
లంక ఇన్నింగ్స్‌ను భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ నిరోషన్ డిక్‌విల్లాను అతను రవీంద్ర జడేజా క్యాచ్ పట్టగా పెవిలియన్ చేర్చాడు. 11 పరుగుల వద్ద తొలి వికెట్ కూలింది. అయతే, ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కుశాల్ మెండిస్‌తో కలిసి దనుష్క గుణతిలక స్కోరును వేగంగా పెంచాడు. వీరిద్దరూ 23.1 ఓవర్లలో 159 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కోహ్లీ బౌలింగ్ చేస్తున్నప్పుడు, ఒక పరుగు పూర్తి చేసిన గుణతిలక మరో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అదృష్టం వరించి భారత్‌కు వికెట్ లభిస్తే, లంక అనుకోకుండా కీలక వికెట్ కోల్పోయంది. మూడో వికెట్‌కు 26 పరుగులు జత కలిసిన తర్వాత కుశాల్ మెండిస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 93 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 89 పరుగులు చేసి అతను కూడా గురతిలక మాదిరిగానే రనౌటయ్యాడు. కుశాల్ పెరెరా 44 బంతుల్లో 47 పరుగులు చేసిన తర్వాత, కాలి కండరాలు బెణకడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లాడు. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (45 బంతుల్లో 52 నాటౌట్), అసెల గుణరత్నే (34 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, ఇంకా 8 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.
*
శిఖర్ ధావన్ తన 77వ ఇన్నింగ్స్ (78వ మ్యాచ్)లో పదో సెంచరీ సాధించాడు. తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని దాటిన బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడో స్థానాన్ని సంపాదించాడు. క్వింటన్ డికాక్ 55, హషీం ఆమ్లా 57 ఇన్నింగ్స్‌లో పది సెంచరీలను పూర్తి చేసి, ఈజాబితాలో మొదటి రెండు స్థానాలను ఆక్రమించారు.
నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో బంతిని బౌండరీకి తరలించిన ధావన్ సెంచరీని పూర్తి చేశాడు. అతను 101 బంతుల్లో వంద పరుగుల మైలురాయిని అధిగమించాడు.
**

కుశాల్ మేండిస్ 27 వనే్డల్లో 50కి పైగా పరుగులు చేయడం ఇది 11వ సారి. ఇంగ్లాండ్‌కు చెందిన జో రూట్స్ మాత్రమే కుశాల్ మేండిస్ కంటే ఎక్కువగా 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. కాగా, 2015 ప్రపంచ కప్ తర్వాత రెండో వికెట్‌కు శ్రీలంక బ్యాట్స్‌మెన్ వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడం ఎనిమిదోసారి.

స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సి తిసర పెరెరా బి లసిత్ మలింగ 78, శిఖర్ ధావన్ సి కుశాల్ మెండిస్ బి లసిత్ మలింగ 125, విరాట్ కోహ్లీ సి నిరోషన్ డిక్‌విల్లా బి నువాన్ ప్రదీప్ 0, యువరాజ్ సింగ్ బి అసెల గుణరత్నే 7, మహేంద్ర సింగ్ ధోనీ సి దినేష్ చండీమల్ బి తిసర పెరెరా 63, హార్దిక్ పాండ్య సి కుశాల్ పెరెరా బి సురంగ లక్మల్ 9, కేదార్ జాదవ్ 25 నాటౌట్, రవీంద్ర జడేజా 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 321.
వికెట్ల పతనం: 1-138, 2-139, 3-179, 4-251, 5-278, 6-307.
బౌలింగ్: లసిత్ మలింగ 10-0-70-2, సురంగ లక్మల్ 10-1-72-1, నువాన్ ప్రదీప్ 10-0-73-1, తిసర పెరెరా 9-0-54-1, దనుష్క గుణతిలక 8-0-41-0, అసెల గుణరత్నే 3-0-7-1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిరోషన్ డిక్‌విల్లా సి రవీంద్ర జడేజా బి భువనేశ్వర్ కుమార్ 7, దనుష్క గుణతిలక రనౌట్ 76, కుశాల్ మెండిస్ రనౌట్ 89, కుశాల్ పెరెరా రిటైర్డ్ హర్ట్ 47, ఏంజెలో మాథ్యూస్ 52 నాటౌట్, అసెల గుణరత్నే 34 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 17, మొత్తం (48.4 ఓవర్లలో 3 వికెట్లకు) 322.
వికెట్ల పతనం: 1-11, 2-170, 3-196.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 10-0-54-1, ఉమేష్ యాదవ్ 9.4-0-67-0, జస్‌ప్రీత్ బుమ్రా 10-0-52-0, హార్దిక్ పాండ్య 7-1-51-0, రవీంద్ర జడేజా 6-0-52-0, కేదార్ జాదవ్ 3-0-18-0, విరాట్ కోహ్లీ 3-0-17-0.

చిత్రాలు...శిఖర్ ధావన్, కుశాల్ మేండిస్, కుశాల్ పెరెరా రిటైర్డ్ హర్ట్