క్రీడాభూమి

వింబుల్డన్ క్వీన్ ముగురుజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూలై 15: వింబుల్డన్ గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను మరోసారి కైవసం చేసుకోవాలన్న వీనస్ విలియమ్స్ కలలకు గార్బెనె ముగురుజా గండి కొట్టింది. గతంలో ఐదు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచిన వీనస్‌ను ఆమె 7-5, 6-0 తేడాతో, వరుస సెట్లలో ఓడించింది. మొదటి సెట్‌లో తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ వీనస్ తన ప్రత్యర్థికి కళ్లెం వేయలేకపోయింది. దీనితో నిరాశకు గురైన ఆమె పదేపదే పొరపాట్లు చేస్తూ, ఓటమిని కొనితెచ్చుకుంది. ఫిట్నెస్ సమస్య కూడా వీనస్‌ను వేధిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండో సెట్‌లో పలుమార్లు విశ్రాంతి కోరవడం, ఒక్క పాయింట్ కూడా గెల్చుకోలేక ముగురుజా ముందు దాసోహమనడం ఈ వాదనకు బలాన్నిస్తున్నది. కాగా, నిరుడు ఫ్రెంచ్ ఓపెన్‌లో గెలిచిన ముగురుజా కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను సాధించింది. వింబుల్డన్‌లో ఆమె విజేతగా నిలవడం ఇదే మొదటిసారి. 2015లో వింబుల్డన్ ఫైనల్ చేరినప్పటికీ, సెరెనా విలియమ్స్ చేతిలో ఓడిన ముగురుజా ఈసారి ఆమె సోదరి వీనస్‌ను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక టోర్నీ టైటిల్‌ను సగర్వంగా అందుకుంది. మొదటి సెట్ హోరాహోరీగా సాగడంతో, రెండో సెట్ కూడా అదే తీరులో ఆకట్టుకుంటుదని, ఇరువురూ విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతారని అభిమానులు ఆశించారు. కానీ, వీనస్ ఏ దశలోనూ సరైన పోటీ ఇవ్వలేకపోయింది. ప్రత్యర్థి ఆధిపత్యానికి తలవంచి, రన్నరప్ ట్రోఫీతో సరిపుచ్చుకుంది.

ముగురుజా స్పెయిన్‌లో పుట్టింది. ఆమె తల్లి వెనెజులా దేశస్థురాలు. చిన్నతనంలోనే టెన్నిస్ ప్రాక్టీస్ ఆరంభించిన ఆమె ఆరేళ్లు బార్సిలోనాలోని బ్రుగెరా టెన్నిస్ అకాడెమీలో ప్రత్యేక శిక్షణ పొందింది. స్పెయిన్ నుంచి రాఫెల్ నాదల్ టెన్నిస్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్న నేపథ్యంలో, అతనిని మార్గదర్శకుడిగా తీసుకున్న ముగురుజా కూడా అదే స్థాయిలో చెమటోడ్చింది. అనుకున్నది సాధిస్తున్నది. కెరీర్‌లో రెండో గ్రాండ్ శ్లామ్ టైటిల్‌ను అందుకొని, ప్రపంచ మేటి స్టార్లను సైతం చిత్తుచేసే సత్తా తనకు ఉందని నిరూపించుకుంది.

వీనస్ విలియమ్స్‌తో గార్బెన్ ముగురుజా ఢీకొనడం ఇది ఐదోసారి. గతంలో జరిగిన నాలుగు పోరాటాల్లో మూడు పర్యాయాలు ఆమె పరాజయాలను చవి చూసింది. ఒకసారి మాత్రమే విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి గెలవడం ద్వారా వీనస్ హెడ్ టు హెడ్ ఆధిక్యాన్ని 2-3కు తగ్గించింది.

చిత్రాలు.. కెరీర్‌లో తొలి వింబుల్డన్ టైటిల్ సాధించిన గార్బెనె ముగురుజా
*వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ఓడిన వీనస్ విలియమ్స్