క్రీడాభూమి

టాప్ ర్యాంక్ నాదల్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 12: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రికార్డు స్థాయిలో పదోసారి కైవసం చేసుకొని, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలను మెరుగుపరచుకొని, రెండో స్థానానికి చేరుకున్న ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ ఇప్పుడు టాప్ ర్యాంక్‌ను లక్ష్యంగా ఎంచుకున్నాడు. గతంలో ప్రపంచ నంబర్ వన్‌గా కొనసాగినప్పటికీ, ఆతర్వాత తరచు గాయాల బారిన పడడంతో ర్యాంక్ పతనం కొనసాగింది. సుమారు మూడేళ్లు ఆటుపోట్లకు గురైన అతను సుమారు ఏడాది కాలంగా మళ్లీ అద్వితీయ ఫామ్‌ను ప్రదర్శిస్తూ, పూర్వ వైభవాన్ని గుర్తుచేస్తున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌ను గెల్చుకోవడం ద్వారా ప్రపంచ నంబర్ వన్ స్థానాన్ని అందుకునే శక్తి తనకు ఉందని, ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు నాలుగో స్థానంలో ఉన్న నాదల్ నిరూపించాడు. 2003లో, కేవలం 14 ఏళ్ల వయసులోనే అతను తన తొలి ఎటిపి వరల్డ్ టూర్ మాస్టర్స్ మ్యాచ్‌లను గెలిచి సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. ఎన్నో రికార్డులు, ఇంకెన్నో టైటిళ్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ‘క్లే కోర్టు వీరుడు’గా ముద్ర వేయించుకున్న నాదల్ గ్రాస్, హార్డ్ కోర్టులపైనా రాణించే సత్తావున్న మొనగాడే. అయితే, బంతి చాలా నెమ్మదిగా కదిలే క్లే కోర్టులపై ఆడాలంటే ఎంతో శక్తిసామర్థ్యాలు అవసరం. అత్యుత్తమ అథ్లెట్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉంటేనే క్లే కోర్టులపై రాణించడం సాధ్యమవుతుంది. నాదల్ టెన్నిస్ ఆటగాడు కాకపోయి ఉంటే, తప్పనిసరిగా అథ్లెట్‌గా స్థిరపడేవాడు. అతని శారీర ఆకృతి ఆ విధంగా ఉంటుంది. అందుకే, క్లే కోర్టులపై అతను అద్వితీయ ప్రతిభ కనబరుస్తున్నాడు.
రికార్డుల హీరో
నాదల్‌ను రికార్డుల హీరోగా చెప్పుకోవాలి. వరుసగా ఎనిమిది గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను సాధించి, అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఓపెన్ శకం మొదలైన తర్వాత ఇంత వరకూ మరే ఇతర ఆటగాడు ఈ ఫీట్‌ను సాధించలేదు. అదే విధంగా ఒకే గ్రాండ్ శ్లామ్‌లో పది టైటిళ్లను సాధించిన ఏకైక ఆటగాడు కూడా అతనే. నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీల్లో కనీసం మూడింటిలో మూడు పర్యాయాలకు మించి ఫైనల్ చేరిన ముగ్గురు ఆటగాళ్లలో నాదల్ ఒకడు. నొవాక్ జొకోవిచ్, రోజర్ ఫెదరర్‌తో కలిసి అతను ఈ రికార్డును పంచుకుంటున్నాడు. మొత్తం మీద అతను ఇప్పటి వరకూ 15 గ్రాండ్ శ్లామ్ సింగిల్స్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు. అత్యధిక టైటిళ్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నాడు. 18 టైటిళ్లు గెల్చుకొని నంబర్ వన్ స్థానంలో ఉన్న జొకోవిచ్‌కు గట్టిపోటీనిస్తున్నాడు. కెరీర్‌లో 30 మాస్టర్స్ 1000 టైటిళ్లను అందుకొన్న నాదల్ ఈ రికార్డులో జొకోవిచ్‌కు సమవుజ్జీగా ఉన్నాడు. కాగా, ఒకే సంవత్సరం (2010)లో మూడు వేరువేరు కోర్టులపై (క్లే, గ్రాస్, హార్డ్) గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. నాలుగు గ్రాండ్ శ్లామ్ టోర్నీలనూ సాధించడాన్ని కెరీర్ గ్రాండ్ శ్లామ్ అంటారు. ఈ ఫీట్‌ను నాదల్ తన 24వ ఏటనే అందుకున్నాడు. కెరీర్ గోల్డెన్ శ్లామ్‌ను సాధించిన రెండో ఆటగాడిగా ఆండ్రీ అగస్సీ సరసన స్థానం సంపాదించాడు.
17 ఏళ్లకే ‘టాప్-100’లో చోటు
నాదల్ తన 17వ ఏటనే ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్ ‘టాప్-100’లో చోటు సంపాదించాడు. నిజానికి అతను కెరీర్ ప్రారంభించినప్పుడు ఎవరూ టెన్నిస్‌లో ఇన్ని శిఖరాలను అధిరోహిస్తాడని ఊహించలేదు. అతని చిన్నాన్న మిగుల్ ఏంజెల్ నాదల్ మంచి ఫుట్‌బాల్ క్రీడాకారుడు. స్పెయిన్ జాతీయ జట్టుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కాబట్టి, నాదల్ కూడా తని అడుగుజాడల్లోనే నడుస్తాడని, సాకర్ వీరుడిగా ఎదుగుతాడనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, నాదల్ టెన్నిస్‌పైనే మక్కువ చూపాడు. 18 ఏళ్ల వయసులోనే స్పెయిన్ డేవిస్ కప్ జట్టులో సభ్యుడయ్యాడు. నాదల్‌కు చిరకాల ప్రత్యర్థిగా రోజర్ ఫెదరర్‌ను పేర్కొంటారు. అతనితో నాదల్ 2004 మియామీ మాస్టర్స్ టోర్నీలో మొదటిసారి తలపడ్డాడు. అదే ఏడాది అతను కెరీర్‌లో మొట్టమొదటి ఎటిపి టూర్ ఈవెంట్‌ను గెల్చుకున్నాడు. 2005లో, 19 ఏళ్ల వయసులో నాదల్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో అడుగుపెట్టాడు. సంచలన విజయాలను నమోదు చేస్తూ, చివరికి ఫైనల్‌లో మారియానో ప్యూర్టాను ఓడించి విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ చరిత్రలో ఈ విధంగా మొదటి ప్రయత్నంలో టైటిల్ సాధించిన మూడో ఆటగాడిగా నాదల్ గుర్తింపు సంపాదించాడు. 2005లో అతను మూడు టోర్నీల్లో వరుసగా 16 మ్యాచ్‌ల్లో విజయాలను నమోదు చేసి, మాంటెకార్లో, బార్సిలోనా, రోమ్ ఓపెన్ టైటిళ్లను అందుకున్నాడు. 1995లో థామస్ మస్టర్ తర్వాత ఈ ఘనతను సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు. 2008 వింబుల్డన్ ఫైనల్‌లో ఫెదరర్‌ను ఢీకొన్న నాదల్ 4 గంటలా, 48 నిమిషాలు పోరాటం సాగించి, 6-4, 6-4, 6-7, 6-7, 9-7 తేడాతో గెలిచాడు. వింబుల్డన్ చరిత్రలో అదే అత్యంత సుదీర్ఘమైన ఫైనల్‌గా రికార్డుల్లోకి ఎక్కింది.

‘టాప్-10’ వీరే
ప్రపంచ ర్యాంకింగ్స్ ‘టాప్-10 జాబితాలో ఇందుకు ముందు రెండో స్థానంలో ఉన్న మాజీ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి పడిపోయాడు. రాఫెల్ నాదల్ నాలుగు నుంచి రెండో స్థానానికి చేరాడు. మొదటి పది స్థానాల్లో ఉన్న ఆటగాళ్ల వివరాలు..
1. ఆండీ ముర్రే (బ్రిటన్), 2. రాఫెల్ నాదల్ (స్పెయిన్), 3. స్టానిస్లాస్ వావ్రిన్కా (స్విట్జర్లాండ్), 4. నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), 5. రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్), 6. మిలోస్ రోనిక్ (కెనడా), 7. మారిన్ సిలిక్ (క్రొయేషియా), 8. డామినిక్ థియెమ్, 9. కెయ్ నిషికొరీ, 10. అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ).

చిత్రం.. రాఫెల్ నాదల్