క్రీడాభూమి

నాదల్ విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిట్నెస్ సమస్యలు లేకపోతే, తనను నిలువరించడం కష్టమని క్లే కోర్టు వీరుడు రాఫెల్ నాదల్ మరోసారి రుజువు చేశాడు. ఆదివారం జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో ప్రత్యర్థి స్టానిస్లాస్ వావ్రిన్కాను వరుస సెట్లలో చిత్తుచేసిన విధానమే అతని శక్తిసామర్థ్యాలకు నిదర్శనం. క్లే కోర్టును తన సొంతింటి గ్రౌండ్‌గా మార్చేసుకున్న అతను తనదైన రోజున ఏ విధంగా రెచ్చిపోతాడనేది ప్రత్యక్షంగా చూపించాడు. ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రేను ఓడించిన వావ్రిన్కాను ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓడించడమే నాదల్ ప్రతిభకు నిదర్శనం. ఫ్రెంచ్ ఓపెన్‌లోనేగాక, గ్రాండ్ శ్లామ్ టోర్నీల చరిత్రలోనే ఒకే టైటిల్‌ను పదిసార్లు సాధించిన ఏకైక ఆటగాడిగా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. కాగా, ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుందనుకున్న ఫైనల్ ఏక పక్షంగా ముగియడంతో అభిమానులు నీరసించిపోయారు. ఇది ఫైనల్ మాదిరిగానే లేదని వాపోయారు.

పారిస్, జూన్ 11: ప్రపంచ నాలుగు ర్యాంక్ ఆటగాడు రాఫెల్ నాదల్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్స్‌లో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో మూడో ర్యాంకర్ స్టానిస్లాస్ వావ్రిన్కాను వరుస సెట్లలో చిత్తుచేసి, రొలాండ్ గారోస్‌లో పదోసారి విజేతగా నిలిచాడు. గ్రాండ్ శ్లామ్ చరిత్రలోనే, ఒకే టోర్నీలో పదిసార్లు ఎవరూ గెల్చుకోలేదు. పైగా, అత్యధిక గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పీట్ సంప్రాస్ (14)ను మూడో స్థానానికి నెట్టాడు. నాదల్ ఖాతాలో ఇప్పుడు 15 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. 18 టైటిళ్లతో రోజర్ ఫెదరర్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, అతని రికార్డును బద్ధలు చేసే శక్తిసామర్థ్యాలు తనకు ఉన్నాయని నాదల్ నిరూపించుకున్నాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో అతను వావ్రిన్కాను 6-2, 6-3, 6-1 తేడాతో చిత్తుచిత్తుగా ఓడించాడు. నాదల్ ఫేవరిట్‌గానే బరిలోకి దిగినప్పటికీ, వావ్రిన్కా నుంచి అతనికి గట్టిపోటీ తప్పదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. కానీ, అందుకు భిన్నంగా, మ్యాచ్ మొత్తం ఏక పక్షంగా కొనసాగింది. క్లే కోర్టుపై నాదల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ప్రత్యర్థి ఎంత సమర్థుడైనా తనకు దాసోహం అనాల్సిందేనని నిరూపించాడు.
వింబుల్డన్ (2008, 2010), యుఎస్ ఓపెన్ (2010, 2013) టైటిళ్లను రెండేసి పర్యాయాలు గెల్చుకున్న నాదల్ 2009లో ఆస్ట్రేలియా ఓపెన్‌ను సాధించాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్‌లో అతని విజృంభణ గురించి ఎంత చెప్పినా తక్కువే. తొమ్మిది పర్యాయాలు విజేతగా నిలిచి ‘క్లే కోర్టు వీరుడు’ అనిపించుకున్న అతను పదో టైటిల్ కోసం మొదటి నుంచి తీవ్ర స్థాయిలో పోరాటం సాగించాడు. మొదటి రౌండ్‌లో బినోట్ పైర్‌ను ఓడించి, బోణీ చేసిన అతను రెండో రౌండ్‌లో రాబిన్ హాస్‌ను, మూడో రౌండ్‌లో నికోలొజ్ బాసిలాష్విలీని, ప్రీ క్వార్టర్స్‌లో రాబర్టొ బటిస్టా అగుట్‌ను ఇంటిదారి పట్టించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో పాబ్లో కారెనో బస్టాతో తలపడి మొదటి సెట్‌ను 6-2 ఆధిక్యంతో గెల్చుకున్నాడు. రెండో సెట్‌లో 2-0 తేడాతో అతను ముందంజలో ఉన్నప్పుడు బస్టా కాలి కండరాల నొప్పి కారణంగా పోటీ నుంచి వైదొలిగాడు. దీనితో సెమీ ఫైనల్ చేరిన నాదల్ అక్కడ ‘జెయింట్ కిల్లర్’ డామినిక్ థియెమ్‌ను వరుస సెట్లలో చిత్తుచేసి సత్తా నిరూపించుకున్నాడు. ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించిన థియెమ్ ఏ దశలోనూ నాదల్‌కు గట్టిపోటీని ఇవ్వలేకపోవడం గమనార్హం. ఫైనల్ సైతం అదే రీతిలో సాగింది. ఏమాత్రం ఎదురుదాడికి దిగలేకపోయిన వావ్రిన్కా వరుస సెట్లలో పరాజయాన్ని చవిచూశాడు.
వావ్రిన్కా ప్రస్థానం
మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రిన్కా కూడా అద్వితీయ ప్రతిభతో ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరాడు. మొదటి రౌండ్‌లో జొజెఫ్ కొవాలిక్‌ను, రెండో రౌండ్‌లో అలెగ్జాండర్ డొల్గొపొలొవ్‌ను, మూడో రౌండ్‌లో ఫాబియో ఫొగ్నినీని ఓడించాడు. ప్రీ క్వార్టర్స్‌లో బలమైన ప్రత్యర్థి గేల్ మోన్ఫిల్‌పై విజయం సాధించి, టైటిల్ ఫేరవిట్స్ జాబితాలో చేరాడు. క్వార్టర్ ఫైనల్‌లో మరో స్టార్ మాలిన్ సిలిక్‌పై సునాయాసంగా గెలిచి, టైటిల్ కోసం పోటీపడే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకున్నాడు. సెమీ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే ఎదురుపడినప్పటికీ ఏమాత్రం జంకకుండా పోరాటాన్ని కొనసాగించాడు. చివరికి అతనిని 6-7, 6-3, 5-7, 7-6, 6-1 తేడాతో ఓడించి ఫైనల్‌లో చోటు దక్కించుకున్నాడు. 2015లో మొదటిసారి ఫ్రెంచ్ ఓపెన్‌ను కైవసం చేసుకున్న అతను రెండోసారి టైటిల్ కోసం ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్‌ను ఢీకొన్నాడు. కానీ, ముర్రే లాంటి ఆటగాడిని ఓడించిన స్థాయి ఆటను ప్రదర్శించలేకపోయాడు. రెచ్చిపోయిన నాదల్‌ను కట్టడి చేయలేక, అతని ముందు దాసోహమన్నాడు. రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకున్నాడు.

వావ్రిన్కా గతంలో ఫ్రెంచ్ ఓపెన్‌తోపాటు ఆస్ట్రేలియా ఓపెన్ (2014), యుఎస్ ఓపెన్ (2016) గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కూడా సాధించాడు. అయితే, మరో గ్రాండ్ శ్లామ్ వింబుల్డన్‌లో మాత్రం అతను ఎన్నడూ క్వార్టర్ ఫైనల్స్ దాటలేదు.

చిత్రం.. ఫ్రెంచ్ ఓపెన్‌లో పదోసారి టైటిల్ రాఫెల్ నాదల్