క్రీడాభూమి

టీమిండియాకు 309 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాలే, జూలై 28: గాలేలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 309 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ప్రత్యర్థిని మొదటి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ ఆతర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లకు 189 పరుగులు చేసింది. దీనితో భారత్ మొత్తం ఆధిక్యం 498 పరుగులకు చేరింది. ఇంకా ఏడు వికెట్లు చేతిలో ఉండగా, రెండు రోజుల ఆట మిగిలి ఉంది. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 600 పరుగులకు సమాధానంగా తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన శ్రీలంక మ్యాచ్ రెండో రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 5 వికెట్లకు 153 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఓవర్ నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి 206 పరుగుల వద్ద మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ వికెట్‌ను కోల్పోయింది. అతను 130 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 83 పరుగులు చేసి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. వికెట్లు పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడమేగాక, భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొని పరుగులను రాబట్టేందుకు దిల్‌రువాన్ పెరెరా విశేషంగా కృషి చేశాడు. అయితే, రంగన హెరత్ (9), నువాన్ ప్రదీప్ (10), లాహిరు కుమార (2) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అసదల గురణత్నే గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. దీనితో, లంక ఇన్నింగ్స్ 78.3 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. దిల్‌రువాన్ పెరెరా 132 బంతులు ఎదుర్కొని, పది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 92 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. ఉపుల్ తరంగ, ఏంజెలో మాథ్యూస్, దిల్‌రువాన్ పెరెరా అర్ధ శతకాలతో రాణించకపోతే, లంక పరిస్థితి మరింత దారుణంగా మారేది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 67 బంతులు ఎదుర్కొని మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీ 45 పరుగులకు రెండు వికెట్లు సాధించాడు. ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్య తలా ఒక వికెట్ పంచుకున్నారు.
ఫాలోఆన్ ఇవ్వని కోహ్లీ
మొదటి ఇన్నింగ్స్‌లో 309 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించడంతో శ్రీలంకకు ఫాలోఆన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుకు సుముఖత వ్యక్తం చేయకుండా, రెండో ఇన్నింగ్స్‌ను ఆడాలని నిర్ణయించాడు. జట్టు స్కోరు 19 పరుగుల వద్ద, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శిఖర్ ధావన్ (14)ను దనుష్క గుణతిలక క్యాచ్ పట్టుకోగా దిల్‌రువాన్ పెరెరా అవుట్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 12 పరుగులకే అవుటైన ఓపెనర్ అభినవ్ ముకుంద్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాన్ని సాధించడం విశేషం. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మరో ఆటగాడు చటేశ్వర్ పుజారా 35 బంతుల్లో 15 పరుగులు చేసి, లాహిరు కుమార బౌలింగ్‌లో కుశాల్ మేండిస్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అభినవ్ ముకుంద్ 116 బంతులు ఎదుర్కొని, ఎనిమిది ఫోర్లతో 91 పరుగులు సాధించి దనుష్క గుణతిలక బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యాడు. మూడో వికెట్‌కు విరాట్ కోహ్లీతో కలిసి 133 పరుగులు జోడించిన అతను అవుటైన వెంటనే, మూడో రోజు ఆటను ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. అప్పటికి భారత్ 46.3 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (144 బంతుల్లో, ఐదు ఫోర్లతో 76) క్రీజ్‌లో ఉన్నాడు. లంక బౌలర్లలో దిల్‌రువాన్ పెరెరా, లాహిరు కుమార, దనుష్క గుణతిలక తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.

*్భరత కెప్టెన్ విరాట్ కోహ్లీ గత ఏడు టెస్టు ఇన్నింగ్స్‌లో వరుసగా 38, 0, 13, 12, 15, 6, 3 చొప్పున స్వల్ప స్కోర్లకే అవుటై అభిమానులను నిరాశ పరిచాడు. అయితే, ఈ మ్యాచ్‌లో అతను మూడో రోజు ఆట ముగిసే సమయానికి 76 పరుగులతో నాటౌట్‌గా నిలవడం ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
* భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో మూడు వందలకుపైగా ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, ప్రత్యర్థికి ఫాలోఆన్ ఇవ్వకపోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు, 2007లో ఇంగ్లాండ్‌తో ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 319 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసినప్పటికీ, అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ రెండో ఇన్నింగ్స్ ఆడేందుకే మొగ్గు చూపాడు. ఆ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇప్పుడు భారత్‌కు 309 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినా కెప్టెన్ విరాట్ కోహ్లీ శ్రీలంకకు ఫాల్‌ఆన్ ఇవ్వలేదు.
* శ్రీలంకలో భారత్‌కు ఒక టెస్టులో ఇదే అత్యధిక ఆధిక్యం. 2015లో లంక పర్యటనకు వెళ్లినప్పుడు గాలేలోనే జరిగిన టెస్టులో టీమిండియా 192 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్‌లో 309 పరుగుల ఆధికాన్ని నమోదు చేసింది.
* దిల్‌రువాన్ పెరెరా గత 4 టెస్టు ఇన్నింగ్స్‌లో యాభై లేదా అంతకు మించి పరుగులు చేయడం ఇది మూడోసారి. అతను మొత్తం మీద సాధించిన టెస్టుల్లో ఐదు అర్ధశతకాల్లో మూడు గాలే మైదానంలో నమోదు చేసినవే.

* ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 83 పరుగులు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ 2015లో భారత్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 339 పరుగులు సాధించాడు. ఆ స్కోరులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. లంక తరఫున ఆ సిరీస్‌లో అతనే టాప్ స్కోరర్.
* వర్షం కారణంగా 83 నిమిషాల పాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. దీనితో మ్యాచ్‌ని సాయంత్రం ఆరు గంటల వరకూ పొడిగించారు. మూడు రోజుల ఆట ముగియగా, చివరి రెండు రోజుల ఆటలోనూ వర్షం బెడద ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతున్నది.

చిత్రం.. మూడు వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా