క్రీడాభూమి

లోధా సిఫారసులపై అధ్యయన కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 27: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును ప్రక్షాళన చేసేందుకు జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసుల్లో రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వ్యతిరేకిస్తున్న కొన్ని కఠినమైన సిఫారసులను అధ్యయనం చేసేందుకు బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. బిసిసిఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో పాటు టిసి.మాథ్యూ (కేరళ క్రికెట్ సంఘ మాజీ అధ్యక్షుడు), నబా భట్టాచార్జీ (మేఘాలయ క్రికెట్ సంఘ కార్యదర్శి), జే షా (గుజరాత్ క్రికెట్ సంఘ కార్యదర్శి, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు), బిసిసిఐ కోశాధికారి అనిరుధ్ చౌదరిలను సభ్యులుగా నియమించారు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల అమలు విషయమై బిసిసిఐ పాలక మండలికి సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని కఠినమైన అంశాలను అధ్యయనం చేసి బిసిసిఐకి నివేదిక సమర్పిస్తుంది. ఆ తర్వాత బిసిసిఐ ఈ అంశాలను పరిశీలించి తుది నివేదికను సుప్రీం కోర్టు ముందు ఉంచుతుంది. సోమవారం ముంబయిలో జరిగిన బిసిసిఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఈ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
లోధా కమిటీ సిఫారసుల అమలు విషయమై సుప్రీం కోర్టు వచ్చే నెల 14వ తేదీన తదుపరి విచారణ జరుపనున్నందున పైన నిర్దేశించిన పనిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు తక్షణమే సమావేశమై, జూలై 10వ తేదీలోగా నివేదికను అందుబాటులోకి తీసుకురావాలని ఈ కమిటీని కోరడం జరిగిందని, ఆ తర్వాత బిసిసిఐ దీనిని పరిశీలించి సుప్రీం కోర్టు విచారణకు ముందే ఈ నివేదికను ఖరారు చేస్తుందని అమితాబ్ చౌదరి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ కమిటీ చర్చల వివరాలను ఎప్పటికప్పుడు బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె.ఖన్నాకు తెలియజేయడంతో పాటు నివేదికను కూడా ఆయనకే సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల్లోని కొన్ని అంశాలు, ప్రత్యేకించి ఒక రాష్ట్రానికి ఒకే ఓటు కల్పించడం, అధికారులకు 70 ఏళ్ల వయో పరిమితి విధించడం, వరుసగా రెండు పర్యాయాలు పాలక మండలిలో పదవులను అనుభవించిన వారికి ఆ తర్వాత మూడేళ్ల పాటు విశ్రాంతిని ఇవ్వడం (కూలింగ్ ఆఫ్ పిరియడ్), సెలెక్షన్ కమిటీ పరిమాణం లాంటి వివాదాస్పద అంశాలు ఈ సిఫారసుల అమలు ఆలస్యమయ్యేందుకు కారణమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటువంటి వివాదాస్పద అంశాలపై అధ్యయనం జరిపేందుకు ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీలోని కొంత మంది సభ్యులు కూడా బిసిసిఐలో ఒకటి కంటే ఎక్కువ పదవుల్లో కొనసాగుతుండటం గమనార్హం. ఈ కమిటీకి సారథ్యం వహిస్తున్న రాజీవ్ శుక్లా ఒకవైపు బిసిసిఐ సీనియర్ అధికారి గానూ, మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) పాలక మండలి చైర్మన్‌గానూ కొనసాగుతుండగా, ఈ కమిటీలో సభ్యుడైన సౌరవ్ గంగూలీ అటు బెంగాల్ క్రికెట్ సంఘ అధ్యక్షునిగానూ, ఇటు బిసిసిఐ క్రికెట్ సలహా కమిటీ సభ్యుడిగానూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

చిత్రం.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బిసిసిఐ సీనియర్ అధికారి రాజీవ్ శుక్లా